iDreamPost
android-app
ios-app

తోట త్రిమూర్తుల స్థానాన్ని భర్తీ చేసిన టీడీపీ .. రామచంద్రాపురంలో ఆసక్తికర పోరు..!

తోట త్రిమూర్తుల స్థానాన్ని భర్తీ చేసిన టీడీపీ .. రామచంద్రాపురంలో ఆసక్తికర పోరు..!

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ ఇంఛార్జిని తెలుగుదేశం పార్టీ నియమించింది. ఎమ్మెల్సీగా, మండలి డిప్యూటీ చైర్మన్‌గా పని చేసిన రెడ్డి సుబ్రమణ్యంను నూతన ఇంఛార్జిగా నియమిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కోనసీమలోని కొత్తపేట నియోజకవర్గానికి చెందిన రెడ్డి సుబ్రమణ్యం జిల్లా టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానసామాజికవర్గాల్లో ఒకటైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన రెడ్డి సుబ్రమణ్యం టీడీపీలో ఆ కుల నేతగా ఎదిగారు. కొత్తపేట సర్పంచ్‌గా పని చేశారు. ఆయన సతీమణ కొత్తపేట ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో బండారు సత్యానందరావు పీఆర్‌పీకి వెళ్లడంతో టీడీపీ తరఫున కొత్తపేట నియోజకవర్గం నుంచి రెడ్డి సుబ్రమణ్యం పోటీ చేశారు. కాంగ్రెస్‌ తరఫున చిర్ల జగ్గిరెడ్డి నిలుచున్నారు. కాపు సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్న కొత్తపేటలో త్రిముఖ పోరులో పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు సత్యానందరావు గెలిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్‌పీ 294 సీట్లకుగాను 18 గెలవగా.. అందులో నాలుగు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాయి. 19 నియోజకవర్గాలు ఉన్న తూర్పు గోదావరిలో పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కొత్తపేట నియోజకవర్గాల్లో పీఆర్‌పీ విజయం సాధించింది.

2014 ఎన్నికల నాటికి మళ్లీ రాజకీయ సమీకరణాలు మారాయి. బండారు సత్యానంద రావు మళ్లీ టీడీపీ గూటికి వచ్చారు. రెడ్డి సుబ్రమణ్యంకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన చంద్రబాబు.. కాపు సామాజికవర్గానికి చెందిన బండారును అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ సారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చిర్ల జగ్గిరెడ్డి గెలిచారు. టీడీపీ అధికారంలోకి రావడంతో రెడ్డి సుబ్రమణ్యంకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ తర్వాత మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవి లభించింది. దూకుడు రాజకీయాలు చేసే రెడ్డి సుబ్రమణ్యం జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా రెడ్డి సుబ్రమణ్యం, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా చిర్ల జగ్గిరెడ్డిలు కొత్తపేటలో పైచేయి సాధించే క్రమంలో దూకుడు రాజకీయాలు చేశారు. ఇసుక, మట్టి వ్యవహారంలో జిల్లా పరిషత్‌ సమావేశంలోనే వారిద్దరూ బాహాబాహీకి దిగడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

తాజాగా రెడ్డి సుబ్రమణ్యం టీడీపీ రామచంద్రాపురం ఇంఛార్జిగా ఎంపిక కావడంతో స్థానికంగా రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఓడిపోయిన నాలుగు నెలలకే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ పార్టీ అమలాపురం పార్లమెంట్‌ అధ్యక్షుడుగా, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి కూడా దక్కించుకున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన తోట త్రిమూర్తులు స్థానంలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన రెడ్డి సుబ్రమణ్యం వస్తుండడంతో.. కుల రాజకీయాలకు కేంద్రమైన రామచంద్రాపురంలో ఇకపై ఒకే సామాజికవర్గానికి చెందిన నేతల మధ్య రాజకీయ పోరు సాగబోతోంది. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఇదే నియోజకవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌లు ఇద్దరూ శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వారే. రెండు పార్టీల తరఫున శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన నేతలే ప్రత్యర్థులుగా మారిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో రామచంద్రాపురం రాజకీయాలు ఏ విధంగా సాగుతాయో వేచి చూడాలి.

Also Read : కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఏ పార్టీలో ఉన్నారు..?