Idream media
Idream media
మొగుడు కొట్టినదానికన్నా తోడికోడలు నవ్వడమే ఎక్కువ బాధ కలిగిస్తుంది. ప్రస్తుతం అనంతపురం టీడీపీ లీడర్స్ జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ పరిస్థితి అలాగే ఉంది. ఆరోజుల్లో జేసీ అంటే ఒక్క కిరీటం తక్కువగాని మిగతాదంతా రాజరికాన్ని తలపించేది. ఆరోజుల్లో వారు చేసిందే చట్టం.. చెప్పిందే వేదం.. ఏ పార్టీలో ఉన్నా ఆ జిల్లావరకు వారే మంత్రి.. కాదు కాదు.. వారే ప్రధానమంత్రి.. కానీ రోజలన్నీ ఒకేలా ఉండవు.. ఇన్నాళ్లుగా వారు సాగించిన పెత్తనానికి చరమగీతం మొదలైంది.
జేసీ బ్రదర్స్ వస్తుంటే రోడ్లన్నీ గ్రీన్ కారిడార్ చేసిన రోజుల నుంచి ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సదరు జేసీ ఇంటికి వెళ్లి వర్నింగ్ ఇచ్చి రావడం అంటే మాటలు కాదు. సరే అదంతా ఒకెత్తు. ఆ సంఘటన జరిగాక అటు జేసీ అనుచరులు గాని , టిడిపి రాష్ట్ర శాఖ గాని, కనీసం అనంతపురం టిడిపి నాయకులు కూడా అయ్యోరామా అనలేదు. ఇది జేసీ బ్రదర్స్ ను మరింత బాధిస్తోంది. కనీసం జిల్లా నాయకులైన పరిటాల కుటుంబం గాని, అటు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గాని జేసీ విషయంలో మద్దతు తెలపకపోవడం జేసీ బ్రదర్స్ ను మరింత అవమాన పరచినట్లు అయింది. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మినహా ఎక్కడా ఎవరూ ఈ విషయం మీద నోరు విప్పలేదు.
ప్రతి విషయం మీదా స్పందించే జేసీ దివాకర్ కూడా దీనిమీద ఇంకా స్పందించినట్లు ఎక్కడా మీడియాలో కానరాలేదు. ఆయన అవమాన భారంతో రగిలిపోతున్నాడా, వైరాగ్యం కమ్ముకున్నదా తెలియని పరిస్థితి నెలకొంది. అధికారం పలుకుబడి పవర్ ఉన్నన్నాళ్లు అందరూ దండాలు పెడతారు. జేసీ బ్రదర్స్ అధికార హోదాలో ఎన్ని అరాచకాలకు పాల్పడినా ఎవరూ కిక్కురుమనలేదు..? ఎదురు ప్రశ్నించే ధైర్యం చేయలేదు. కానీ ఇప్పుడు వారి మీద దండెత్తే పరిస్థితి వచ్చాక వారిపట్ల నిజమైన గౌరవం ఉన్నవాళ్లు ఎవరన్నది తెలిసిపోతుంది. ఇన్నాళ్లూ కన్నూమిన్నూ కానక అందర్నీ అణచివేసే అహంకారపూరిత జేసీ బ్రదర్స్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊగించలేదు. కాలం ఎంతటి కఠినమైనది.. ఏదో సినిమాలో అన్నట్లుగా కాలం ఎవర్నీ వదిలిపెట్టదు..అందరి సరదా తీర్చేస్తుంది.. ఇప్పుడు జేసిల వంతు వచ్చింది..