iDreamPost
android-app
ios-app

యుద్ధం ముగిసింది.. విజ‌యం ఎవ‌రిని వ‌రించ‌నుంది..!

యుద్ధం ముగిసింది.. విజ‌యం ఎవ‌రిని వ‌రించ‌నుంది..!

ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. అధికార, విపక్ష నేతలు ఎత్తులు, పైఎత్తులతో కత్తులు దూసుకున్నారు. ఆ మూడు రాష్ట్రాలలోనూ తమిళనాడు ప్రచారం మరింత హోరాహోరీగా సాగింది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో దూషణలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈసీ పలువురిపై చర్యలు కూడా చేపట్టింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలలో మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో రెండు విడతల పోలింగ్‌ ముగిసి, మూడవ విడత పోలింగ్‌ కూడా మంగళవారం జరగనుంది. తమిళనాట 234, పుదుచ్చేరి 30, కేరళలో 140 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే ఇప్పటికే రెండు సార్లు అధికారం నిలిపుకుంది. తన అధికారాన్ని ఇంకా కొనసాగించుకోవాలని ఈసారి కూడా ఎన్నికలలో విపరీతంగా ప్రచారం నిర్వహించింది. అధికారమే పరమావధిగా బీజేపీతో పొట్టుపెట్టుకుంది. కాగా, పదేళ్లపాటు దూరమైన అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న కసితో డీఎంకే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వ్యూహరచన చేసింది. ఇలా రెండు పార్టీలకు చెందిన కూటములు పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహించాయి. అన్నాడీఎంకే తరఫున ముఖ్యమంత్రి పళనిస్వామి, ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, పీఎంకే అధినేత డాక్టర్‌ రాందాస్‌, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్‌ ప్రచారం చేశారు.

డీఎంకే కూటమి తరఫున ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎండీఎంకే నేత వైగో, సీపీఐ, సీపీఎం నేతలు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో స్టాలిన్‌ తీవ్రస్థాయిలో బీజేపీ, అన్నాడీఎంకే నేతలపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా మక్కల్‌నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌కు అండగా ఆయన కుమార్తె అక్షరహాసన్‌, ఆయన సోదరుడి కుమార్తె సుహాసిని, సమత్తువ మక్కల్‌ కట్చి అధినేత శరత్‌కుమార్‌, ఆయన సతీమణి రాధిక నిలిచారు. అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం అధినేత టీటీవీ దినకరన్‌ తమ కూటమి అభ్యర్థులకు అన్నీ తానై వ్యవహరించారు. ఆయన కూటమిలో డీఎండీకే అధినేత విజయకాంత్‌ కూడా ఉన్నప్పటికీ ఆయన అనారోగ్యం కారణంగా అంతంతమాత్రంగానే ప్రచారం చేయగలిగారు. తమిళనాడుపై బీజేపీ గురిపెట్టడంతో ప్రధాని మోదీ ఈ ఎన్నికల కోసం నాలుగు సార్లు ఆ రాష్ట్రంలో పర్యటించారు.

మునుపెన్నడూ లేని విధంగా ఈసారి తమిళనాడులో ఐదు కూటములు బరిలో నిలిచాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, పెరుంతలైవర్‌ కామరాజర్‌ కట్చి, తమిళ మానిల కాంగ్రెస్‌(టీఎంసీ) ఉన్నాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, డీపీఐ, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, ముస్లింలీగ్‌, మణిదనేయ మక్కల్‌ కట్చి ఉన్నాయి. కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌నీదిమయ్యం కూటమిలో సమత్తువ మక్కల్‌ కట్చి, ఇండియ జననాయగ కట్చి, టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగంలో డీఎండీకే, ఎస్డీపీఐ తదితర పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. సీమాన్‌ నాయకత్వంలోని నామ్‌తమిళర్‌ కట్చి మాత్రం ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దింపింది. ఇక పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమికి మద్దతుగా ఆ పార్టీ అధినేత రంగస్వామి, ప్రధానిమోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌ తదితరులు ప్రచారం చేయగా, కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి తరఫున ఆ పార్టీ జాతీయ నేతలెవ్వరూ అటువైపు చూడలేదు. అయితే డీఎంకే అధినేత స్టాలిన్‌ మాత్రం పుదుచ్చేరిలో పర్యటించి ప్రచారం నిర్వహించారు.