iDreamPost
android-app
ios-app

బాబును చిక్కుల్లో పడేసిన టీడీపీ కార్యకర్తలు, సమస్యే లేదన్న కేశినేని…!

బాబును చిక్కుల్లో పడేసిన టీడీపీ కార్యకర్తలు, సమస్యే లేదన్న కేశినేని…!

విజయవాడ ఎంపీ కేశినేని నాని తీసుకున్న నిర్ణయం తర్వాత తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లాలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు పుష్కలం గా కనబడుతున్నాయి. తనను పొమ్మనకుండా పొగ పెట్టారు అని ఆవేదనలో కేశినేని నాని ఉన్నారనే భావన కొంత మంది కార్యకర్తలతో వ్యక్తమవుతోంది. కేశినేని నాని కూడా కొంతమంది సన్నిహితుల వద్ద ఇదే ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. కృష్ణాజిల్లాలో ఆర్థికంగా అలాగే రాజకీయంగా పార్టీ కేశినేని నాని దాదాపుగా పదేళ్ల నుంచి అండగా నిలుస్తూ వస్తున్నారు.

అయినా సరే చోటామోటా నాయకులకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతో కేశినేని నాని దాదాపుగా ఏడాది నుంచి పార్టీ అధిష్టానం తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తన కుమార్తెను ఇబ్బంది పెట్టడం అలాగే తనను లక్ష్యంగా చేసుకుని మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం వంటివి కేశినేని నానికి ఏమాత్రం నచ్చలేదు. ప్రజలు ఏ మాత్రం విలువ లేని బుద్ధ వెంకన్న లాంటి చోటా నాయకులు తనను ఇబ్బంది పెట్టటం పట్ల కేశినేని నాని తీవ్ర అసహనం గా ఉన్నారా అనే అభిప్రాయం కొంతవరకు వినబడింది.

ఇక ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని కేశినేని నాని చేసిన ప్రకటన తర్వాత కృష్ణాజిల్లాలో కార్యకర్తలు కేశినేని భవన్ వద్దకు క్యూ కడుతున్నారు. చాలా మంది కార్యకర్తలు కేశినేని నాని వద్దకు వెళ్లి విజయవాడ పార్లమెంట్ కు మీరు మళ్ళీ పోటీ చేయాలని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. నేడు కేశినేని భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. మైలవరం తిరువూరు నియోజకవర్గాలకి చెందిన కార్యకర్తలు పదుల సంఖ్యలో కేశినేని భవన్ వద్దకు వచ్చి నాని తో భేటీ అయ్యారు.

వచ్చే ఎన్నికల్లో మీరు విజయవాడ పార్లమెంట్ కి మళ్ళీ పోటీ చేయాల్సిందేనని ఎవరు పోటీ చేసినా సరే తమ పార్టీ కోసం పని చేసేది లేదని కేశినేని నాని వద్ద కార్యకర్తలు చెప్పినట్టుగా తెలిసింది. వారితో పాటుగా కొన్ని గ్రామాల సర్పంచులు కూడా కేశినేని నాని వద్దకు వచ్చి విజయవాడ పార్లమెంట్ కు మీరు ఎంతో ఉపయోగపడ్డారని ఈ తరుణంలో మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ అధిష్టానం తో మాట్లాడి సమస్యలు ఉంటే పరిష్కరించుకోవలసిందిగా పార్టీ కార్యకర్తలు కేశినేని నానికి తమ వంతుగా సూచనలు సలహాలు ఇచ్చారు. వైసిపి హవాలో కూడా భారీ విజయం సాధించిన కేశినేని నాని పట్ల పార్టీ అధిష్టానం ఇలా వ్యవహరించడం సరి కాదని కొంత మంది కార్యకర్తలు కేశినేని భవన్ వద్ద మీడియాతో వ్యాఖ్యానించారు.

అయితే ఈ సందర్భంగా కేశినేని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్ ప్రజల నుంచి తనకు పూర్తి స్థాయి లో సహకారం వచ్చిందని కానీ విలువలేని చోట తాను పోటీ చేయబోనని కేశినేని నాని చెప్పారట. పార్టీ కోసం సర్వశక్తులు ధారపోశా అని తన కుమార్తె కూడా కష్ట పడినన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డారని కానీ తనకు తన కుటుంబానికి పార్టీలో విలువ ఏ మాత్రం లేదని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారట. కార్యకర్తలు ఈ సందర్భంగా ఏదో చెప్పబోయినా సరే కేశినేని నాని వినే ప్రయత్నం చేయలేదని సమాచారం. అయితే సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా తనకు మద్దతుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని కేశినేని నాని కోరినట్లుగా తెలుస్తోంది.

కొండపై దుర్గమ్మ ఉన్నన్ని రోజులు కేశినేని భవన్ ఉంటుందని కేశినేని నాని కి ఈ సందర్భంగా చెప్పినట్లుగా సమాచారం. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కేశినేని భవన్ అండగా నిలుస్తుందని తాను పోటీ చేయడం అంత మాత్రాన ప్రజలు ఉండటం లేదు అనేది కరెక్ట్ కాదని చెప్పారట. అయితే విజయవాడ నాయకత్వంపై కేశినేని నాని ఎటువంటి స్పందన వ్యక్తం చేయకపోయినా కొంత మంది కార్యకర్తలు విజయవాడ నాయకత్వంపై మాట్లాడే సమయంలో మాత్రం వారిని వద్దని చెప్పే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. తాను పార్టీని వీడి వెళ్తాను అని ఎక్కడా చెప్పలేదని వచ్చే ఎన్నికల్లో మరో అభ్యర్థిని చూసుకోవాలనే విషయాన్ని మాత్రమే చంద్రబాబుకు చెప్పానని కేశినేని నాని పేర్కొన్నారు.