iDreamPost
android-app
ios-app

తాడిప‌త్రి నెయ్యికి మ‌ద్రాస్‌లో భ‌లే డిమాండ్‌

తాడిప‌త్రి నెయ్యికి మ‌ద్రాస్‌లో భ‌లే డిమాండ్‌

రోజూ ఇంటికి పాలు వ‌స్తాయ‌ని తెలుసు కానీ, పాల‌కి ఒక రోజు వుంటుంద‌ని తెలీదు. జూన్ 1 ప్ర‌పంచ పాల దినోత్స‌వం. పాలు లేకుండా మ‌న‌కి ఒక్క‌రోజు కూడా న‌డ‌వ‌దు. నేనైతే కాపీకి వ్య‌తిరేకం కానీ, కాఫీకి బానిస‌. ఇపుడైతే పాల ప్యాకెట్ల కాలం. చిన్న‌ప్పుడు ఇల్లిల్లు తిరిగి పోసేవాళ్లు. పెద్ద‌పెద్ద క్యాన్ల‌ను సైకిల్‌కి క‌ట్టుకుని ప‌ల్లెటూళ్ల నుంచి వ‌చ్చి ట‌వున్ల‌లో అమ్మేవాళ్లు. వాళ్ల‌తో ఎపుడూ గొడ‌వే. నీళ్లు ఎక్కువ‌య్యాయ‌ని. పాల‌లో నీళ్లు క‌ల‌ప‌క ఇంకేం క‌లుపుతారు? గుండ‌మ్మ క‌థ‌లో ర‌మ‌ణారెడ్డి అయితే ఏకంగా నీళ్ల‌లోనే పాలు క‌లుపుతారు.

రాయ‌దుర్గంలో విప‌రీత‌మైన నీటి క‌రువు. అయితే పాల వ్యాపారుల‌కి మాత్రం నీళ్లు ఎలాగో దొరికేవి. అప్ప‌టికింకా పాల మీట‌ర్లు లేవు. చూపుడు వేలిని పాల‌లో ముంచేవాళ్లు. జిగ‌ట‌గా త‌గిలితే గ‌ట్టిపాలు, జారిపోతే నీళ్ల‌పాలు.

మా స్కూల్లో 3వ త‌ర‌గ‌తిలో ప‌ద్మ అనే అమ్మాయి వుండేది. తెలివైంది. వాళ్ల అమ్మ పాలు పోసేది. ఒక‌రోజు ఆమెకి బ‌దులు ప‌ద్మ వ‌చ్చింది. స్కూల్ మానేసింది. “మా య‌మ్మ దొంగ‌ముండ‌. ఇస్కూల్ ఇడిపించింది” అని ఏడుపు మొహంతో చెప్పింది. ఎనుముల్ని మేపుతూ సంసారాన్ని ఈదుతున్న ఆడ‌వాళ్ల‌ని ఎవ‌ర్ని చూసినా ఇప్ప‌టికీ ప‌ద్మ గుర్తుకొస్తుంది.

ప‌ద్మ త‌ర్వాత మా పెద్ద‌మ్మ‌. బ్ర‌హ్మ అనే దొంగ నాకొడుకు ఆమె నుదుటిన క‌ష్టం అనే ప‌దం మాత్ర‌మే రాశాడు. సోమ‌రి భ‌ర్త‌తో, న‌లుగురి పిల్ల‌ల్ని పాల మీదే బ‌తికించింది. పేప‌ర్ చ‌దువుతూ ఉద‌యాన్నే కాఫీ తాగేవాళ్ల‌కి తెలియ‌దు, ఆ పాల వెనుక ఎంద‌రో ఆడ‌వాళ్ల గొడ్డు క‌ష్టం వుంద‌ని.

మా పెద్ద‌మ్మ 3 గంట‌ల‌కి లేచేది. పాలు పిత‌క‌డం, గాడిపాట (ప‌శువుల కొట్టం) శుభ్రం చేసి పేడ క‌సువు, గంజు ఎత్తేయ‌డం, పాల‌ని పంప‌డం, పిల్ల‌ల‌కి తిండి, ప‌శువుల్ని మేపుకు రావ‌డం, మ‌ధ్యాహ్నం వంట‌, సాయంత్రం ఎనుముల పైక‌డ‌గ‌డం (స్నానం) .మ‌ళ్లీ పాలు పిత‌క‌డం. సెల‌వ‌లుండ‌వు. అప్పుడ‌ప్పుడు ఎనుములు జ‌బ్బు ప‌డ‌తాయి. ప్ర‌తి వూళ్లోనూ నాటు వైద్యుడుండేవాడు. కొన్ని అతిచేసి బందెల దొడ్డిలో ప‌డ‌తాయి. (పొలాల్లో మేస్తే ఇక్క‌డ వ‌దులుతారు. య‌జ‌మానులు జుర్మాన క‌ట్టి విడిపించుకోవాలి)

ఒక‌రోజు ఎనుము త‌ప్పి పోయింది. పిచ్చెక్కిన‌దానిలా పెద్ద‌మ్మ వెతికింది. వూరూరు తిరిగింది. సంత‌ల్లో గాలించింది. తిండి తిప్ప‌లు లేవు. ప‌గ‌లంతా తిర‌గ‌డం, రాత్రి ఏడ‌వ‌డం. వారం త‌ర్వాత ఆచూకీ దొరికింది. సంబ‌రంగా ఎనుముతో ఇంటికొస్తున్న ఆమెని ప‌ట్ట‌పుటేనుగుపై రాణిని చూసిన‌ట్టు చూశారు వూరోళ్లు.

