iDreamPost
android-app
ios-app

అక్కడ చదివితే రిజర్వేషన్.. స్టాలిన్‌ సంచలన నిర్ణయం

అక్కడ చదివితే రిజర్వేషన్.. స్టాలిన్‌ సంచలన నిర్ణయం

ప్రజలకు మేలు చేసే క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఏ కులం వారైనా దేవాలయాల్లో అర్చకత్వం ,చేయొచ్చని నిర్ణయం తీసుకున్న స్టాలిన్‌ ప్రభుత్వం.. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఉన్నత చదువుల సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సంబంధిత బిల్లుకు కేబినెట్‌ అమోదముద్ర వేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండడంపై దృష్టి పెట్టిన స్టాలిన్‌ ప్రభుత్వం.. అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు జస్టిస్‌ మురుగేషన్‌ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. సదరు కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ పాఠశాల్లో చదివిన వారికి ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫిషరిస్, వెటర్నరీ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు స్టాలిన్‌ కేబినెట్‌ నిర్ణయించింది. ఇప్పటికే ఈ రిజర్వేషన్లను వైద్య విద్యలో అమలు చేస్తున్నారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన వైద్య అడ్మిషన్లలో రిజర్వేషన్లు అమలు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకుంటుంటారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్న వారితో ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులు పోటీ పడి సీట్లు సంపాదించాల్సి ఉంటుంది. సాధారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రమాణాలు తక్కువగా ఉన్న కారణంగా.. అతి తక్కువ మంది వృత్తి విద్యా కోర్సుల్లో అడ్మిషన్లు సాధించగలుగుతున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువ మంది ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర వృత్తి విద్యలను అభ్యసించేందుకు స్టాలిన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదవడం వల్ల.. వారి జీవితాలు మెరుగుపడతాయి. పేదరికం నుంచి బయటపడతారు. స్టాలిన్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : ఆగస్టు సంక్షోభం .. ఎన్టీఆర్ లాగ ఎంజీఆర్ సీఎం పదవి మీద కుట్ర జరిగిందా?