Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఏమైంది.? ప్రభుత్వం అన్నా, ప్రజలన్నా భయపడుతోందా? లేక తనకు ముప్పు తప్పదనే భయంతోనే వెనుకడుగు వేస్తుందా? వరుసగా ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయలు పరిశీలిస్తే ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమితో తెలుగుదశం పార్టీ పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకుంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ ప్రకటించినప్పటికీ ఓటమి తప్పదనే భయంతో వెనుదిరిగిందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలను కూడా బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు 20వ తేదీన అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆ రోజు ఉదయం 9 గంటలకు రెండు చోట్లా సమావేశం ప్రారంభమవుతుంది. కోవిడ్–19 ఉధృతి, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఈ సమావేశాలను ఒక రోజుకే పరిమితం చేయాలా? లేదా మరి కొన్ని రోజులు నిర్వహించాలా అనే విషయంపై శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా తీవ్రస్థాయిలో ఉన్నందున ఒకే రోజు సమావేశాలు ముగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సమావేశాలను బహిష్కరించాలని టీడీఎల్పీ నిర్ణయించిదట. మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించాలని సభ్యులు నిర్ణయించారు.రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. కరోనా నియంత్రణలో విఫలమైందని ఆరోపించారు.
కరోనా మొదలు రాష్ట్రంలో చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు. ఇలాంటి నేపథ్యంలో.. కేవలం ఒకేరోజు సమావేశాలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక రోజు సమావేశాలతో జగన్ తన ప్రభుత్వాన్ని పొగిడించుకోవాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే, దీనికి వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. కరోనాకు భయపడి హైదరాబాద్ నుంచి రావటం ఇష్టంలేక డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఒక్కపూట జరిగినా ప్రతిపక్ష నేతగా ఉపయోగించుకోవాలని ఆయన హితవు పలికారు. ఏదేమైనా అటు రాజ్యాంగబద్దమైన ఎన్నికలను, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ సభ్య సమాజానికి టీడీపీ ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుందో తెలియదు కానీ, ఆ పార్టీకి మాత్రం ప్రజలు దుకాణ మూత తప్పదన్న మెసేజ్ లు ఇస్తున్నారు.