iDreamPost
android-app
ios-app

పోలవరం ఎత్తు మీద ఎందుకీ ఎత్తుగడలు?

  • Published Nov 16, 2020 | 11:16 AM Updated Updated Nov 16, 2020 | 11:16 AM
పోలవరం ఎత్తు మీద ఎందుకీ ఎత్తుగడలు?

నిజం కన్నా అబద్దానికి వేగం ఎక్కువే కానీ పోలవరం విషయంలో టన్నుల కొద్దీ అబద్దపు ప్రచారాలు గోదావరి వరదకన్నా వేగంగా ప్రచారం చేస్తున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది, పోలవరం విషయంలో కూడా అంతే.

పోలవరం ఎత్తు మీద ఎందుకు ఈ దుష్ప్రచారం?

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ కోరిక మేరకు పోలవరం ఎత్తు తగ్గించటానికి ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు రాజీ పడ్డారు అంటూ మాజీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించారు.. ముందు ఆంధ్రజ్యోతిలో వార్త రావటం తరువాత రోజు టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టటం మొదటి నుంచి ఒక సంప్రదాయంగా వస్తుంది..

దేవినేని ఉమా మాటలు వింటే పోలవరం ఎత్తు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వినేవారికి అనిపిస్తుంది. ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కానీ ,సంబంధింత శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ కానీ ఎవరైనా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు ప్రకటించలేదు. పైగా విజయసాయి రెడ్డి పోలవరం ఎత్తు తగ్గించే సమస్యే లేదు అని చెప్పినా ,మంత్రి అనిల్ ఇంచ్ కూడా ఎత్తు తగ్గదు అని ప్రకటించినా కానీ వారి ప్రకటనలు ఆంధ్రజ్యోతికి కానీ మరో నెంబర్ 5 ఛానల్ కు కానీ పట్టవు.

ఎత్తు తగ్గింపు చర్చ ఎందుకు మొదలు పెట్టారు?

పోలవరం పనులు శరవేగంతో జరుగుతున్నాయి. మరో ఐదు ఆరు నెలల్లో స్పిల్ వేకు గేట్లు పెట్టటం పూర్తవుతుంది. ప్రధాన డ్యాం ECRF (Earth Cum Rockfill Dam) పనులు మరో సంవత్సరంలో పూర్తవుతాయని అంచనా. పోలవరం ప్రాజెక్ట్ ఖర్చులో ప్రధానమైన భూ పరిహారం మీద కేంద్రం నుంచి ఇప్పటికి ఎలాంటి వాగ్దానం లేదు. పైగా స్పెషల్ ప్యాకేజి ప్రకటించినప్పుడు, ఆ తరువాత కూడా 2014 నాటి అంచనాలకే ఆమోదం, ఇరిగేషన్ కంపోనెంట్స్ కు మాత్రం డబ్బులు ఇస్తామని చెప్పామని ,దానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని కేంద్ర ఆర్థికశాఖ ఈ మధ్య ప్రకటించింది.

పోలవరం కోసమే స్పెషల్ ప్యాకేజీ ని అంగీకరంచాను అని అప్పట్లో చెప్పిన చంద్రబాబు ఈ విషయం మీద స్పష్టంగా మాట్లాడటం లేదు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఒప్పుకుంది, మరో కమిటీ ఒప్పుకుందని చెప్తారు కానీ తుది ఆమోదం ఇవ్వవలసిన ఆర్థికశాఖ ఆమోదం ఎందుకు తీసుకోలేదు . పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో కానీ, నాబార్డ్ రుణ ఒప్పందంలో కానీ ఈ విషయాన్ని ఎందుకు రాయలేదు అంటే జవాబు శూన్యం . ఈ చర్చను పక్కదోవ పట్టించటానికి జగన్ ప్రభుత్వాని విఫలమైంది, ఇరవైరెండు వేల కోట్లకు పైగా అవసరమైన ఆర్ అండ్ ఆర్ ఖర్చును తగ్గించుకోవటానికి పోలవరం ఎత్తును 45.72 మీటర్లు (150 అడుగులు) తగ్గించి 41.5 మీటర్లకు (135 అడుగులు)కు కుదించి ముంపు ప్రాంతాన్ని తగ్గించి తద్వారా ఆర్ & ఆర్ ఖర్చును 2500 నుంచి 3000 కోట్లకు పరిమితం చెయ్యాలని చూస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు.

