కరోనా మృతుల అంత్యక్రియలు అడ్డుకుంటే మూడేళ్ల జైలు.. తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌

కరోనా వల్ల చనిపోయిన వారి మృతదేహాల నుంచి రోగాలు వ్యాప్తి చెందవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా చెబుతోంది. వైరస్‌ బారిన పడి మరణించిన వారని ఖననం చేయడం కంటే కాల్చి వేయడమే మంచిదన్నది కూడా కేవలం అపోహ మాత్రమేనని కూడా పేర్కొంటోంది. అయినా సరే.. మన దేశంలో కొన్ని చోట్ల ప్రజలు భయాందోళనలతో కరోనా మృత దేహాలపై నిర్ధయతో వ్యవహరిస్తున్నారు. మానవత్వం లేకుండా ఖననం చేయకుండా అడ్డుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలను అడ్డుకుంటే ఒకటి నుంచి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించేలా తమిళనాడు ప్రభుత్వం ఆదివారం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. తమిళనాడు పబ్లిక్‌ హెల్త్‌ యాక్ట్‌-1939లో సెక‌్షన్‌ 74 ప్రకారం భారీగా జరిమానా కూడా ఉంటుందని అందులో పేర్కొంది. కోవిడ్‌ మృతుల అంతిమ సంస్కారాలకు ఆటంకం కలిగించడం, అందుకు కారకులుగా మారి నేరస్తులుగా మిగులొద్దని ప్రజలకు సూచించింది.

గతవారం చెన్నైలో ప్రముఖ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ సైమన్‌ హెర్కులస్‌ కరోనా వైరస్‌ బారిన పడి మరణిస్తే.. ఆయన మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్థానికులు అనుమతించలేదు. దాంతో అన్నానగర్‌లోని శ్మశానానికి అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ కూడా స్థానికులు అంబులెన్స్‌ను అడ్డుకోవడంతోపాటు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర హైకోర్టు కూడా తీవ్రంగా స్పందిచడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

కరోనా మృతదేహాల ఖననాలను అడ్డుకోవడం ఇటీవల పెరిగింది. మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు జాన్‌ మరణించగా.. ఆయన మృతదేహాన్ని ఖననం కోసం తీసుకెళ్లగా అక్కడి జనం అడ్డుకున్నారు. మృతదేహాన్ని ఖననం చేస్తే తమకు కరోనా వస్తుందంటూ గొడవకు దిగారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అధికారులు ఎంత నచ్చజెప్పినప్పటికీ వినలేదు. ఇలా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజల్లో అపోహలు తొలగడం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కరోనా వైరస్‌తో చనిపోయిన మృతదేహాల నుంచి కుటుంబ సభ్యులకుగానీ, వైద్య సిబ్బందికిగానీ వైరస్‌ సోకే ప్రమాదం లేదంటూ భారత్‌ ప్రభుత్వం కూడా అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు.

Show comments