iDreamPost
android-app
ios-app

టీడీపీని సోషల్ మీడియా నడిపిస్తుందా?

టీడీపీని సోషల్ మీడియా నడిపిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడం, మీకు వడ్డీతో తిరిగి ఇవ్వడం ఖాయమనే డైలాగ్ వినీ వినీ మీడియాకు కూడా బోర్ కొట్టింది. అటు టీడీపీ కార్యకర్తలు కూడా ఈ డైలాగ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి మాజీ వార్డు మెంబర్ ల వరకు సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో తెగ సందడి చేశారు. అక్కడ ఏం జరిగినా జరగకపోయినా డైలాగ్ మాత్రం కొన్ని ఛానల్స్ లో బాగా వినపడింది. అక్కడి వరకు బాగానే ఉంది గాని… అసలు అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ఏం చేస్తుందో… ఆ పార్టీ కార్యకర్తలకు కూడా క్లారిటీ లేదు మరి.

పార్టీలో చాలామంది కీలక నేతలు ఉన్నా సరే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పార్టీ నడవడిక ఉంది. ఉద్యోగుల సమస్యలతో టీడీపీకి పావలా కూడా ఉపయోగం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. అయినా సరే టీడీపీ కార్యకర్తలు, నాయకులు అదే పనిగా వాళ్ళ వీడియో లు, ఫోటోలు వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. కుదురుగా ఉన్న ఉద్యోగులను సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా ఏకతాటి మీద లేకుండా… ఉద్యోగుల విషయంలో భిన్నస్వరాలు వినిపించే పరిస్థితి వచ్చింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి… బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. అయినా సరే ఆ బడ్జెట్ గురించి ఒక్క మాట లేదు. విభజన హామీల గురించి గట్టిగా అడగడం మానేసి… సిఎం అడగడం లేదు, ఎంపీలు అడగడంలేదని సందడి చేస్తున్నారు. 2019 కి ముందు బిజెపి ని నానా తిట్లు తిట్టి ఇప్పుడు రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా అడిగే పరిస్థితి కనపడటం లేదనే మాట వాస్తవం. జిల్లాల విషయంలో పేర్ల గురించి రచ్చ చేస్తూ… ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడం మర్చిపోయారు.

జిల్లా కేంద్రాలకు కొన్ని కొన్ని ప్రాంతాలు దూరంగా ఉన్నాయి. కాబట్టి వాటికి పరిష్కారాలు సూచించడం మానేసి… కొందరితో దీక్షలు ప్లాన్ చేసుకున్నారు. రెవెన్యూ డివిజన్ ల గురించి నిరసన దీక్షలు చేయిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటే కేంద్ర పెద్దలను కలవడానికి ప్రయత్నం చేయడం, 14 ఏళ్ళ అనుభవంతో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం ఇవేమీ పెద్దగా కనపడటం లేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, ఉద్యోగులను టార్గెట్ చేసే విధానాలను ఎంచుకుని రాజకీయం చేస్తున్నారు.

ఇక టీడీపీ భవిష్యత్తుగా చెప్పుకునే నారా లోకేష్ గాని, మంత్రి పదవులు అనుభవించి, పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న యనమల రామకృష్ణుడు లాంటి వారు గానీ, చింతకాయల అయ్యన్న పాత్రుడు గాని ఎక్కడా కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం లేదు. అధికార ప్రతినిధుల ద్వారా లేనిపోని ఆరోపణలు చేయించడం, అనవసరమైన విషయాలను ప్రస్తావించడం జరుగుతోంది. మరి ప్రజా సమస్యలను ఎప్పుడు ప్రస్తావించి, వాటికి ఎప్పుడు పరిష్కారం చూస్తారో చూడాలి.