పోలవరం ఎత్తుతో కేసీఆర్ కు ఏమి ఇబ్బంది?

పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయే ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపితే తప్ప ప్రమాణస్వీకారం చేయనని చెప్పానుగా అందుకే మోడీ ప్రభుత్వం ఆ ఏడుమండలాలను ఆంధ్రలో కలిపిందని చెప్పుకునే చంద్రబాబుకు పోలవరం ఎత్తుతో భవిష్యత్తులో అదనంగా తెలంగాణాలోని ఏ గ్రామాలు మునగవు అని తెలియదా? . ముంపు ప్రాంతం మీద సాంకేతిక కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీదనే అనుమానమా?

ఏ ప్రాజెక్టులోనైనా ఎంత నీటి మొత్తంలో ఎంత మేర ముంపు ఉంటుందని స్టిములేషన్ తో అంచనా వేసి దానికి అందనంగా మరి కొంత ప్రాంతాన్ని కలిపి ముంపు ప్రాంతంగా గుర్తిస్తారు. ఎదో ఒక ప్రత్యేక సందర్భంలో ముంపు ప్రాంతం పెరుగుతుందంటే గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలేస్తారు కానీ ప్రజలు నివసిస్తున్న గ్రామాలను ముంచరు అని సీనియర్ రాజకీయ నాయకుడికి తెలియదా? . 2015లోనో 2016లోనో కొన్ని పత్రికలలు రాసినట్లు ఆ ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతారని భావిస్తున్నారా?

పోలవరం కీలక అంశాలు ..

1949లో దివాన్ ఆలోచన,1980లో అంజయ్య శంకుస్థాపన ఇవన్నీ చెప్పుకోవటానికి తప్ప ఉపయోగం లేని చర్చలు. పోలవరం కోసం చెప్పుకోవలసింది 2005 సెప్టెంబర్ లో వొచ్చిన సైట్ క్లియరెన్స్, ఇదే పోలవరానికి తొలి అడుగు.

వైయస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా పోలవరాన్ని మొదలు పెట్టి 2005 సెప్టెంబర్ లో సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చారు.. పోలవరానికి ఇదే మొదటి అడుగు…వరుసగా NGT ,అటవీ శాఖ, ఆర్థికశాఖ అనుమతులు తీసుకొచ్చారు. అప్పటి వరకు సాంప్రదాయంగా డ్యాం పనులు పూర్తయిన తరువాత కాలువల తవ్వకం,ఇతర పనులు చేసే పద్దతిని మార్చి అన్నిపనులను సమాంతరంగా మొదలు పెట్టారు. ఒక వైపు అనుమతులు కోసం ప్రయత్నం చేస్తూ మరోవైపు కాలువలు తవ్వటం వలెనే కుడికాలువను ఉపయోగించుకొని చంద్రబాబు పట్టిసీమను కట్టగలిగింది. కాలువ పనులు జరగకపోయి ఉంటే 2014 నాటికి పోలవరం సజీవంగా ఉండేదే కాదు.

డ్యాం ఎత్తు 45.72 మీటర్లు,194.60 టీఎంసీ ల నిలువ సామర్ధ్యం,యాభై లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాసిటీతో స్పిల్ వే , 41.5 మీటర్ల ఎత్తులో(MDDL – Minimum Drawdown Level)కాలువలు ,కుడి కాలువ ద్వారా 80 టీఎంసీ లు కృష్ణ డెల్టాకు, ఎడమ కాలువ ద్వారా 23.44 టీఎంసీ నీటి మల్లింపు , మొత్తంగా 28 లక్షల మందికి పైగా తాగు నీరు, 7.20 లక్షల ఎకరాలకు సాగు నీరు మరియు 960 MW విద్యుత్ ఉత్పత్తి ,ఇవి పోలవరం ప్రాజెక్ట్ కీలక అంశాలు.

