Idream media
Idream media
కవితకు కాదేది అనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ.. తమ రాజకీయానికి కాదేది అనర్హం అనేలా సాగుతోంది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష టీడీపీ రాజకీయ వ్యవహారం. వైఎస్ జగన్ సర్కార్ కొత్తగా సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా, విధానపరమైన నిర్ణయం తీసుకున్నా.. ప్రజా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహించినా.. ఇలా ఏదైనా సరే రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ఖైదీల విడుదలను కూడా టీడీపీ నేతలు తమ రాజకీయానికి వాడుకుంటున్న వైనమేఅందరిని విస్మయపరుస్తోంది.
పలు నేరాల్లో శిక్ష పడి సత్ప్రవర్తన కలిగి, వయస్సుపైబడిన వారిని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే సాంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అయితే ఈ సారి కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ప్రక్రియ ప్రతి ఏడాది మారిదిగా సాగలేదు. తాజాగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గతంలో మహిళా, పురుష ఖైదీలకు కలిపి నిబంధనలు రూపొందించగా.. ఇప్పుడు వేర్వేరుగా విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని జగన్ సర్కార్ తలపెట్టింది. ఇందులో భాగంగా మొదట మహిళల విడుదలకు నిర్ణయం తీసుకుంది.
అయితే మహిళా ఖైదీల విడుదలపైనా రాజకీయం చేస్తున్న టీడీపీ.. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌కు మడిపెట్టి విమర్శలు చేస్తోంది. అస్మదీయులు ఉన్నందునే వైఎస్ జగన్ 55 మంది మహిళా ఖైదీల విడుదలకు ఆసక్తి చూపుతున్నారంటూ టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ‘‘ గతంలో ఎన్నడూ లేని విధంగా 55 మంది మహిళా ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏమిటి ఈ ఉత్సాహం అని ఆరా తీస్తే, అందులో ఎక్కువ మంది అస్మదీయులటా. ఖైదీలన్నా, జైలన్నా, కోర్టులన్నా, కేసులన్నా, ముద్దాయిలన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ మక్కువ చూపుతోంది. కారణం.?? అస్మదీయులన్న అభిమానమా..? మరేదైనాన..?’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.
ఖైదీల విడుదలలోనూ తమ కడుపుమంటను చూపుతూ.. దానికి వైఎస్ జగన్‌కు లింపు పెట్టి విమర్శలు చేస్తున్న వర్ల రామయ్య తీరు హర్షించలేని విధంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రామయ్య చెప్పినట్లు.. అస్మదీయులైతే.. వారు ఎవరో..? వారి పేర్లు ఏమిటో బయటపెట్టవచ్చు కదా..? అనే ప్రశ్న వైసీపీ నుంచి వినిపిస్తోంది. అస్మదీయులటా..? అంటూనే మళ్లీ అస్మదీయులనే అభిమానమా..? మరేదైనాన..? అన్న వర్ల రామయ్య.. ఈ విషయంపై జగన్‌పై విమర్శలు చేసేందుకు తాను చీకట్లో రాయి విసిరానన్న విషయం ఆయనకు అర్థం కాకపోయినా.. ఆ ట్వీట్ చూసిన వారికి అర్థం అయింది. అందుకే రామయ్యపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఖైదీల విడుదలలో సుప్రిం కోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఏ ప్రభుత్వమైనా జాబితాను రూపొందిస్తుంది. కిడ్నాప్ కేసులలో శిక్ష పడిన వారు, రేప్ కేసులో శిక్ష పడిన మహిళలు, మరణ శిక్ష పడిన ఖైదీలు, మూడేళ్లలో జైలు నుంచి పరారైన జీవిత ఖైదీలు, పెరోల్, పర్లోపై వెళ్లి ఆలస్యంగా జైలుకు వచ్చిన వారు అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముద్దాయిలు, ముఠా తగాదాలలో శిక్ష పడిన వారు, నార్కో అనాలసిస్ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారు, దేశ ద్రోహం కేసులు ఎదుర్కొంటున్న వారు, కిరాయి హంతకులు కూడా అనర్హులే. ఇంత పక్కాగా నిబంధనలు ఉంటే.. మాజీ పోలీసు అధికారి అయిన వర్ల రామయ్య ఇలాంటి చౌకబారు విమర్శలు చేసి తన స్థాయిని తానే తగ్గించుకున్నారనడంలో సందేహం లేదు.