iDreamPost
android-app
ios-app

ఆఖరి టి-20లో భారత్ విజయం…కివీస్ ను వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించిన టీమిండియా

ఆఖరి టి-20లో భారత్ విజయం…కివీస్ ను వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించిన టీమిండియా

తొలిసారి న్యూజిలాండ్ గడ్డపై ఐదు టీ-20 మ్యాచుల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. చివరి టి20లో భారత్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై విజయానికి ఏడు పరుగుల దూరంలో కివీస్ నిలిచింది.ఈ టీ-20 సీరీస్ లోని ఐదు మ్యాచ్లను గెలిచిన భారత్ 5-0 తేడాతో న్యూజిలాండ్ ను వైట్ వాష్ చేసింది.

164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఓపెనర్లు మున్రో(2), గుప్తిల్(15) మూడు ఓవర్లలోపే వెనుతిరిగారు. మొదటి స్థానంలో బ్యాటింగ్కు దిగిన బ్రూస్ సున్నా పరుగులకే అవుట్ కావడంతో కీలకమైన మూడు వికెట్లను 17 పరుగులకే న్యూజిలాండ్ కోల్పోయింది.టిమ్ సీఫెర్ట్ (50), రాస్ టేలర్ (53) అర్ధ సెంచరీలతో నాలుగో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో శివమ్‌ దూబె వేసిన పదో ఓవర్లో టిమ్‌ సీఫెర్ట్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడి ఏకంగా 34 పరుగులు రాబట్టాడు.

కీలక వికెట్లు పడగొట్టిన సైని:
ఈ పరిస్థితులలో తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వికెట్ కీపర్ రాహుల్ తెలివిగా నిర్ణయం తీసుకొని నవదీప్ సైని తో బౌలింగ్ చేయించాడు.క్రీజులో పాతుకుపోయిన సీఫెర్ట్‌, టేలర్‌ను యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైని ఔట్‌ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు మరలిచాడు.డెత్ ఓవర్లలో బూమ్రా,సైని అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టడం తో పాటు కివీస్ బ్యాట్స్మెన్ లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు.చివరి ఓవర్లో విజయానికి న్యూజిలాండ్ 21 పరుగులు సాధించవలసి ఉండగా శార్దూల్‌ 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు.దీంతో ఏడు పరుగుల తేడాతో కివీస్ పై భారత్ విజయం సాధించి ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ ను 5-0 తో క్లీన్ స్వీప్ చేసింది.కివీస్ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం విశేషం.టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా,నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసుకున్నాడు.


న్యూజిలాండ్ లక్ష్యం 164 పరుగులే:

అంతకుముందు టాస్‌ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా కేఎల్‌ రాహుల్‌, శాంసన్‌లు ఓపెనర్లుగా వచ్చారు. తనకు లభించిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నా శాంసన్‌ ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని ఔట్ అయ్యాడు. గత మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్నా రోహిత్ శర్మ కోహ్లి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి అతను బ్యాటింగ్ చేసే మొదటి స్థానంలో దిగాడు. 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత ఇన్నింగ్స్‌ను రాహుల్‌కు జత కలిసిన రోహిత్‌ శర్మ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.సరిగ్గా పది ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కేఎల్‌ రాహుల్‌(45),రోహిత్‌ శర్మ(60)జంట ధాటిగా ఆడి రెండో వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.బెన్నెట్ బౌలింగ్ లో భారీ షాట్కు ప్రయత్నించిన రాహుల్ శాంట్నర్ పట్టిన క్యాచ్ తో జట్టు స్కోరు 96 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌ శర్మ 35 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్స్‌లతో అర్థ సెంచరీ సాధించి తన ఫామ్ చాటుకున్నాడు. అయితే తొడ కండరాలు పట్టుకోవడంతో రోహిత్‌ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్‌హర్ట్‌ గా పెవిలియన్‌ చేరాడు.తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దూబే(5) నిరాశపరిచాడు.చివర్లో బ్యాట్‌ ఝుళిపించడంతో మనీష్‌ పాండే 4 బంతుల్లో ఒక ఫోర్‌,ఒక సిక్సర్ తో నాటౌట్‌గా పరుగులు చేశాడు.మరోసారి బాధ్యతాయుతంగా ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌ ఒక ఫోర్‌,2 సిక్స్ లతో నాటౌట్‌గా నిలిచి 33 పరుగులు చేశాడు.అయితే వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. స్లాగ్ ఓవర్లలో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు

కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసింది.న్యూజిలాండ్‌ బౌలర్లలో కుగ్లీన్,బెన్నెట్‌ పొదుపుగా బౌలింగ్ చేసి వరసగా రెండు వికెట్లు,ఒక వికెట్‌ పడగొట్టారు.

కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చిమూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ “అవార్డు లభించింది.బ్యాటింగ్ తో పాటు కీపింగ్ లో రాణించిన రాహుల్‌కు “మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌”వరించింది.