మా నాయ‌న‌మ్మ భ‌లే పిసినారి. మా మొగాన మ‌జ్జిగ నీళ్లు చ‌ల్లి పెరుగు, వెన్న‌ని దాచి నెయ్యి చేసేది. ప్ర‌తి వారం వూళ్లోకి ఒక వ్యాపారి వ‌చ్చి కొనేవాడు. అత‌ను మ‌ద్రాస్‌లో సినిమా వాళ్ల‌కి అమ్మేవాడ‌ట‌. తాడిప‌త్రి నెయ్యి అంటే వాళ్ల‌కి భ‌లే ఇష్ట‌మ‌ట‌. ఈ నెయ్యి తాగ‌డం వ‌ల్లే కెవి.రెడ్డి మాయ‌బజారు తీసుంటాడు. సినిమా బ‌తికున్నంత కాలం మాయ‌బ‌జారు వుంటుంది. తాడిప‌త్రి గౌర‌వం కెవి.రెడ్డి రూపంలో బ‌తికే వుంటుంది. నాకు ద‌క్కాల్సిన నెయ్యిని సినిమా వాళ్లు తినేసినందు వ‌ల్ల ఇన్నేళ్ల త‌ర్వాత నేను వాళ్ల ద‌గ్గ‌ర నుంచి ఎంతోకొంత నాలుగు పిచ్చి డైలాగులు రాసి వ‌సూలు చేసుకోగ‌లిగాను.

ఒక‌ప్పుడు వూరంతా బ‌రుగొడ్ల అరుపులు వినిపించే మా వూళ్లో పాలు దొర‌క‌వు. అన్నీ డెయిరీకి వెళ్లిపోతాయి. కావాలంటే ముందురోజు చెప్పాలి. 1976లో అనంత‌పురంలో తొలిసారి డెయిరీ పాలు రుచి చూసాను. వెట‌ర్న‌రీ ఆస్ప‌త్రిలో సీసాల్లో అమ్మేవాళ్లు. సీసాకి డిపాజిట్ క‌ట్టి తెల్లారి వెళితేనే పాలు, లేదంటే లేదు. ఇపుడు 24 గంట‌లూ దొరుకుతాయి. కానీ వుండాల్సింది ఏదో లేదు. అప్ప‌ట్లో నీళ్లే క‌లిపేవాళ్లు. ఇపుడు ఏం క‌లుపుతారో క‌లిపేవాళ్ల‌కి కూడా తెలీదు.

మ‌న తిండినే కాదు, ప‌శువుల తిండిని కూడా క‌ల్తీ చేశాం. పాలు ఎక్కువ రావాల‌ని ఇంజెక్ష‌న్లు ఇస్తున్నారు. పాల‌తో పాటు జ‌బ్బులూ వ‌స్తున్నాయి.

నాణ్య‌మైన పాల కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసి, చివ‌రికి నేరుగా వెళ్లి పాలు పితికించుకునే ఏర్పాటుని కొన్నాళ్లు చేసుకున్నాం. కానీ ఏం మ్యాజిక్ జ‌రిగేదో తెలియ‌దు కానీ అవి కూడా చాలాసార్లు నీళ్ల‌ని క‌లుపుకుని ఇల్లు చేరేవి. పాల‌లో నీళ్లు క‌ల‌ప‌డం మ‌నిషి నాణ్య‌మైన కోరిక‌.

పాల‌స‌ముద్రంలో పుట్టిన విష్ణుమూర్తే ప‌రాయివాళ్ల ఇళ్ల‌లో పాలు, వెన్న దొంగ‌లిస్తే మామూలు మ‌నుషులు మ‌న‌మెంత‌?

కొంద‌రి చెమ‌ట‌. క‌న్నీళ్లు క‌లిసి పాల‌గా మారి ప్యాకెట్ల‌లో వ‌స్తాయ‌ని, రైతుల‌ కండ‌లు క‌రిగి అన్నం మెతుకులుగా మారుతాయ‌ని ఇప్ప‌టి పిల్ల‌ల‌కి తెలియ‌దు. అంద‌రూ క‌లిసి రైతుని ఒక మూల‌కి నెట్టేస్తున్నారు. అందుకే పాలు కూడు తినాల్సిన వాడు పురుగుల మందు తింటున్నాడు.