iDreamPost
android-app
ios-app

మరో రెండు నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను ప్రకటించిన తెలుగుదేశం

మరో రెండు నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను ప్రకటించిన తెలుగుదేశం

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత మారిన రాజకీయ పరిణామాలలో అసెంబ్లీ ఇంచార్జ్ లు లేని నియోజకవర్గాలలో ఇటీవల కాలంలో కొత్త ఇంచార్జులను నియమించడం, స్థానిక కారణాలవల్ల కొందరు ఇంచార్జులకు కొత్త నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తున్న తెలుగుదేశం పార్టీ గత నెలలో 4 నియోజకవర్గాలకు కొత్తగా ఇంచార్జులను నియమించిన తరుణంలో తాజాగా శుక్రవారం మరో రెండు నియోజకవర్గాలకు ఇంచార్జులను ప్రకటించింది. దీనిలో భాగంగా చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు జిలా ప్రత్తిపాడు ఇంచార్జ్ గా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్యను, విశాఖ జిల్లా పాయకరావు పేట ఇంచార్జ్ గా వంగలపూడి అనితను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ఒక ప్రకటన విడుదల చేశాడు.

ప్రత్తిపాడు నియోజకవర్గానికి కొత్తగా ఇంచార్జ్ గా ప్రకటించిన మాకినేని పెద్ద రత్తయ్య సుదీర్ఘ రాజకీయఅనుభవజ్ఞుడు. తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. 1983 తెలుగుదేశం ఆవిర్భావంతో ఆపార్టీ తరపున పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాకినేని ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. 1983 నుండి 1999 వరకు వరుసగా 5 సార్లు గెలుపొంది నియోజకవర్గంపై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించాడు. అయితే జిల్లాలో అప్పట్లో ఆయనకి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఆధిపత్య పోరు తీవ్రంగా ఉండేది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1989 లో జిలా తెలుగుదేశం అధ్యక్షుడుగా మాకినేని వ్యవహరించాడు.

1994 లో ఎన్టీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చాక అప్పటి రాజకీయ పరిణామాల్లో కోడెల శివప్రసాద్ ని వెనక్కినెట్టి ఎన్టీఆర్ కేబినెట్ లో బెర్త్ సంపాదించాడు. అయితే 1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు ఎన్టీఆర్ ని గద్దె దించినప్పుడు ఎన్టీఆర్ వైపు నిలబడిన అతి కొద్దీ మంది సీనియర్లలో మాకినేని ఒకరు. ఆ తరువాత లక్ష్మి పార్వతి స్థాపించిన ఎన్టీఆర్ టిడిపిలో చేరి గుంటూరు ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రెండు నెలల్లోనే మాకినేని చంద్రబాబు సమక్షంలో తిరిగి టిడిపి గూటికే చేరాడు. 1999 ఎన్నికలు మాకినేనికి ఎమ్మెల్యేగా చివరి ఎన్నికలు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో రావి వెంకట రమణ చేతిలో ఓటమి పాలయ్యాడు.

అయితే 2009 నియోజకవర్గాల పునర్విభజలో ప్రత్తిపాడు ఎస్సి రిజర్వుడ్ గా మారడంతో మాకినేనికి ఇంకెక్కడా పోటీచేసే అవకాశం దక్కలేదు. 2012లో టిడిపికి రాజీనామా చేసి బయటకి వచ్చిన ఆయన వైసిపిలో చేరి పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ, ఆయనకు టికెట్ దక్కకపోవడంతో వైసిపికి కూడా రాజీనామా చేసి కొన్నళ్లు రాజకీయాలకు దూరంగా వున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు విధానాలను సమర్ధిస్తూ వచ్చాడు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడు. ఇటీవల కాలంలో అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తూ చంద్రబాబు కి బాగా దగ్గరవడం, అదే సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి పార్టీ తరుపున ఇంచార్జ్ లు లేకపోవడంతో చివరికి పార్టీ ఆ బాధ్యతలు మాకినేనికే అప్పగించింది. వయసురీత్యా ఆయనకి ఇది పెద్ద సవాలే. నియోజకవర్గంలో గతంలో లాగా కొత్త జనరేషన్ లో పెద్దగా పట్టు లేకపోవడం, 2009 డీలిమిటేషన్ లో కొత్తగా ప్రత్తిపాడులో కలసిన నియోజకవర్గంలోనే పెద్ద మండలం, షుమారు 90 వేల ఓట్లు ఉన్న గుంటూరు రురల్ మండలంలో పార్టీ అత్యంత బలహీనంగా ఉండడం తదితర కారణాల వల్ల ఈ వయసులో మాకినేని రత్తయ్య రాణించడం కత్తి మీద సామేనని పరిశీలకుల అంచనా.

మరో అసెంబ్లీ నియోజకవర్గమైన విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట కు( ఎస్సి రిజర్వుడ్ ) మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను తిరిగి నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీచేసింది. పోస్ట్ గ్రాడ్యుషన్ పూర్తి చేసిన ఈమె 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆమె చంద్రబాబు ప్రభుత్వంలో అధికార ప్రతినిధిగా కీలకంగా వ్యవహరించారు. అయితే నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరడం, ఆమె పై అసమ్మతి తీవ్రంగా ఉండడంతో 2019 ఎన్నికల్లో ఆమెను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుండి బరిలో దించారు. అయితే ఆమె అక్కడ ఓటమి పాలయ్యింది.

2019 లో కొవ్వూరు నుండి వెళ్లి కృష్ణా జిలా తిరువూరు నుండి పోటీచేసి ఓటమి పాలయిన మాజీ మంత్రి జవహార్ ఇటీవలకాలంలో కొవ్వూరులో తిరిగి యాక్టివ్ అయ్యాడు. అదే సమయంలో 2019 లో పాయకరావు పేట నుండి పోటీ చేసిన బి.బంగారయ్య 32 వేల ఓట్ల తేడా తో ఓడిపోయి, ఆ తర్వాత నియోజకవర్గం మొహం కూడా చూడలేదు. ఈనేపధ్యంలో వంగలపూడి అనితను పార్టీ అధిష్టానం తిరిగి పాయకరావుపేటకే పంపినట్టు తెలుస్తుంది. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో టికెట్ సంగతి దేవుడెరుగు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నాలుగేళ్లు పార్టీని సమర్ధవంతంగా నడపడమే ఆమె ముందున్న పెద్ద సవాలని తెలుగుదేశం నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరి చంద్రబాబు చేపడుతున్న ఈ సంస్థాగత మార్పులు పార్టీకి ఎంతమేరా ఉపయోగపడతాయో చూడాలి.