iDreamPost
android-app
ios-app

Tdp believes – ప్రజలంతా టీడీపీ వెనుకేన‌ట‌..!

Tdp believes – ప్రజలంతా టీడీపీ వెనుకేన‌ట‌..!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలో ఎలాగైనా స‌త్తా చాటుకోవాల‌ని తెలుగుదేశం పార్టీ చేయ‌ని ప్ర‌య‌త్నాలు క‌నిపించ‌డం లేదు. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నుంచి చోటామోటా నాయ‌కుల వ‌ర‌కూ అదే ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కొత్త ప్ర‌చారాన్ని తెర‌పైకి తెస్తున్నారు. అదేంటంటే.. ప్ర‌జ‌లంతా తెలుగుదేశం పార్టీ వెనుకే ఉన్నార‌ట‌. ఆ పార్టీ నేత‌ల‌కు భారీ ఎత్తున హార‌తులు ప‌డుతున్నార‌ట‌. మ‌రి ఎప్పుడు, ఎక్క‌డ‌, ఏ ఎన్నిక‌ల్లో వారికి ప‌ట్టం క‌ట్టారో వారికే తెలియాలి.

ఏదో విధంగా టీడీపీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని త‌ప‌న‌ప‌డుతున్న నాయ‌కులు అందుకు వింత ప్ర‌చారాన్ని చేస్తున్నారు. ఇందుకు ఓ వర్గం మీడియా కూడా బాగా స‌హ‌క‌రిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో జరగిన అవమానం ఘటన.. అనంతరం.. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం.. వంటి విషయాల తర్వాత.. పార్టీ పుంజుకుందనే అభిప్రాయాన్ని ఆయా కథనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు.. సోషల్ మీడియాను దన్నుగా చేసుకుని టీడీపీ ముందుకు సాగుతోందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని విషయం.. టీడీపీకి మరింత పుంజుకునేందుకు వనరుగా మారిందని అంటున్నారు. అయితే.. వాస్తవానికి ఇవన్నీ.. ఎప్పుడూ ఉన్నవే. కానీ.. ఇప్పుడే ఎందుకు ప్రచారంలోకి వస్తున్నాయి? అనేది ప్రశ్న.

ఈ విషయాన్ని పరిశీలిస్తే.. ఒక వ్యూహం ఉందనే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల జరిగిన పరిణామాన్ని అంటే.. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం.. నందమూరి కుటుంబాన్ని మీడియా ముందుకు తీసుకురావడం.. వంటి అంశాలతో.. ఒక చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. అసెంబ్లీలో జరిగిన విషయాన్ని జరిగినట్టు తీసుకోవాలి. అక్కడే తేల్చుకోవాలి. కానీ.. చంద్రబాబు దీనిని రోడ్డెక్కించారు. దీనికి తోడు.. నందమూరి కుటుంబాన్ని సైతం దీనిలోకిలాగారు. దీంతో ఒక వర్గం ప్రజల్లో.. టీడీపీ పని అయిపోయింది.. అందుకే.. లేనిపోని సాకులు వెతుక్కుని మరీ.. ప్రచారం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే వాదన తెరమీదికి వచ్చింది.

దీంతో ఇప్పటి వరకు ఏం జరిగినా.. టీడీపీ బలంగా ఉందనుకునే వారు కూడా టీడీపీ బలహీనంగా ఉందనే వాదనను అంగీకరించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ విష‌యం ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌లోను, మాజీ మంత్రులు తిరుగుతున్న క్ర‌మంలోనూ అర్థ‌మైపోతోంది. దీంతో వ్యూహాత్మకంగా ఈ త‌ర‌హా ప్ర‌చారం టీడీపీ మొద‌లుపెట్టిన‌ట్లు స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. మ‌రి ప్ర‌జ‌లు ఏమైనా అమాయ‌కులా?

Also Read : TDP, Pattabhiram – టీడీపీ కీ.. పరిగెడుతున్న పట్టాభి..