iDreamPost
iDreamPost
జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ వ్యతిరేకించాలనే క్రమంలో టీడీపీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారు. భవిష్యత్తుని కూడా విస్మరిస్తున్నారు. ఎంతటి వాదనలైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న చిన్న అంశాల నుంచి ఎక్కువ మంది ప్రయోజనాలతో ముడిపడిన పెద్ద విషయాల వరకూ వదలడం లేదు. అన్నింట్లో వేలు పెట్టి జగన్ తీసుకున్న లైన్ ని తప్పుబట్టడమే తప్ప విధానమన్నట్టుగా కనిపిస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా స్కూళ్లు మూసివేయాలనే వైఖరి తీసుకున్నారు. దానికోసం నానా రచ్చ చేస్తున్నారు. ఏపీలో విద్యాసంస్థలన్నీ మూసివేయాలనే డిమాండ్ టీడీపీ వల్లిస్తోంది. ఇది చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
తెలంగాణాలో విద్యాసంస్థల సెలవుల పొడిగింపు వ్యవహారం చాలామందిని నిరాశపరిచింది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు, పేరెంట్-టీచర్ కమిటీలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలలు కొనసాగించాలని డిమాండ్ చేశాయి. కరోనా జాగ్రత్తల మధ్య పాఠాలు చెప్పాలని కోరుతున్నారు. ఆన్ లైన్ విద్యావిధానం అక్కరకు రాకపోగా పిల్లల జీవితాల మీద ప్రభావం చూపుతోందని, కొందరు పక్కదారి పట్టేందుకు కూడా ఆస్కారమిస్తోందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విద్యాసంస్థల మూసివేత వల్ల ఉపయోగం ఉండదని తేల్చింది. విద్యార్థుల్లో సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి వేగంగా ఉండదని నిర్ధారించింది. కరోనా నియంత్రణ చర్యలు పగడ్బందీగా చేపట్టి పాఠశాలలు నడపాలని అందరికీ సూచించింది. చివరకు అమెరికా వంటి దేశాల్లో కూడా విద్యాసంస్థలు యధావిధిగా నడుస్తున్నాయి. అన్ని కార్యకలాపాలు సాగుతున్నాయి. అయినా ఏపీలో మాత్రం బడులు నడవడానికి వీలులేదంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడం, పదే పదే కోరడం విస్మయకరంగా కనిపిస్తోంది. డబ్ల్యూ హెచ్ ఓ కన్నా టీడీపీ నేతలకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో కరోనా తో సహజీవనం గురించి సీఎం జగన్ చెప్పగానే ఇదే టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా ట్రోలింగ్ చేశారు. చివరకు ఇప్పుడు టీడీపీ నేతలు కూడా సహజీవనానికి అనివార్యంగా అలవాటుపడ్డారు.
మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. సినిమా హాళ్లు నడుపుతున్నారు. ప్రయాణాలకు రైళ్లు, బస్సులు తిప్పుతున్నారు. వాటిలో ఎక్కడా కరోనా వ్యాప్తి ఉండదా అనే అనుమానం టీడీపీ నేతలకు రాకపోవడం ఆశ్చర్యం. కేవలం స్కూళ్లలోనే కరోనా వస్తుందన్నట్టుగా బళ్లు మూసివేయాలని టీడీపీ కోరడం విచిత్రంగా మారింది. నిజానికి కార్పోరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాసే టీడీపీ నేతలు ఇప్పుడు ఫీజుల వసూళ్ళు దాదాపు పూర్తికావడంతో ఇక బడులు నడపాలనే ఆలోచనల వారికి లేదన్నట్టుగా కనిపిస్తోంది. స్కూళ్లు మూసేస్తే టీచర్లను ఇంటికి పంపించేసి జీతాలు కూడా ఇవ్వకుండా లాభాలు మిగుల్చుకుందామనే బడా విద్యాసంస్థలకు టీడీపీ బాకా ఊదుతున్నట్టుగా అర్థమవుతోంది.
Also Read : నిర్ణయానికి వచ్చేశాక నిజనిర్ధారణ కమిటీ ఎందుకు అచ్చెన్నా?