Idream media
Idream media
నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతుల పోరాటం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రం సుమారు 60 వేల మంది ఆందోళన చేస్తున్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ సంఖ్య ఇంకా పెరిగితే అదుపు చేయడం కష్టమవుతుందనే భావనలో అధికారులు ఉన్నారు. రైతులతో కేంద్రం ఐదు దఫాలు చర్చలు జరిపినా విషయం కొలిక్కి రాలేదు. ఇకపై రైతులను ఒప్పించే మార్గాన్ని మాని తాము రూపొందించిన చట్టాలు ఎంత గొప్పవో ప్రచారం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే ప్రతిపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారనే వాదనను బలంగా వినిపించాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా మధ్యప్రదేశ్ లోని రైతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున రైతు ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. చట్టాలు, రైతుల ఉద్యమాన్ని ఉద్దేశించి మోదీ ఏమాట్లాడతారోనన్న ఉత్సుకత ఏర్పరిచింది.
ఆ సమావేశంలో మోదీ మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలతో కనీస మద్దతు ధరకు వచ్చిన ఢోకా ఏమీ లేదని స్పష్టం చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్యాలు ప్రచారం చేస్తూ అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘కొత్త వ్యవసాయ చట్టాలపై ఎవరికైనా అనుమానాలు, ఆందోళనలు ఉంటే వారితో చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వారి భయాలు పోగొడతాం. అన్నదాతల ముందు తలలు వంచి, చేతులు జోడిస్తున్నాం. కనీస మద్దతు ధర ఎత్తివేస్తారనేది అతి పెద్ద అబద్ధం’’ అని పేర్కొన్నారు. ఈ సంస్కరణలు రాత్రి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదన్న ప్రధానమంత్రి.. ‘‘గత 22 ఏళ్లుగా ప్రతీ ప్రభుత్వం, రాష్ట్రాలతో ఈ విషయం గురించి అనేకమార్లు చర్చలు జరిపింది. రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయవాదులు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. కానీ ఈరోజు కొన్ని పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. తమ మేనిఫెస్టోలో వీటి గురించి హామీలు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు బాధ పడుతున్నారు. అలాంటి వాళ్లకు నా సమాధానం ఒక్కటే… నాకు ఎలాంటి క్రెడిట్ వద్దు. మొత్తం మీరే తీసుకోండి. మీ ఎన్నికల ప్రణాళికను మేం అమలు చేశాం. రైతుల అభివృద్ధే మాకు ముఖ్యం. దయచేసి రైతులను తప్పుదోవ పట్టించకండి’’అని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ.. తాము చేసిన చట్టాలు మంచికోసమేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ చట్టాల వల్ల మంచే జరుగుతుందని భావిస్తే వేలాది మంది రైతులు ఎందుకు రోడ్డెక్కి వాటికి వ్యతిరేకంగా పోరాడతారని పలువురు విమర్శిస్తున్నారు. భారత్ బంద్ అనంతరం ఆ చట్టాలలో కొన్ని సవరణకు ముందుకొచ్చిన కేంద్రం రద్దు మినహా.. వేరే ఆప్షన్ లేదని రైతులు చెప్పడంతో సవరణల విషయాన్ని పక్కన బెట్టినట్లు కనిపిస్తోంది. అప్పటి నుంచి రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారు. మద్దతు కూడా పెరుగుతోంది. తాజాగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ మాట్లాడుతూ చట్టాలపై అనుమానాలు, ఆందోళనలు ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి ప్రకటించారు. దీంతో ఆరో దఫా చర్చలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.