iDreamPost
iDreamPost
ఏపీ వ్యవహారాల్లో అడ్డగోలుగా బాబు బ్యాచ్
సమస్యతీరాలని అంతా ఆశిస్తారు. పరిష్కారం కోరుకుంటారు. సమన్వయంతో సాగితే సంతోషిస్తారు. విబేధాలు తొలగిపోవడాన్ని ఆహ్వానిస్తారు. కానీ కొందరు దానికి భిన్నం. బహుశా పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా ఉంటుందనే నానుడి మాదిరిగా పచ్చ మీడియాకి ప్రతీ దానిలో సమస్యలే కనిపిస్తాయి. ప్రతీ అంశంలోనూ ప్రతికూలత చూడడం వారికి అలవాటుగా మారుతోంది. బహుశా ఇది పెద్ద సమస్యగా మారుతూ ముదురుతుందా అనే సందేహం వస్తోంది.
ఏపీలో ప్రభుత్వం అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధపడిందనుకోండి.. పచ్చ మీడియాకి సంతృప్తినివ్వదు. అదే చంద్రబాబు హయాంలో పేదలకు ఇవ్వడానికి ఇళ్ల స్థలాలే లేవని అంటే మాత్రం ఆహా..ఓహో అంటూ కీర్తనలు వినిపిస్తారు. జగన్ ప్రభుత్వం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికితీసి, అదనంగా వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి పేదలకు ఇచ్చినా రుచించదు. వెంటనే ఊరికి దూరంగా ఇస్తున్నారు, పల్లంగా ఉన్న భూములు ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇళ్లస్థలాల్లో నీరు చేరింది అంటూ రాస్తారు. ఇలాంటి వార్తలను వండి వార్చుతారు. 30లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమనే చారిత్రక నిర్ణయం దేశ చరిత్రలోనే మొదటిసారి అయినప్పటికీ అందులో లొసుగులు చూడడమే తప్ప ఇంతటి సాహసం ఇంతకాలం ఎవరూ ఎందుకు చేయలేదన్నది వారికి పట్టదు. చంద్రబాబు సెంటు భూమి కూడా ఎందుకు ఇవ్వలేకపోయారనే ప్రశ్న వేయలేరు.
కేవలం ఇళ్ల స్థలాలే కాదు… అన్నింటా అదే తీరు. ఏపీలో ఒకేసారి 13 మెడికల్ కాలేజీలు నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఓ అడుగు వేస్తుంది. శంకస్థాపన చేసి పనులకు సిద్ధమవుతుంది. ఎవరూ ఊహించని పాడేరు లాంటి చోట ఏకంగా మెడికల్ కాలేజీ నిర్మాణానికి పూనుకుని కొత్త చరిత్రను సాక్షాత్కరిస్తుంది. అయినా దానిని సహించలేని పచ్చ మీడియా వెంటనే ఏదో కొత్త కథను ముందుకు తెస్తుంది. ఏపీలో అప్పులెక్కువయిపోయాయని రాతలు రాస్తుంది. ఆర్థిక ఎమర్జెన్సీ అని కూడా అడ్డగోలుతనం ప్రదర్శిస్తుంది. అసలు ఈదేశంలోనే కాదు కోవిడ్ తర్వాత ప్రపంచమంతా ఆదాయాలు పడిపోయాయి, అన్ని ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయనే విషయాన్ని దాచిపెడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నటి బడ్జెట్ ప్రతిపాదనల్లో భారీగా అప్పులకు సిద్ధమవుతుందనే సంగతిని కప్పిపుచ్చేస్తుంది. ప్రపంచలో జగన్ ఒక్కరే అప్పులు చేస్తున్నట్టు, ఏపీకి మాత్రమే అప్పులు పెరుగుతున్నట్టు నిత్యం వక్రబుద్ధి చాటుకుంటారు. చంద్రబాబు హయాంలో చేసినవి అప్పులు కాదన్నట్టుగా, అప్పుల్లో చేసినా అది అభివృద్ధి అన్నట్టుగా చిత్రీకరిస్తారు. ఆ మాటున జగన్ సర్కారు చేస్తున్న అభివృద్ధి కప్పిపుచ్చుతారు.
చంద్రబాబు హయాంలో మాట్లాడితే కియా వచ్చింది, పట్టిసీమ కట్టామని చెప్పడం తప్ప అంతకుమించి ఒక్క పని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉండి నిత్యం జగన్ సర్కారు మీద విమర్శలకు పూనుకుంటారు. పోలవరం స్పిల్ వే పూర్తి చేసి నీటిని నిల్వచేయడానికి కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో పూర్తయ్యిందంటే మళ్లీ ఏవేవో చెబుతారు. 2016 వరకూ పోలవరం పనులే చేయని చంద్రబాబు రెండేళ్లలో పోలవరం 70 శాతం పూర్తి చేసేశాడని పచ్చిగా రాసేస్తుంటారు. గద్దెనెక్కిన వారంలోనే పోలవరం వెళ్లి పనులు పరిశీలించిన జగన్ హయాంలో ఏమీ జరగలేదని సూత్రీకరిస్తారు. అంతటితో సరిపెడతారా మూడు పోర్టుల నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలతో పాటుగా వాడవాడలా సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్ రూపంలో వెలుస్తున్న సర్కారీ కార్యాలయాలు, అందులో కొత్త కొలువులు కూడా అభివృద్ధి కాదన్నట్టుగా రాసేస్తారు. బాబు హయాంలో ఏమీ జరగకపోయినా గ్రాఫిక్స్ తో జనాలను మభ్యపెట్టే ఈ బ్యాచ్ కి ఇప్పుడు ఊరూరా అభివృద్ధి కనిపించడం అసలు జీర్ణం కావడం లేదని అనేకమార్లు రుజువవుతోంది.
తాజాగా ఉద్యోగుల వేతన సవరణ విషయంలో కొంత వివాదం చెలరేగింది. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య కొంత వైరుధ్యం ఉంది. దానిని పూడ్చడానికి చర్చలు జరిపారు. ఉద్యమాన్ని చల్లార్చడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి ఉపసంహరించుకున్న అనేక రాయితీలను పునరుద్దరించారు. అది కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు రుచించకపోవడమే నేటి పైత్యానికి తార్కాణం. తొలగని రికవర్రీ అంటూ హెచ్ ఆర్ ఏ అమలు తేదీ ని ప్రస్తావిస్తూ ఇంకా రికవర్రీ ఉందని ఈనాడు రాస్తే, దానికి ఓ అడుగు ముందుకేసి నిస్సిగ్గు ఆంధ్రజ్యోతి అచ్చేసింది. వారు రాసిన రాతల్లో ఓసారి పరిశీలిస్తే ఎంత హేతుబద్ధత ఉందో వారికే తెలుస్తుంది. అయినా అన్నీ వదిలేసి రెచ్చిపోవడం అలవాటుగా మార్చుకున్నారు. అందుకే ప్రజలు తమను విశ్వసించడం లేదనే విషయాన్ని విస్మరించేశారు. పదే పదే చెప్పిందే చెబితే చివరకు నమ్మకపోతారా అనే సూత్రాన్ని నమ్ముకుని బాబు బాటలో సాగుతున్న వీళ్ల తీరు చూసి విచారించడం తప్ప మరో అవకాశమే కనిపించడం లేదు.