Idream media
Idream media
ఓ పక్క మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు దాదాపు 50 శాతం పైగా పోలింగ్ నమోదైంది. ఈ సమయంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చారు. ఉదయం నుంచి కుప్పం నేతలతో పోలింగ్ తీరుపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. సలహాలు, సూచనలు చేశారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ సరళిని గమనించిన చంద్రబాబు.. తమకు అనుకూలంగా పరిస్థితి లేదని గ్రహించినట్లుగా ఉన్నారు. మీడియా సమావేశంలో.. ప్రభుత్వం, ప్రజలు, ఎన్నికల కమీషన్, పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాపనార్థాలు పెట్టారు.
తప్పుడు పనులు చేసిన తాము గెలిచామని అనిపించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి దారుణంగా వ్యవహరిస్తున్నారని మాట్లాడారు. ఓటర్లకు డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారని, ఏజెంట్లను అరెస్ట్ చేశారని.. చంద్రబాబు ఆరోపించారు. దొంగ ఓట్లు వేసేందుకు ప్రజలకు సిగ్గు ఉండాలన్నారు. ఎస్‌ఈసీకి ఎన్నికలు చేతగాకపోతే వెళ్లిపోవాలన్నారు. పోలీసులు వివక్ష చూపుతున్నారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు మైండ్ గేమ్ అడుతున్నారని ఆరోపించారు. తాము మున్సిపల్ ఎన్నికల కోసం మాట్లాడడంలేదని, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన టీడీపీ ఎక్కడికీ పోదన్నారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసిందన్నారు చంద్రబాబు.
ఇలా మాట్లాడిన చంద్రబాబు.. మరో దశలో కుప్పం ప్రజలపై ప్రశంసల జల్లు కురిపించారు. అధికార పార్టీ ఎంత చేసినా.. భయపడకుండా పోరాడారని, ఓట్లు వేస్తున్నారని అభినందించారు. కుప్పం ప్రజలు నీతికి, నిజాయితీకి మారుపేరని కొనియాడారు. కుప్పం ప్రశాంతమైన ప్రాంతమన్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ఉన్నా.. కుప్పంలో అక్రమాలకు తావులేదన్నారు.
పోలింగ్ జరుగుతుండగానే.. చంద్రబాబు ఈ తరహాలో మాట్లాడడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతోంది. ముఖ్యంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో.. ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందని ఆయన మాటల్లో తెలుస్తోంది. దొంగ ఓట్లు వేస్తున్నారని, ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారని, వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారని మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ టీడీపీకి అనుకూలంగా జరగలేదని చెప్పకనే చెప్పారు. ఈ ఎన్నికల కోసం తాము మాట్లాడడం లేదంటూనే.. కుప్పం ప్రజలపై ప్రశంసల జల్లు కురిపించడం చూస్తే.. ఇకపై జరిగే పోలింగ్‌లోనైనా ఓటర్లు టీడీపీ వైపు మొగ్గుతారనే ఆశ చంద్రబాబులో కనిపిస్తోంది. బుధవారం వెల్లడయ్యే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చంద్రబాబు మాటలతోనే అర్థమైంది.
Also Read : Kuppam Elections – కుప్పం కోటలో వైసీపీ గెలుపు పక్కా ?