iDreamPost
android-app
ios-app

చంద్రబాబు కృష్ణా డెల్టా రైతులును నిందించడంలో అర్థముందా..?

చంద్రబాబు కృష్ణా డెల్టా రైతులును  నిందించడంలో అర్థముందా..?

సందర్భం వచ్చినప్పుడల్లా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో చవిచూసిన ఘోర ఓటమిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదని ఒకసారి, తనను ఓడించడం వల్ల ప్రజలే నష్టపోయారని మరోసారి.. ఎన్నికల ఫలితాలను గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు.. తాజాగా కృష్ణా డెల్టా రైతులపై తన అక్కసును వెల్లగక్కారు. పట్టిసీమ నీళ్లు తాగిన కృష్ణా డెల్టా రైతులు టీడీపీకి ఓటు వేయలేదన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను నీళ్లు ఇచ్చినా.. కృష్టా డెల్టా రైతులు ఓటు వేయలేదంటూ వారిని నిందించేలా మాట్లాడారు చంద్రబాబు.

హమీలు మరచిపోయారా..?

తన ఓటమికి ప్రజలను నిందిస్తున్న చంద్రబాబు.. అసలు టీడీపీకి ప్రజలు ముఖ్యంగా రైతులు ఎందుకు ఓటు వేయలేదనే విషయం ఎప్పుడు తెలుసుకుంటారన్నది అర్థంకాకుండా ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే ప్రజలు తనను దారుణంగా ఓడించారని చంద్రబాబుకు తెలియంది కాదు. టీడీపీ ఓటమికి చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమేనని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల మోసపోని వారు అంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకూ 2 వేల నిరుద్యోగ భృతి, కాపులను బీసీల్లో చేర్చడం, దోబీలను ఎస్టీలలో చేరుస్తామని.. ఇలా 650 హామీల ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అందులో ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. దాని ఫలితమే 2019లో ఘోర ఓటమి.

Also Read : టీడీపీకి అతనితో తలనొప్పులే..

రైతులకు జరిగిన నష్టం అపారం..

చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల అధికంగా నష్టపోయింది రైతులు, డ్వాక్రా మహిళలు. రుణమాఫీ చేస్తానని, ఎవరూ బ్యాంకు రుణాలు కట్టవద్దని చెప్పడంతో.. 2009లో వైఎస్సార్‌ హాయంలో జరిగినట్లు రుణమాఫీ జరుగుతుందని రైతులు ఆశించారు. బాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించలేదు. కానీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు భేషరతుగా రైతు పంట, బంగారు రుణాలను మాఫీ చేస్తానన్న హామీని అటకెక్కించారు. కోటయ్య కమిటీని ఏర్పాటు చేసి.. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరుతో 87 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను దాదాపు 25 వేల కోట్లకు కుదించారు. అనేక షరతులు పెట్టి.. చివరకు వాయిదాకు నాలుగు వేల కోట్ల రూపాయల చొప్పన ఐదు వాయిదాల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి.. మూడు వాయిదాల్లో 12 వేల కోట్ల రూపాయలు రైతులు ఖాతాల్లో జమ చేశారు. ఆ మొత్తం వడ్డీలకు కూడా సరిపోలేదు. చివరి రెండు వాయిదాలకు నామం పెట్టారు.

మూడేళ్లపాటు రుణాలు చెల్లించకపోవడంతో రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. పావలా వడ్డీకి రుణం తీసుకుని, పంట చేతికి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే తిరిగి చెల్లించే రైతులు.. బాబు ఇచ్చిన హామీని నమ్మి మోసపోయారు. మూడేళ్ల తర్వాత చక్రవడ్డీతో కలిపి రుణం చెల్లించారు. ఓ వైపు రుణం తీసుకునే అవకాశం కోల్పోయి.. మరో వైపు అధిక వడ్డీని బ్యాంకులు చెల్లించడంతో.. ఆర్థికంగా నష్టపోయారు. తాను ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల జరిగిన నష్టం ఏమిటో తెలుసుకోకుండా.. రైతులు నాకు ఓట్లేయలేదు.. అంటూ చంద్రబాబు మాట్లాడుతుండడం.. ఆయన అవివేకమవుతుంది. తానేం తప్పుచేయలేదు.. రైతులకు మంచే చేశానంటూ.. ఓట్లు వేయకపోవడంపై రైతులను నిందించే రాజకీయాలు వదిలి.. చంద్రబాబు వాస్తవాలను ఎప్పుడు అంగీకరిస్తారో..?

Also Read: జగన్‌ పాలన గొప్పగా ఉంది.. చంద్రబాబు మాటలే నిదర్శనం