iDreamPost
iDreamPost
రాష్ట్రానికి జగన్ అనే వైరస్ పట్టిందని, యువత బయటకి వచ్చి ఆ వైరస్‌ను తరిమికొట్టాలని…అప్పుడే ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ నాయకులు తప్పు పడుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహానికి అచ్చెన్న, పార్టీ సీనియర్ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. దేశంలో సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీఆర్, టీడీపీ హయాంలోనే అని అన్నారు. 35 రూపాయలతో పెన్షన్ పథకాన్ని ఆనాడు ప్రారంభించింది ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అచ్చెన్న మాట్లాడుతూ జగన్ వైరస్ అతి పెద్ద వైరస్ అని అన్నారు. దాన్ని తరిమికొట్టినప్పుడే ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని అన్నారు.
చంద్రబాబే టీడీపీకి పట్టిన వైరస్..
పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను పొట్టన పెట్టుకున్న నారా చంద్రబాబునాయుడే తెలుగుదేశం పార్టీకి పట్టిన అతిపెద్ద వైరస్ అని వైఎస్సార్ సీపీ నాయకులు అచ్చెన్న వ్యాఖ్యలపై ధ్వజమెత్తుతున్నారు. 60 ఏళ్ల వయసులో పార్టీని స్థాపించి, తన కష్టంతో టీడీపీని జనంలో తిరుగులేని శక్తిగా ఎన్టీఆర్ తయారు చేస్తే దాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని అంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి, వృద్ధాప్యంలో తీరని క్షోభకు గురి చేసి, ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని విమర్శిస్తున్నారు. 26 ఏళ్లుగా ఎన్టీఆర్ జయంతులు, వర్ధంతులు జరుపుతూ అటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను, ఇటు రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న ఘనత టీడీపీ నేతలదేనని అంటున్నారు. అధికారంపై వ్యామోహంతో పిల్లనిచ్చిన మామను అత్యంత దుర్మార్గంగా పదవీచ్యుతుడిని చేసిన చంద్రబాబును టీడీపీ నుంచి సాగనంపినప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది. బాబును రాష్ఠ్రం నుంచి తరిమికొట్టినప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.
ప్రజాదరణ లేకపోయినా ప్రగల్భాలు..
పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అయినా ఆ పార్టీ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారు. మరోపక్క అశేష జనాదరణతో, తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తీవ్రమైన పదజాలంతో దూషిస్తున్నారు. తమ నాయకుడు చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారని గొప్పలు చెప్పుకోవడమే కాని.. ఫలానా పథకంలో ప్రజలకు మేలు చేశారని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం టీడీపీ నేతలకు లేదు. అందుకే ఎంతసేపూ ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. సీఎంను దూషిస్తేనో, జనాన్ని పక్కదారి పట్టిస్తేనో టీడీపీ అధికారంలోకి రాదు. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి పార్టీని విడిపించి కాపాడుకుంటేనే టీడీపీకి మనుగడ ఉంటుందని నాయకులు గ్రహించాలని వైఎస్సార్ సీపీ నేతలు సూచిస్తున్నారు.
Also Read : ప్రజలు గెలిపించారు – కుటుంబం ఓడించింది ..ఎన్టీఆర్