డిల్లీ దాక 3000 కిలొ మీటర్లు సైకిల్ యాత్ర చేశారు

1994లో కడియం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యే గా గెలిచిన వడ్డి వీరభద్రరావు 1996లో పోలవరం సాధన సమితి అని బ్యానర్ పెట్టుకుని తన సొంత గ్రామం అయిన నరేంద్రపురం నుంచి గోదావరి నీటి బిందెతో ఢిల్లీకి 3000 కిలొమీటర్లు సైకిల్ యాత్ర చేసి అప్పటి ప్రధాని దేవగౌడకు వినతిపత్రం ఇచ్చారు. పోలవరం గురించి పెద్ద యాత్ర ఇదే. 2004 లో ఇదే వీరభద్రరావ్ పోలవరాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేసారని, వైయస్ఆర్ మాత్రమే పోలవరం కట్టగలరంటూ పెద్ద బ్యానర్ కట్టి దానికింద గుండు చేయించుకొని చంద్రబాబు నిర్లక్ష్యం మీద నిరసన ప్రకటించారు.

ముంపు తగ్గించాలంటే ఎత్తు తగ్గించాలా ?

పోలవరం ప్రాజెక్ట్ FRL(Full Reservoir Level ) 45.72 మీటర్లు/150 అడుగులు .. ఈ ఎత్తులో దాదాపు 270 ముంపు గ్రామాలు, 89 వేల మంది నిర్వాసితులు ఉంటారని అంచనా. నిర్వాసితుల వాస్తవ లెక్క దీనికంటే కొంచం ఎక్కువే ఉండొచ్చు. ప్రస్తుత అంచనా ప్రకారం ముంపు నిర్వాసితుల R & R ప్యాకేజీకి దాదాపు 29 వేల కోట్లు అవసరం అవుతుంది. అదే ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్లుకు తగ్గిస్తే ముంపు తగ్గి పరిహారం 3150 కోట్లు సరిపోతుందని అంచనా .

కేంద్రం భూసేకరణకు నిధులు ఇవ్వమని చెబుతుంది కాబట్టి ఎత్తు తగ్గించి ముంపు ప్రాంతాన్ని తగ్గిచుకొని దాని ద్వారా R&R ప్యాకేజీ ఖర్చు తగ్గించుకోవాలనుకుంటుందని టీడీపీ నేతల ఆరోపణ.

నీరు నిలువ చేసే మట్టాన్ని బట్టి ముంపు ప్రాంతం పెరుగుతుంది. ఉదాహరణకు గండికోట ప్రాజెక్టులో 18 టీఎంసీలు నిలువచేసినప్పుడు తాళ్ల పొద్దుటూర్ అనే గ్రామంలోకి నీరు ప్రవేశించడంతో, ఆ గ్రామస్తులకు ఇంకా నష్టపరిహారం చెల్లించకపోవడంతో గండికోటలో 26 టీఎంసీల నీటిని నిలువచేసుకునే అవకాశం ఉన్నా కేవలం 18 టీఎంసీల నీటినే నిలువ చేస్తున్నారు. అదనంగా వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు.

పోలవరంలో కూడా 45.72 మీటర్ల ఎత్తులో డ్యామ్ ను నిర్మించి ఎంతమేరకు నష్టపరిహారం చెల్లించారో ఆప్రాంతం మునిగేంతవరకే నీటిని నిలువ చేయవచ్చు. కేంద్రం మనసు మార్చుకొని భవిషత్తులో మొత్తం లేక కొంత మేర నిధులు ఇచ్చినా మరి కొన్ని గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెలించి నీటి నిలువను పెంచవచ్చు. ఎన్నికల సంవత్సరంలో బీజేపీ దీనిమీద స్పందించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడిగా కొంత నిధులను కేటాయించి మరిన్ని గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించి ఎక్కువ నీటిని నిలువ చేయవచ్చు..

నష్టపరిహారం నిధులు అనేది తాత్కాలిక ఆర్ధిక ఇబ్బందే కానీ దాని కోసం శాశ్వతమైన ప్రాజెక్ట్ ఎత్తును తగ్గిస్తారని రాయటం, ఆరోపించటం టీడీపీ మరియు దాని అనుకూల మీడియాకే చెల్లింది.

