iDreamPost
android-app
ios-app

టీ20 అత్యధిక పరుగుల భారత కెప్టెన్సీ రికార్డుపై కోహ్లీ కన్ను

టీ20 అత్యధిక పరుగుల భారత కెప్టెన్సీ రికార్డుపై కోహ్లీ కన్ను

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన అరుదైన టీ20 రికార్డ్‌కి విరాట్ కోహ్లీ 24 పరుగుల దూరంలో ఉన్నాడు.బుధవారం హామిల్టన్ లో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టీ20లో విరాట్ కోహ్లీ 25 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో ధోనీ కెప్టెన్సీ పరుగుల రికార్డ్ బద్దలు కొట్టి భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ నిలవనున్నాడు.కెప్టెన్‌గా ధోనీ 62 ఇన్నింగ్స్‌ ఆడి 1,112 పరుగులు చేశాడు. 2017లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ కేవలం 34 ఇన్నింగ్స్‌ల్లోనే 1,088 పరుగులు సాధించాడు.

అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ 40 ఇన్నింగ్స్‌ల్లో 1,273 పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.అతని తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 41 ఇన్నింగ్స్‌ల్లో 1,148 పరుగులతో ఉండగా, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 1,112 పరుగులు చేసి మూడో స్థానం ఆక్రమించాడు. అయితే నాలుగో స్థానంలో 1,088 పరుగులతో ఉన్న కోహ్లీ 186  పరుగులు సాధిస్తే ప్రథమ స్థానంలో ఉన్న డుప్లెసిస్ రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తాడు.అయితే ఈ రికార్డుకు చేరువలో ఉన్న విలియమ్సన్ ను కోహ్లీ అధిగమిస్తేనే కెప్టెన్సీ పరుగుల అగ్రతాంబూలం దక్కుతుంది.

కొనసాగుతున్న కోహ్లీ అధిక పరుగుల రికార్డు:

శ్రీలంకతో జరిగిన గత టీ20 సిరీస్ లో రోహిత్ విశ్రాంతితో అతని రికార్డును అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. 80 మ్యాచ్‌ల్లో కోహ్లీ 52.73 సగటుతో 2,745 పరుగులు చేశాడు.అతని తర్వాత స్థానంలో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ 106 మ్యాచ్‌ల్లో 32.11 సగటుతో 2,648 పరుగులతో కొనసాగుతున్నాడు.న్యూజిలాండ్ తో జరిగిన మొదటి రెండు టి20 లలో హిట్ మాన్ రోహిత్ సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో బ్యాటింగ్ లో కోహ్లీ నెం.1 స్థానానికి ప్రస్తుత సిరీస్ వరకు డోకా లేదు.