iDreamPost
android-app
ios-app

టాక్ ఆఫ్ ద లీడ‌ర్.. వైఎస్ జ‌గ‌న్

టాక్ ఆఫ్ ద లీడ‌ర్.. వైఎస్ జ‌గ‌న్

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక‌లో కూడా వైఎస్సార్ సీపీ ప్ర‌భంజ‌నం సృష్టించ‌డంతో ఆ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయాల్లో టాక్ ఆఫ్ ద లీడ‌ర్ గా నిలిచారు. మొట్ట మొద‌టిసారిగా సీఎం కుర్చీ ఎక్కిన జ‌గ‌న్ రాజ‌కీయ శైలి సీనియ‌ర్ల‌ను సైతం అబ్బుర‌ప‌రుస్తోంది. వ‌రుస విజ‌యాలు సాధించ‌డం ఓ ఎత్త‌యితే, ఆ విజ‌యాలు కూడా బ్ర‌హ్మాండ‌మైన విజ‌యాలే కావ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఇప్పుడు తాజాగా జ‌రిగిన తిరుప‌తి ఉప ఎన్నిక‌లో కూడా వైసీసీ అభ్య‌ర్థి గురుమూర్తికి 2,71,592 ఓట్ల మెజారిటీ లభించింది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక పంచాయ‌తీ, మున్సిప‌ల్, కార్పొరేష‌న్, ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌తో పాటు తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక జ‌రిగింది. ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క‌రోనా కాలంలో ఎన్నిక‌లు ఎందుక‌ని పంచాయ‌తీ పోల్స్ ఇప్ప‌ట్లో వ‌ద్ద‌ని జ‌గ‌న్ సూచించారు. ఈసీతో వాదించారు. జ‌గ‌న్ సూచ‌న‌ల‌ను, వాద‌న‌ల‌ను విప‌క్షాలు దుష్ప్ర‌చారం చేశాయి. ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌తో ఓడిపోతామ‌ని జ‌గ‌న్ ఎన్నిక‌లంటే భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌చారం చేశాయి. చివ‌ర‌కు జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపికి షాక్ ఇచ్చాయి. 13081 పంచాయ‌తీల‌కు గాను, 10098 స్థానాల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులే విజ‌యం సాధించ‌గా, టీడీపీ కేవ‌లం 2100 స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. అనంత‌రం జ‌రిగిన మున్సిపాల్టీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో 75 మున్సిపాల్టీల‌కు గాను 74, 11కు 11 కార్పొరేష‌న్ల‌ను కూడా వైసీపీయే సాధించి ఎన్నిక‌ల్లో స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించింది. స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ సీట్లు రావ‌డం సాధార‌ణ‌మే కానీ, క్వీన్ స్వీప్ చేసిన అరుదైన ఘ‌న‌త‌ను జ‌గ‌న్ పార్టీ సాధించింది.

ఇప్పుడు తాజాగా జ‌రిగిన తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బంప‌ర్ మెజార్టీ పొందింది. 2019లో జరిగిన ఎన్నికల్లో కన్నా ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటింగ్‌శాతం తగ్గినా వైఎస్సార్‌సీపీకి లభించిన మెజారిటీ భారీగా పెరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకర్గంలో 79.76 శాతం పోలింగ్‌ నమోదైంది. వైఎస్సార్‌సీపీకి 2,28,376 ఓట్ల మెజారిటీ లభించింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 64.42 శాతం పోలింగ్‌ నమోదైంది. కొవిడ్‌ నేపథ్యంలో 15 శాతానికిపైగా పోలింగ్‌ తగ్గింది. అయినా వైఎస్సార్‌సీపీకి పోలైన ఓట్లు పెరిగాయి. గత ఎన్నికలకంటే వైఎస్సార్‌సీపీకి 1.64 శాతం మేర ఓట్లు పెరిగాయి. తాజా ఎన్నికల్లో 2,71,592 ఓట్ల మెజారిటీ లభించింది.

ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బ‌హిరంగంగా ప్ర‌చారం చేసింది లేదు. ర్యాలీలు, స‌భ‌లు నిర్వ‌హించింది లేదు. ఈ ఎన్నిక‌లోనే కాదు గ‌త ఎన్నిక‌ల్లో కూడా అంతే. తిరుప‌తి ఎన్నిక‌కు సంబంధించి ఒకే ఒక్క లేఖ‌తో ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలిచారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో స‌రికొత్త అధ్యాయం సృష్టించారు. కేవ‌లం లేఖ ద్వారానే అభ్య‌ర్థిని గెలిపించాల‌ని కోరుతూ తాను చేసిన ప‌నుల‌ను, త‌న అభిమ‌తాన్ని పేర్కొని ప్ర‌జ‌ల అభిమానం పొందారు. వీట‌న్నింటినీ నిశితంగా ప‌రిశీలిస్తున్న దేశ రాజ‌కీయ ప్ర‌ముఖులు జ‌గ‌న్ వినూత్న పోక‌డ‌ల‌కు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అనుభ‌వంలో చిన్న‌వాడైనా ఆచ‌ర‌ణ‌లో అంద‌రి కంటే మిన్న‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఖ్యాతి పొందుతున్నారు. వ‌రుస ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మాండ‌మైన విజ‌యాల‌ను సొంతం చేసుకుంటూ టాక్ ఆఫ్ ద లీడ‌ర్ అయ్యారు వైఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.