ఎంత నీళ్లు నిలువ ఉంచుతారు? ఎన్ని నీళ్లు కృష్ణా డెల్టాకు, ఉత్తరాంధ్రకు మళ్లిస్తారు.. ఇవన్నీ తేలాలంటే ముందు ప్రాజెక్ట్ పూర్తికావాలి.. త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయమని ప్రతిపక్షం & మీడియా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కానీ విపరీతమైన ఊహాజనిత ఆరోపణలు చేయటం ప్రజల్లో అనుమానాలు సృష్టించి గందరగోళం చేయటానికి తప్ప దేనికి పనికి రావు. నిజం నిలకడ మీద తేలటం అంటే మరో సంవత్సరంలో డ్యాం పూర్తయినప్పుడు ప్రజలకు తెలుస్తుంది.. అయితే.. చూశారా మేము బయటపెట్టాము కాబట్టే ప్రభుత్వం వెనక్కితగ్గి 45. 72 మీటర్ల ఎత్తులో డ్యాం కట్టింది, అంతా మావలనే అని చెప్పుకోవటం కోసమే ఇప్పుడు ఈ ఆరోపణలు.

పోలవరంతో ఎమోషనల్ రాజకీయాలు అనవసరం

కుడి ఎడమకాలువ ద్వారా నీటి మల్లింపు కోసం మరియు 960 MW విద్యుత్ ఉత్పత్తి ఇవే పోలవరం ప్రధాన లక్ష్యాలు. పోలవరం నిలువ సామర్ధ్యం 194 టీఎంసీలు కాగా లైవ్ స్టోరేజ్ 45.72 మీటర్లు – 41.5 మీటర్ల మధ్య ఉండే 75 టీఎంసీలు మాత్రమే. ఈ నీరు కాలువల ద్వారా తీసుకెళ్లగలుగుతారు. వరద రోజుల్లోనే అంటే జూన్ మూడో వారం నుంచి అక్టోబర్ రెండవ వారం మధ్యలో దాదాపు 120 రోజుల్లో 150 నుంచి 200 టీఎంసీల నీటిని కుడి ఎడమ కాలువల ద్వారా మళ్లించాలి. 41. 5 మీటర్ల కింద ఉన్న నీటిని జనవరి- జూన్ మధ్య కాలంలో తాగు నీటి కోసం, గోదావరి డెల్టా సాగు నీటి కోసం ప్రధానంగా ఉపయోగించుకోవాలి. అవకాశం ఉంటే వైజాగ్ కు వేసవిలో తాగు నీరు ఇవ్వాలి.

మొత్తంగా పోలవరం మొదటి లబ్ధిదారు గోదావరి డెల్టా, కాకినాడ పారిశ్రామిక అవసరాలు. రెండవ లబ్ధిదారు వైజాగ్.. తరువాత కృష్ణా డెల్టా ఆ తరువాతనే రాయలసీమ.. అది కూడా గోదావరి-పెన్నా అనుసంధానం జరిగితేనే, పట్టిసీమ ముగిసిన చర్చ. ఈ వాస్తవాలను వదిలి జలం లేదు జీవం లేదు అంటూ కథనాలు రాయటం సరైంది కాదు… పోలవరం ఎత్తుకు రాయలసీమకు లింక్ పెట్టి ఎమోషనల్ రాజకీయాలు చేయటం కుదరదు..

2005లో పునాది పడ్డ పోలవరం పనులు 2022 నాటికి పూర్తయ్యి గ్రావిటీ ద్వారా కుడి ,ఎడమ కాలువ ద్వారా నీరు పారాలి .. మరోమాట ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇప్పుడు జరుగుతున్న పనులు ,రేపు జరగపోయే పనుల మీద టెక్నికల్ ఆడిట్ రెగ్యులర్ గా జరగాలి..గోదావరిలో 90 మీటర్ల మేర ఇసుక ఉంది, ఇసుక నేలలో సీపేజ్ సమస్య అధికం,ఎక్కువ జాగర్తలు అవసరం.