కన్ఫ్యూజన్‌ కంటిన్యూస్‌..!

‘‘మేం చాలా క్లియర్‌గా ఉన్నాం..’ అంటూ తరచూ చెప్పే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీలో అంత క్లారిటీ ఉన్నట్టు జనానికి తోచడం లేదు. 2019 ఫలితాల తరువాత బాబులో క్లారిటీ మిస్సైందనే అంటున్నారు. క్లారిటీ మిస్సవ్వడంతో పాటు కన్ఫ్యూజన్‌ కొనసాగుతోందని వివరిస్తున్నారు. ప్రజల మెప్పు పొందడం, అధికార వైఎస్సార్‌సీపీని రాజకీయంగా ఎదుర్కొవడంలో ఈ కన్ఫ్యూజన్‌ స్పష్టంగా బైటపడుతోందన్నది ప్రజల నుంచి విన్పిస్తున్న పక్కా అభిప్రాయం.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈ కన్ఫ్యూజన్‌ మరోసారి బైటపడిందంటున్నారు. ఓ పక్క కరోనా విజృంభించేస్తోంది.. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అంటూ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జూమ్‌ మీట్లలో చెప్పడం ఆపనేలేదు. మరో పక్క ఏపీకి కొత్త అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మాత్రం కరోనా ప్రభావం పెద్దగా లేదు.. ఎన్నికలు నిర్వహించేయండి అంటూ ఎన్నికల సంఘానికి చెప్పుకొస్తున్నారు. జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల అభిప్రాయాల్లోనే కన్ఫ్యూజన్‌ బైటపడడంతో ఇప్పుడు మరోసారి దీనిని గురించి తీవ్ర చర్చకే అవకాశం ఇస్తున్నారు.

ప్రభుత్వాన్ని విమర్శలు చేయాలన్న లక్ష్యంతో మద్యం దుకాణాలు తెరిచేసారు అందుకే కరోనా పెరిగిపోతోంది అని టీడీపీ జాతీయ అధ్యక్షుడి నుంచి స్థానిక నేతల వరకు మైకుల ముందుకొచ్చేసారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేయాలని ఒత్తిడీ వారే చేస్తున్నారు. అంటే ఎన్నికల ప్రచారం, ఆ తరువాత జరిగే తతంగాలప్పుడు కరోనా వైరస్‌ రాదన్నది వారి నమ్మకమా? అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి వెంటనే తలాడిస్తూ, ఆయనకు మద్దతుగా నిలబడుతుండడాన్ని కూడా జనం ప్రస్తావిస్తున్నారు.

నిమ్మగడ్డ ఎన్నికలు వద్దంటే వద్దు, జరిగిపోవాలంటే జరిగిపోవాలంటూ భిన్నవాదనలు చేస్తున్న టీడీపీ నాయకుల వ్యవహారతీరును తప్పుపడుతున్నారు. ఆ కార్యక్రమంచేయండి, ఆ పోరాటం చేయండి అంటూ.. జూమ్‌లో ఆదేశాలిచ్చేస్తున్న చంద్రబాబునాయుడు నేరుగా ప్రజల్లోకి రావడం లేదు. దీనికి కోవిడ్‌ 19 కారణమని చెబుతున్నారు. అయితే ఆయనకు మాత్రం జాగ్రత్తలు పాటించి మేం మాత్రం జన సమూహాల్లోకి వెళ్ళాలా అన్న చర్చకూడా సొంత పార్టీ నేతల మధ్య నడుస్తున్నట్టుగా చెబుతున్నారు. కేవలం నమ్మగడ్డకు మద్దతుగా నిలబడడం కోసం మాత్రమే చంద్రబాబు, ఆయన పార్టీనేతలు స్థానిక సంస్థల ఎన్నికల ఊసెత్తుతున్నారంటున్నారు. అంతే తప్ప ఒక వేళ ఎన్నికలు గనుక ప్రకటిస్తే చంద్రబాబునాయుడు, లోకేష్‌లతోపాటు, ఎంత మంది నాయకులు ఎన్నికల ప్రచారానికి నేరుగా జనంలోకి వస్తారు? అన్న ప్రశ్నను కూడా సంధిస్తున్నారు. ఇదంతా గమనించిన ఇంకొందరు జరగని పెళ్ళికి సన్నాయిమేళం.. మాదిరిగా తమ పార్టీతీరు ఉందంటూ లోలోపలే కామెంట్లు చేసుకుంటున్నారని టాక్‌.

ఎన్నికల్లో ఓటమి తరువాత తీసుకుంటున్న అనేక నిర్ణయాలు టీడీపీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయని పరిశీలకుల భావన. పదేపదే విమర్శకులకు కూడా పని చెప్పే విధంగా ఆ పార్టీ తీరు ఉంటోందంటున్నారు. అయితే వీటిని గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా టీడీపీ వేస్తున్న అడుగుల్లో తప్పటడుగులే ఎక్కువగా ఉండడం ఆ పార్టీ అభిమానులను కలవరపరుస్తోందట.

Show comments