iDreamPost
android-app
ios-app

ఎప్పుడూ బురద జల్లుడేనా బండారు?

  • Published Feb 07, 2022 | 1:33 AM Updated Updated Mar 11, 2022 | 10:19 PM
ఎప్పుడూ బురద జల్లుడేనా బండారు?

సందర్భం ఏదైనా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లడానికి ప్రాధాన్యమిచ్చే టీడీపీ నాయకులు ప్రజల కోసం ఫలానా పనిచేయాలని ప్రభుత్వాన్ని అడిగేటప్పుడు కూడా అదే ధోరణిని అనుసరిస్తున్నారు. ప్రభుత్వాన్ని అడగడానికి బదులు డిమాండ్‌ చేయడం, అడ్డగోలు విమర్శలు చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. అసలు ఏ సందర్భం లేకపోయినా ముఖ్యమంత్రిపై నిరాధార ఆరోపణలు చేసే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తాజాగా తనదైన శైలిలో నోరు పారేసుకున్నారు. జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న  నేపథ్యంలో విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లిలో చేరుస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే పెందుర్తిని విశాఖపట్నం జిల్లాలోనే కొనసాగించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో అక్కడ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండారు తన నోటికి పనిచెప్పారు. ప్రజల ఆకాంక్షనో, తన అభిప్రాయాన్నో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ఆయన ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు.


పెందుర్తిని విశాఖలో కొనసాగించకపోతే విచ్ఛిన్నం చేస్తున్నట్టా?

2014 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీచేసిన తన తల్లి  వైఎస్‌ విజయమ్మను ప్రజలు ఓడించారనే ఉద్దేశంతో విశాఖ జిల్లాను ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేస్తున్నారని విమర్శించారు. అప్పటిలో వైఎస్సార్‌ సీపీ పైన, జగన్‌ కుటుంబంపైనా అనేక దుష్ప్రచారాలు చేసిన టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించారు. టీడీపీ, దాని అనుంగు మీడియా చేసిన విషప్రచారం వల్ల ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోయారని ఇప్పటికీ వైఎస్సార్‌ సీపీ నేతలు చెబుతుంటారు. ఆ ఎన్నికలు జరిగి ఏడేళ్లయినా టీడీపీ ఇంకా తన దుష్ప్రచారాన్ని కొనసాగిస్తోంది అనడానికి ఉదాహరణే బండారు చేసిన వ్యాఖ్యలు. నిజంగా తన తల్లిని ఓడించిన విశాఖపై జగన్‌ కక్ష సాధించాలనుకుంటే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎందుకు ప్రకటిస్తారు? అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అర్థంపర్థంలేని ఇలాంటి ఆరోపణలు చేస్తూ ప్రతిదాన్ని రాజకీయం చేసే టీడీపీలాంటి పార్టీ ప్రతిపక్షంలో ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అంటున్నారు.


విశాఖపై ప్రేమలేనిది టీడీపీకే..

అసలు విశాఖ అభివృద్ధి అంటే ఇష్టం లేనిది టీడీపీ నేతలకే అని, అందుకే మూడు రాజధానులకు అడ్డు పడుతున్నారని అధికార పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే మొత్తం ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అలాంటి సువర్ణ అవకాశాన్ని కాదని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తమ పార్టీ ఉద్యమం చేస్తుంటే ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నిస్తున్నారు. జిల్లాల సంఖ్య పెంపు అభ్యంతరాలను, విజ్ఞాపనలను సమర్పించడానికి ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. పెందుర్తిని విశాఖలో కొనసాగించాలని బండారు ప్రభుత్వాన్ని అడగాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుందని అంటున్నారు. ఇలా తలా తోకా లేని విమర్శలు చేస్తూ సీఎంను టార్గెట్‌ చేస్తున్నారంటే ఆయనకు సమస్య పరిష్కారం కన్నా రాజకీయ లబ్ధి పొందాలనే దుగ్ధ ఎక్కువగా ఉందని అర్థం అవుతోందని అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు.