iDreamPost
android-app
ios-app

T20 WC,aus vs nzl – ఎవరు గెలిచినా.. వారికి ఇదే తొలి కప్

  • Published Nov 12, 2021 | 5:24 AM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
T20 WC,aus vs nzl – ఎవరు గెలిచినా.. వారికి ఇదే తొలి కప్

టీ 20 ప్రపంచ్‌ కప్‌ చివరి అంకానికి చేరింది. దాయాదులు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ మధ్య తుదిపోరు జరగనుంది. ఈనెల 14వ తేదీన జరిగే ఫైనల్‌లో విజేతగా నిలిచే జట్టు టీ 20 ప్రపంచ కప్‌ను తొలిసారి అందుకోనుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన ఆస్ట్రేలియా ఇంత వరకు టీ 20 ప్రపంచ కప్‌ అందుకోలేదు. అలాగే గడిచిన రెండుసార్లు వండే వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో ఓటమి చెందిన న్యూజిల్యాండ్‌ గెలిచినా టీ20 ప్రపంచ్‌ కప్‌ అందుకోవడం ఇదే తొలిసారవుతుంది.

టీ20 ప్రపంచ్‌ కప్‌ సెమీస్‌లో పాకిస్తాన్‌ మీద విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు చేరింది. దీనితో తుది సమరం ఎవరి మధ్య అనేది తేలిపోయింది. ఇప్పటికే న్యూజిల్యాండ్‌ జట్టు ఇంగ్లాండ్‌పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో ఇటు ఆస్ట్రేలియా, అటు న్యూజిల్యాండ్‌ జట్లలో ఎవరు గెలిచినా టీ20 కప్‌ తొలిసారి గెలుచుకున్నట్టవుతుంది. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌ కప్‌లో ఇప్పుడప్పుడే మరే జట్టు బ్రేక్‌ చేయలేని రికార్డు ఉంది. 1987, 1999, 2003, 2007, 2015లో విజేతగా నిలిచింది. మొత్తం ఐదుసార్లు వన్డే ప్రపంచ్‌ కప్‌ గెలిచిన ఆస్ట్రేలియా 1999 నుంచి 2007 వరకు వరుసుగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించింది. అటువంటి జట్టుకు ఇప్పటి వరకు ఏడుసార్లు జరిగిన టీ20 కప్‌ అందని ద్రాక్షగా మారింది. 2016లో ఫైనల్స్‌కు చేరినప్పటికీ ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి పాలైంది.

న్యూజిలాండ్‌ జట్టు టీ20 ఫైనల్స్‌కు చేరడం ఇదే తొలిసారి. ఈ జట్టు వన్డే ప్రపంచ కప్‌ ఒక్కసారి కూడా సాధించలేకపోయింది. 2015, 2019 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరిన న్యూజిల్యాండ్‌ రెండుసార్లు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2015లో ఆస్ట్రేలియా మీద, 2019లో ఇంగ్లాండ్‌ మీద అత్యంత దురదృష్టకరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇటీవల భారత్‌ పై గెలుపుతో కేవలం ఐసీసీ టెస్ట్‌ ప్రపంచకప్‌లో మాత్రమే విజేతగా నిలిచింది. దీనితో టీ20 కప్‌పై న్యూజిల్యాండ్‌ ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో అటు ఆస్ట్రేలియా సైతం తమను ఎన్నాళ్లగానో ఊరిస్తున్న టీ20 ప్రపంచ కప్‌ గెలవాలని కసిగా ఉండడంతో ఆదివారం జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ హోరాహోరాగా జరగనుంది.

Also Read : టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్