iDreamPost
android-app
ios-app

వామ్మో తాడిపత్రిలో ఇంత మెజారిటీనా..? జేసీ వర్గంలో కలవరం

వామ్మో తాడిపత్రిలో ఇంత మెజారిటీనా..? జేసీ వర్గంలో కలవరం

అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి వర్గాన్ని తాజాగా వెల్లడైన పరిషత్‌ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పార్టీ అధినేత ఆదేశాలతో తాము ఎన్నికలను బహిష్కరించామని జేసీ ప్రభాకర్‌ రెడ్డి చెప్పుకుంటున్నా.. వచ్చిన ఫలితాలు జేసీ వర్గంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నామినేషన్లు దాఖలు, పరిశీలన, తుదిజాబితా ప్రకటన తర్వాత.. ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు చెప్పినా.. పోటీలో ఉన్న తమ్ముళ్లు మాత్రం తమ వర్గాన్ని కాపాడుకునేందుకు, పరువు నిలుపుకునేందుకు బరిలో ఉన్నారు. చంద్రబాబు నిర్ణయం సరికాదని చెప్పి జేసీ ప్రభాకర్‌ రెడ్డి పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సహకారం అందించడంలో తన బాధ్యతను నిర్వర్తించారు.

అయితే తాజాగా వచ్చిన ఫలితాలు జేసీకి విస్మకం కలిగిస్తున్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 55 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇద్దరు అభ్యర్థులు చనిపోవడంతో అక్కడ ఎన్నిక ఆగిపోయింది. మిగతా 53 ఎంపీటీసీ స్థానాలకు గాను 52 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకోవడం చర్చనీయాంశమవుతోంది.

గెలుపు సరే.. ఇంత మెజారిటీనా..?

వైసీపీ గెలుపును తక్కువ చేసి చూపేందుకు.. ఎన్నికలు బహిష్కరించామనే పల్లవి అందుబాటులో ఉన్నా.. ఆ పార్టీకి వచ్చిన మెజారిటీని చూసి జేసీ వర్గం బిత్తరపోతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో తాడిపత్రి మున్సిపాలిటీ, తాడిపత్రి రూరల్, యాడకి, పెదపప్పూరు, పెదవడుగూరు మండలాలు ఉన్నాయి. నాలుగు మండలాల్లోనూ వైసీపీ జెండా ఎగిరింది. నాలుగు జెడ్పీటీసీలను వైసీపీ భారీ మెజారిటీతో కైవసం చేసుకోవడమే జేసీ వర్గానికి మింగుడుపడడం లేదు.

Also Read : మా గెలుపును వారు జీర్ణించుకోలేకపోతున్నారు – సీఎం జగన్‌

తాడిపత్రిలో 14,601, యాడికిలో 16,281, పెదపప్పూరులో 9,866, పెద్దవడుగూరులో 10,353 ఓట్ల మెజారిటీలతో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నాలుగు మండలాల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ 51,101 ఓట్లు. ఎన్నికలను బహిష్కరిచామని ఓటమిపై మనసుకు ఏదో చెప్పుకున్నా.. ఈ మోజారిటీ మాత్రం జేసీ వర్గంలో తెలియని ఆందోళనను రేపుతోంది. తాడిపత్రి మున్సిపాలిటీ ఓట్లు ఇందులో లేవు అనుకున్నా.. మొన్న జరిగిని ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ రెండూ హోరాహోరీగా పోరాడాయి. 36 సీట్లకు గాను వైసీపీ 16, టీడీపీ 18 గెలిచింది. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్ధతుతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి చైర్మన్‌ అయ్యారు.

ఎలా చూసినా పరిషత్‌ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ పై జేసీ వర్గంలో ఆందోళన తగ్గడం లేదు. 2014 ఎన్నికల్లో పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి 22,158 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే 2019కి వచ్చేసరికి పెద్దారెడ్డిపై 7,511 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కంచుకోట అని చెప్పుకున్న తాడిపత్రి బద్ధలైంది. ఆ తర్వాత సర్పంచ్‌ ఎన్నికల్లోనూ వైసీపీ హవా వీచింది.

పట్టుజారితే లాభం లేదనుకున్న జేసీ.. తన స్థాయిని తగ్గించుకుని మరీ కౌన్సిలర్‌గా పోటీ చేశారు. తనను వేధిస్తున్నారంటూ.. తాడిపత్రి వీధుల్లో తిరిగారు. చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా గెలిచారు. ప్రజాస్వామ్యబద్ధతంగా వైసీపీ వ్యవహరించడంతో చైర్మన్‌ పీఠం దక్కింది. హమ్మయ్య అనుకునే లోపే.. గ్రామీణ ప్రాంతాలలో తమ పరిస్థితి ఏంటనేది పరిషత్‌ ఎన్నికలతో తేటతెల్లమైంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగడంతో.. ఆ ఓట్లన్నీ వైసీపీకి పడినవని ఒప్పుకోక తప్పదు. 51,101 ఓట్ల మోజారిటీని చూసిన జేసీ వర్గం.. 2024 ఎన్నికల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది.

Also Read : ఆ ఒకే ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్ ఎలా గెలిచాడు?