iDreamPost
iDreamPost
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయకత్వం మీద సందేహాలు పెరుగుతున్నాయి. ఆయన వ్యూహాలన్నీ బెడిసికొడుతుండడం తెలుగుతమ్ముళ్లను కలవరపరుస్తోంది. చాలాకాలంగా చంద్రబాబు ఏదోటి చేస్తారులే అనుకునే కార్యకర్తల్లో కూడా ఇప్పుడు ఆయన ఏమీ చేయాలేరా అనే అబిప్రాయం వినిపిస్తోంది. తాజాగా పరిషత్ ఎన్నికల్లో బాబు వ్యూహాలు బెడిసికొట్టిన తీరు చూసి బాబు మీద నమ్మకం మరింత సడలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. వైఎస్సార్ హయంలో పారినట్టుగా జగన్ పాలనలో బాబు పన్నాగాలు పారడం లేదన్నది మరోసారి ప్రస్ఫుటం కావడం టీడీపీకి తలనొప్పిగా తయారయ్యింది.
ఏపీలో స్థానిక ఎన్నికలన్నీ చంద్రబాబు హయంలోనే జరగాల్సి ఉంది. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజా వ్యతిరేకతకు భయపడి వాటిని వాయిదా వేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడవకముందే ఈ ఎన్నికల నిర్వహణకు ప్రయత్నించింది. కానీ ఆనాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఉపయోగించుకుని ఈ ఎన్నికల ప్రక్రియను టీడీపీ అధినేత అడ్డుకున్నారనే అభియోగాలున్నాయి. టీడీపీని ఓటమి బారి నుంచి కాపాడేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని జగన్ సైతం విమర్శించారు. దానికి కరోనా ముసుగు వేయడాన్ని అభ్యంతరం పెట్టారు. చివరకు జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు జరగాల్సిన ఎన్నికలు ప్రస్తుతం రెండున్నరేళ పాలన పూర్తవుతున్న వేళ జరపాల్సి వస్తోంది.
దీనంతటికీ టీడీపీ నేతలే కారణమన్నది బహిరంగ రహస్యం. చంద్రబాబు తాను అధికారంలో ఉండగా జరపకపోగా, జగన్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను కొంతకాలం పాటు అడ్డుకున్నారు. చివరకు పరిషత్ ఎన్నికలకయితే పోలింగ్ ముగిసినా ఫలితాలు రాకుండా నిలువరించేయత్నం చాలా వరకూ చేశారు. న్యాయస్థానాలను ఉపయోగించుకుని స్థానిక ఎన్నికల ప్రక్రియని నిలిపివేయాలని శ్రమించిన చంద్రబాబుకి చుక్కెదురయ్యింది. అన్నింటికీ మించి ఆఖరి నిమిషంలో ఎన్నికల బహిష్కరణ నిర్ణయం టీడీపీ అధినేతను అభాసుపాలుజేసింది. కుప్పంలో టీడీపీ కుప్పకూలిపోయినా, నారావారిపల్లెలో సైతం ఆపార్టీకి అడ్రస్ లేకుండా పోయినా అవన్నీ చంద్రబాబు నిర్ణయ ఫలితంగానే అన్నది కాదనలేని వాస్తవం.
Also Read : అభ్యర్థులకు ఉన్న ధైర్యం అధినేతకు లేదా…?
టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసి, బ్యాలెట్ పత్రాలు ముద్రణ పూర్తయిన తర్వాత ఎన్నికలను బాయ్ కాట్ చేసినా అధికారికంగా టీడీపీ గుర్తు బరిలో ఉన్నట్టే అవుతుది. అంతేగాకుండా విజయం కోసం గట్టి ఆశలున్న నేతలు చాలాచోట్ల అధినేతను ధిక్కరించి ప్రయత్నాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 వరకూ ఎంపీటీసీ స్థానాల్లో విజయం కూడా దక్కించుకున్నారు. కౌంటింగ్ రోజు కూడా టీడీపీ నేతలు చాలాచోట్ల ఆశాభావంతో కనిపించినా అధినేత వ్యూహాలు అసలుకే ఎసరు తెచ్చిపెట్టడంతో టీడీపీ పరువు పోయింది. అత్యంత దుర్భరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందనడంలో సందేహం లేదు. దానిని ఎదుర్కోవాల్సిన సమయంలో పారిపోవడం, న్యాయస్థానాల సహాయంతో మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయించగలమనే విశ్వాసంతో సాగడం టీడీపీకి తలనొప్పిని తెచ్చిపెట్టింది.
వాస్తవానికి టీడీపీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తే , ఆ తర్వాత పిటీషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటికి తీసుకురాగలమని చంద్రబాబు అంచనా వేశారు. కానీ అనుకున్నొదకటి, అయ్యిందొకటి అన్నట్టుగా మారింది. ఆరు నెలల క్రితం మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒక్క మేయర్ సీటూ దక్కకపోయినా, కనీసం తాడిపత్రి మునిసిపాలిటీనయినా జేసీ బ్రదర్స్ పుణ్యమా అని దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు జెడ్పీ పీఠాల్లో టీడీపీ సున్నా సీట్లకే పరిమితం కావడమే కాకుండా కనీసం పోటీని కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన తీరు కనిపించింది. ఇది స్థానికంగా టీడీపీకి పెద్ద అవరోధంగా మారబోతోంది. క్షేత్రస్థాయిలో టీడీపీని మరింత సమస్యల్లోకి నెట్టేదిశలో ఉంది.
ఆరు నెలల క్రితమే పోలింగ్ జరిగిన వెంటనే ఈ ఫలితాలు కూడా వచ్చి ఉంటే టీడీపీకి ఇప్పుడున్నంత సమస్య ఉండేది కాదు. కానీ ఆనాడు ఫలితాలను అడ్డుకున్న పాపం ఇప్పుడు బాబుని వెంటాడేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల టీడీపీ పలు కార్యక్రమాలతో కొంత శక్తిని కూడగట్టుకునే ప్రయత్నంలో ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందనే నమ్మకం కార్యకర్తల్లో కల్పిస్తోంది. అలాంటి సమయంలో ఈ ఎన్నికల ఫలితాలు వెలువడడం ఆపార్టీకి పెద్ద అవరోధం అనడంలో సందేహం లేదు. మరో ఐదారు నెలల పాటు ఈ ఘోరపరాజయం తాలూకా ఓటమి భారం టీడీపీని కార్యక్షేత్రంలో వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా క్యాడర్ కాలుకదిపేందుకు ఇబ్బందిగా మారుతుంది. దాంతో బాబు చేసిన వ్యవహార ఫలితమే ఇప్పుడు బాబుని కలవరపెట్టేందుకు కారణమవుతోంది. దాంతో చంద్రబాబు వ్యూహాలు పనికిరావడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. జగన్ రాజకీయ చతురత ముందు బాబు అనుభవం తేలిపోతుందనే వాదనను బలపరుస్తోంది.
Also Read : టీడీపీ ఆ ఏడు జెడ్పిటిసీలు ఎలా గెలిచింది?