Idream media
Idream media
ఎన్నికల సమయంలో క్యాంపు రాజకీయాలు కొత్తేం కాదు. అభ్యర్థుల బలాబలాలు ఒక్కటే ఉన్నప్పుడు మేయర్, చైర్మన్ ఎంపికలో ఏ పార్టీకి ఆ పార్టీ తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఎక్కడో చోటికి తరలించడం సాధారణమే. కానీ, ఇంకా మునిసిపల్ పోలింగ్ జరగలేదు. ఫలితాలు వెలువడ లేదు. మేయర్, చైర్మన్ ల ఎంపిక ఊసేలేదు. అయినప్పటికీ టీడీపీకి భయం పట్టుకుంది. క్యాంపు రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. అందుకు కారణం నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ గడువు ప్రారంభం కావడమే.
ప్రస్తుతం ఏపీలో పురపోరు కొనసాగుతోంది. గతేడాది ఇచ్చిన షెడ్యూల్ కు కొనసాగింపుగానే ఈసీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు నేటి నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం కొనసాగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం ఎదురీదుతోంది. ఎంతలా అంటే పోటీలో నిలబడేందుకు కనీసం అభ్యర్థులు దొరకనంతగా. అయినప్పటికీ పరువు కాపాడుకోవడానికి కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ చార్జిలు నయానో, భయానో, అనామకులనో కొందరితో కష్టపడి నామినేషన్లు వేయించారు. ఇంతలో కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేశారు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ పురపోరుకు తెరలేచింది. ఈ ఏడాది కాలంలో టీడీపీ మరింత దిగజారగా, వైసీపీ ప్రజల్లో అత్యంత ఆదరణ పొందింది. దీంతో ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ గడువు రావడంతో తెలుగుదేశం నియోజకవర్గాల ఇన్ చార్జిల్లో వణుకు మొదలైంది.
రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్ చార్జిలు ఆయా వార్డుల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులకు ఆదివారం నుంచీ వరుసగా ఫోన్లు చేస్తున్నారు. ఏం కంగారుపడకండి.. మనం గట్టి పోటీ ఇద్దాం.. అవసరమైతే ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం. మీరు కూడా గట్టిగా నిలబడండి.. అంటూ చెబుతున్నారు. కొన్నిచోట్ల మనుషులను అభ్యర్థుల ఇళ్లకు పంపించి వారితో మంచిగా మాట్లాడుతూ నామినేషన్లు ఉపసంహరించవద్దంటూ జో కొడుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా పోలింగ్ కు ముందే క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. ఎక్కడైతే నామినేషన్లు ఉపసంహరించుకుంటారేమోనని తమ పార్టీ నేతలను వేరే ఊళ్లకు తీసుకుపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కొంత మంది ముఖ్య నేతల జిల్లాలు, నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.
ఎలాగోలా నామినేషన్లను వేయించిన టీడీపీ, అభ్యర్థులు ఆఖరి నిమిషంలో వెనక్కు తగ్గకుండా.. వారిని బెంగళూరు పంపించేస్తోందట. చిత్తూరు టౌన్ కు సంబంధించిన ఎన్నికలో పోటీలో ఉన్న, నామినేషన్లను వేసిన అభ్యర్థుల్లో ఎవరు పోటీలో ఉంటారో, ఎవరు తగ్గుతారో అనే భయాల నేపథ్యంలో నామినేషన్లను వేసిన వారిని రాష్ట్రం దాటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. డబ్బులు ఇచ్చి, బెంగళూరు పంపించి, సెల్ లు స్విచ్ఛాప్ చేసుకోమ్మని.. గెలుపోటములతో సంబంధం లేకుండా తాపీగా ఉండాలని.. పోటీలో ఉంటే అదే పదివేలు అన్నట్టుగా ఉందట పరిస్థితి. అమరావతి పరిసర జిల్లాల్లోను, రాయలసీమ జిల్లాల్లోనూ ఈ క్యాంపు రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో.!