iDreamPost
android-app
ios-app

వెల‌గ‌పూడిలో ఘ‌ర్ష‌ణ‌లకు ఆజ్యం పోసిన టీడీపీ

వెల‌గ‌పూడిలో ఘ‌ర్ష‌ణ‌లకు ఆజ్యం పోసిన టీడీపీ

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో దళితుల మధ్య తలెత్తిన చిన్నవివాదానికి రాజ‌కీయం తోడ‌వ‌డంతో పెద్ద దుమారంగా మారింది. ఆ గ్రామంలోని టీడీపీ నేత‌లు ఇరువర్గాల మధ్య వివాదానికి ఆజ్యం పోశారు. ఆ గ్రామంలోని దళితవాడలో సిమెంట్‌ రోడ్డు.. ఆర్చ్‌ నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలను క్రిస్మస్‌ తర్వాత సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి వ‌చ్చినా.. ఆ అంశం ఘర్షణలకు దారితీసేంత తీవ్ర వివాదంగా మారింది. దీనికి తెర‌వెనుక టీడీపీ అధినాయకత్వం సూచ‌న‌లేన‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీకి చెందిన న్యాయవాది జడారి శ్రావణ్‌ కుమార్, మరికొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగి రెచ్చ‌గొట్ట‌డం మూలంగానే ఆదివారం రాత్రి ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడులకు దిగాయ‌ని, ఎనిమిది మంది గాయపడగా, వారిలో మరియమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింద‌ని స్థానికులు చెబుతున్నారు.

శవ రాజకీయాలు

ఓ మ‌హిళ చ‌నిపోవ‌డంతో ఆమె మృతదేహాంతో వెలగపూడిలో టీడీపీ నేతలు ధర్నా చేశారు. హోంమంత్రి సుచరిత, తదితరులు గ్రామంలో పర్యటించి సర్ది చెప్పడంతో పోస్టుమార్టంకు మరియమ్మ కుటుంబ సభ్యులు సమ్మతించారు. అనంతరం అంత్యక్రియలు చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు సిద్ధపడుతుండగా టీడీపీ నేతలు వారిని ప్రభావితం చేసి ఆమె మృతదేహంతో సోమవారం తుళ్లూరు–వెలగపూడి రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇది టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది.ఈ కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేశ్‌ను ఏ–1గా చేర్చాలని, ఎఫ్‌ఐఆర్‌ కాపీ తమకు చూపించాలని అసంబద్ధ డిమాండ్‌తో టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడుతనం ప్రదర్శిస్తోంది. ఈ కేసును విచారించి ఎంపీ నందిగాం సురేశ్‌ పాత్ర ఉన్నట్టు తేలితే ఆయన పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేస్తామని గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ ప్రకటించారు.

ప్ర‌భుత్వ చొర‌వ ప్ర‌శంస‌నీయం..

వెలగపూడిలో ఘర్షణలపై ప్రభుత్వం తక్షణం స్పందించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణలను నివారించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగాం సురేశ్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకారావు, రాష్ట్ర రెల్లి కార్పొరేషన్‌ చైర్మన్‌ మధుసూదన్‌రావు తదితరులు వెలగపూడిలో పర్యటించారు. మరియమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. దళితులు అంతా ఒకటే కుటుంబమని చెప్పి అందరం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరియమ్మ కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10 లక్షలు ఇచ్చారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి పూర్తి చికిత్స అందిస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. దాడులను నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తుళ్లూరు సీఐ ధర్మేంద్ర బాబును వీఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ వర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అర్ధరాత్రి వెలగపూడి బయల్దేరిన మ‌హిళా హోం మంత్రి

ఘ‌ట‌న జ‌రిగిన రోజు రాత్రి 11 గంటలైనా ఆందోళనలు త‌గ్గ‌డం లేదు. దీంతో సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు అర్ధ‌రాత్రి వేళ కూడా హోం మంత్రి సుచ‌రిత‌ 11.30 గంటల ప్రాంతంలో వెలగపూడికి వెళ్లారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో అలజడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మరియమ్మ మృతి విషయం తెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించారని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయం కింద రూ.10 లక్షలు అందించాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. ఎస్సీలను విడగొట్టాలని చూస్తున్న చంద్రబాబు మాయలో పడొద్దని కోరారు. మహానేతలైన అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌లను ఆదర్శంగా తీసుకుందామని చెప్పారు. గ్రామంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, 144 సెక్షన్‌ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. తుళ్లూరు ప్రాంతంలో పోలీస్‌ అధికారులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.