iDreamPost
android-app
ios-app

విమర్శలు చేస్తే చర్యలుంటాయని హెచ్చరించే పరిస్థితి టీడీపీకి ఎందుకు వచ్చింది..?

విమర్శలు చేస్తే చర్యలుంటాయని హెచ్చరించే పరిస్థితి టీడీపీకి ఎందుకు వచ్చింది..?

‘‘పార్టీ నియమావళికి విరుద్ధంగా నాయకులపైగానీ, పార్టీపైగానీ ఎవరైనా బహిరంగంగా విమర్శలు చేసినా, ప్రసార మాధ్యమాల్లో మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’’ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ స్థానిక లేదా కేంద్ర కార్యాలయానికి తెలపాలని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.

అచ్చెం నాయుడు లేఖ తెలుగుదేశం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు నేతల నుంచి, తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. నాలుగు పదుల వయస్సు ఉన్న పార్టీ, పలుమార్లు అధికారం చేపట్టిన పార్టీకి, అపర చాణక్యుడు అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయకత్వంలో ఉన పార్టీకి ఈ దుస్థితి పట్టడానికి కారణం ఏమిటి..? చంద్రబాబుపై నమ్మకం లేకనే పార్టీ నేతలు, శ్రేణులు విమర్శలు ఎక్కుపెట్టారా..? క్రమశిక్షణ కలిగిన పార్టీ తమదని చెప్పుకున్న టీడీపీ.. ఇప్పుడు కట్టుతప్పితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామనే దశకు ఎలా దిగజారింది..?

బాబుపై అపనమ్మకమే..

పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అపనమ్మకం ఫలితమే ఈ విమర్శలని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. బాబు సత్తాపై ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఓ అంచనాకు వచ్చారు. బాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన రెండు సార్లు ఇతర పార్టీలతో పొత్తుతో పోటీ చేశారు. పొత్తు లేకుండా పోటీకి వెళితే.. బాబు సత్తా ఏమిటో 2019లో తేలిపోయింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో.. బాబు ప్రజల విశ్వాసం కూడా కోల్పోయారు. ఈ విషయం క్షేత్రస్థాయిలో ఉన్న నేతలకు అర్థమైంది.

ఇక పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బాబు నాయకత్వంలో పార్టీ భవిష్యత్‌ ఎలా ఉండబోతోందో శ్రేణులకు స్పష్టంగా తెలిసింది. ఇక బాబు వల్ల కాదని తెలుసుకున్న తమ్ముళ్లు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపాలని చంద్రబాబు వద్దనే బహిరంగంగా డిమాండ్‌ చేశారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు వేస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్‌ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. పలువురు నేతల అభిప్రాయం కూడా ఇదే అయినా వారు బహిరంగంగా మాట్లాడడం లేదంతే.

వద్దన్నా.. బలవంతంగా రుద్దుతున్నారనే అసంతృప్తి..

పార్టీ నేతలు, శ్రేణుల అసంతృప్తికి మరో కారణం నారా లోకేష్‌. గత ప్రభుత్వ హాయంలో ఎమ్మెల్సీగా పెద్దల సభకు వెళ్లి.. మూడు శాఖలకు మంత్రిగా పని చేశారు లోకేష్‌. 2019 ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో పోటీచేసినా ఓడిపోయారు. పార్టీని నడిపించే క్రమంలో కొత్త చిక్కులు తెస్తున్నారు. పార్టీ భావి సారధి అని ప్రొజెక్ట్‌ అవుతున్న నారా లోకేష్‌ సత్తా ఏమిటో ఇప్పటికే తమ్ముళ్లకు అర్థమైంది. పార్టీ అధికారంలోకి వస్తే.. తమకు ప్రయోజనం ఉంటుందని కార్యకర్తలు, నేతలు భావిస్తారు. అయితే లోకేష్‌ వల్ల అది సాధ్యం కాదని భావిస్తున్నా.. చినబాబే నాయకుడని తమపై బలవంతంగా రుద్దుతున్నారనే అసంతృప్తితో తమ్ముళ్లున్నారు.

తమ్ముళ్లకే నచ్చడం లేదు..

వైసీపీ ప్రభుత్వం పాలన ప్రజలకే కాదు తమ్ముళ్లకూ నచ్చుతోంది. అర్హత ఆధారంగా పథకాలు అందించడం, పరిపాలనలో సంస్కరణల వల్ల ప్రభుత్వ సేవలు సులువుగా అందడం, గ్రామస్థాయి నేతల జోక్యం లేకుండా వలంటీర్‌ వ్యవస్థ ద్వారా సేవలు లభిస్తుండడం.. తమ్ముళ్లను ఆకర్షించింది. బాబు హాయంలో జన్మభూమి కమిటీల ద్వారా సాగించిన దురాఘాతాలు వారికి గుర్తున్నాయి. హమీల అమలు, వివక్ష లేని పరిపాలనతో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం లేకపోయినా.. పనిగట్టుకుని విమర్శలు చేసేందుకు టీడీపీ కొత్త అవకాశాలను సృష్టించుకుంటోంది. అవి ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. అందుకే తమ్ముళ్లు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకే అచ్చెం నాయుడు.. కార్యక్రమాలపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ ప్రత్యేకంగా కోరుతున్నారు.

Also Read : సీఎం జగన్‌పై అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు