iDreamPost
android-app
ios-app

ఇదేం తీరు.. ఏపీలో టీడీపీ నేత వ్యాఖ్య‌లపై దుమారం

ఇదేం తీరు.. ఏపీలో టీడీపీ నేత వ్యాఖ్య‌లపై దుమారం

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు – ప్ర‌తి విమ‌ర్శ‌లు, వాదం – ప్ర‌తివాదం సాధార‌ణ‌మే. కానీ.. ఇటీవ‌ల కాలంలో ఏపీ నేత‌ల తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. కొంద‌రు అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్రస్థాయిలో నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కనీసం మ‌హిళ అనే గౌర‌వం లేకుండా, మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ను ఆ స్థాయిలో నిందించ‌డం ఎంతవ‌ర‌కు స‌బ‌బ‌నే ప్ర‌శ్న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

రోజురోజుకూ అధికార ప‌క్షానికి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌పై అస‌హ‌న‌మో, లేక జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై ఆగ్ర‌హ‌మో కానీ.. తెలుగుదేశం నేత‌లు ఇటీవ‌లి కాలంలో అదుపు త‌ప్పుతున్న ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. ఓ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ని చుట్టుముట్ట‌డ‌మే కాకుండా,ఆస్ప‌త్రి, స‌మ‌యం, సంద‌ర్భం చూడ‌కుండా ఆ పార్టీ శ్రేణులు నిర్భందించ‌డం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. అంత‌టితో ఆగ‌కుండా ఇప్పుడు ఓ మహిళా నాయకురాలిని ఓ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏకంగా “బజారు మనిషి“ అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయం పూర్తిగా వేడెక్కిపోయింది.

ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం నాడు విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియామీట్ నిర్వహించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. గ్యాంగ్‌రేప్‌ ఘటనపై తూతూ మంత్రంగా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకుందన్నారు. వాసిరెడ్డి పద్మ బజారు మనిషిలా మాట్లాడుతున్నారన్నారు.

‘నువ్వు అరేయ్‌ అంటే మేం ఒసేయ్‌ అనలేమా..?. అంటూ బోండా ఉమా వాసిరెడ్డి ప‌ద్మ‌ను దూషించారు. మా ప్రజాపోరాటంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మేకప్‌ వేసుకొని ఆస్పత్రికి వచ్చి అబద్ధాలు చెప్పారు. రాజకీయ కక్షతోనే మాకు నోటీసులు ఇచ్చారు. వాసిరెడ్డి పద్మను పదవి నుంచి తొలగించేవరకు న్యాయపోరాటం చేస్తాం. వ్యక్తిగత కక్షతో ఇచ్చిన నోటీసులకు మేము వెళ్లే ప్రసక్తే లేదు. ఈనెల 27 లోపు అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తాం. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీరు హేయం. బాధితురాలికి అండగా నిలవడం మా తప్పా?. ఘటన జరిగిన మూడ్రోజులైనాక బాధితురాలి పరామర్శకు వచ్చారు. వాసిరెడ్డి పద్మ నోటీసులకు స్పందించేదే లేదు. దీనిపై మేం న్యాయ పోరాటానికి సిద్ధం. బాధితులకు అండగా ఉండడం చంద్రబాబు చేసిన తప్పా?’ అని బోండా ఉమా వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉప‌యోగించిన కొన్ని ప‌దాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.