iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్ కప్ కు భారత టీమ్ రెడీ

టీ20 వరల్డ్ కప్ కు భారత టీమ్ రెడీ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్… అక్టోబర్ 17 నుండి ఒమన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఈ టీం మొత్తం కూడా ఆశ్చర్యం గానే ఉంది. భారత మాజీ కెప్టెన్ ధోనీని మెంటార్ గా తీసుకోవడంతో పాటు శిఖర్ ధావన్ ను టీం నుంచి తప్పించడం అన్నీ కూడా ఆశ్చర్యపరిచాయి. 2007 లో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభ ఎడిషన్‌లో భారత్ కు కప్ ఇచ్చిన ధోనీని అంతర్జాతీయ స్థాయిలో మెంటార్ గా తీసుకోవడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే అంశంగా చెప్పాలి.

భారత మాజీ పేసర్ చేతన్ శర్మ నేతృత్వంలోని బిసిసిఐ సెలెక్షన్ కమిటీ సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ని జట్టులోకి తీసుకోవడం షాక్ కి గురి చేసింది. అశ్విన్ చివరిసారిగా జూలై 2017 లో టీ 20 ఫార్మాట్‌లో ఆడాడు. అశ్విన్ 46 మ్యాచ్‌ల్లో 7 కంటే తక్కువ ఎకానమీతో 52 వికెట్లు సాధించాడు. ఒక్కసారి భారత జట్టుని చూస్తే…

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్ , వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ లతో కూడిన 15 మంది సభ్యులను టి 20 ప్రపంచ కప్ కు ఎంపిక చేసింది. దాదాపుగా వీరు అందరూ పొట్టి ఫార్మాట్ లో తమ ఆట తీరుని నిరూపించుకున్న వాళ్ళే. ఐపిఎల్ ద్వారా ఒక వెలుగు వెలిగిన వారే.

ఒక్కసారి మనం జట్టు కూర్పు చూస్తే…

ఓపెనర్లు గా దాదాపుగా రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వస్తారు. ఒకవేళ… కెఎల్ రాహుల్ కు రెస్ట్ ఇవ్వాలి అనుకుంటే ఓపెనర్ గా ఇషాన్ కిషన్ ను తీసుకోవచ్చు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ అంతర్జాతీయ స్థాయిలో కలిసి ఆడుతుండగా… ఇషాన్ కిషన్… ముంబై ఇండియాన్స్ లో రోహిత్ శర్మ సారధ్యంలో ఆడుతున్నాడు. ఓపెనర్లుగా వీరు ముగ్గురిలో ఏ ఇద్దరు వచ్చినా సరే మంచి సమన్వయంతో ఆడే అవకాశాలు ఉన్నాయి. కెఎల్ రాహుల్… రోహిత్ శర్మ మాదిరిగా దూకుడుగా ఆడలేకపోయినా… నిదానంగా ఆడుతూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు.

ఓపెనింగ్ పెయిర్ లెఫ్ట్ అండ్ రైట్ ఉండాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయవచ్చు. అప్పుడు కెఎల్ రాహుల్ ని మూడు లేదా నాలుగు స్థానాల్లో ఆడించే అవకాశం ఉంది. దాదాపుగా ఆరో స్థానం వరకు రాహుల్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చాటుకున్నాడు. కాబట్టి రాహుల్ తుది జట్టులో ఖరారు అయినట్టే. ఇక మూడో స్థానంలో కెప్టెన్ కోహ్లీ వస్తాడు… నాలుగో స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారు అనేదే ఇక్కడ ప్రశ్నార్ధకంగా మారింది. ఇషాన్ కిషన్, రిశాబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్ ల విషయంలో స్పష్టత లేదు.

పంత్, కిషన్… కీపర్లు కాబట్టి వారిలో ఒకరిని ఎంపిక చేయడంలో సందేహం లేదు. దాదాపుగా టి20లో పంత్ ని పక్కన పెట్టె అవకాశాలు లేకపోవచ్చు. పంత్ ని పక్కన పెట్టి… ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పంపిస్తే… సూర్య కుమార్ యాదవ్ నాలుగు లేదా అయిదు స్థానాల్లో ఆడే అవకాశం ఉండవచ్చు. కెఎల్ రాహుల్ తుది జట్టులో ఉండాలి… ఓపెనర్ గా రోహిత్ తో పాటు ఇషాన్ కిషన్ కూడా కావాలి అనుకుంటే… కోహ్లీ నాలుగో స్థానంలోకి వచ్చి… కెఎల్ రాహుల్ ని మూడో స్థానంలో అయినా పంపే అవకాశాలు ఉండవచ్చు.

ఒకవేళ రొటేషన్ పద్ధతి ఫాలో అయితే మాత్రం ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ల విషయంలో బ్యాటింగ్ ఆర్డర్ లో ఫాలో కావొచ్చు. ఇక ఆరు, ఏడు స్థానాల గురించి చూస్తే… రవీంద్ర జడేజా ఆరో స్థానంలో దాదాపుగా ఉంటాడు. అశ్విన్ తుది జట్టులో ఉంటె మాత్రం ఏడో స్థానంలో వస్తాడు. హిట్టింగ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అశ్విన్ ని తుది జట్టులో ఉంచితే బౌలర్ తో పాటు ఒక బ్యాట్స్మెన్ కూడా ఉన్నట్టు ఉంటుంది. పిచ్ ని బట్టి జడేజా, హార్దిక్ పాండ్యా ల మధ్య పోటీ ఉంటుంది. ఇక అశ్విన్, అక్షర్ పటేల్ విషయంలోనే సందిగ్దత ఉంది.

అశ్విన్ తో పోలిస్తే అక్షర్ పటేల్ స్పిన్ లో పెద్దగా నైపుణ్యం ఉన్న ఆటగాడు కాదు. కాబట్టి స్పిన్నర్ గా తుది జట్టులో సీనియర్ ఆటగాడిగా జడేజా తో పాటు అశ్విన్ ఉంటాడు. పోటీ ఉంటే మాత్రం హార్దిక్ పాండ్యా లేదా అక్షర్ పటేల్ మధ్య ఉంటుంది. హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఉంటే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. లేదు అక్షర్ పటేల్ ని తీసుకుంటే… అశ్విన్ ఆరో స్థానంలో రావొచ్చు. ఇద్దరు స్పిన్నర్లు కావాలి అనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తి లేదా అక్షర్ పటేల్, రాహుల్ చాహర్ లో ఒకరిని తీసుకుని సీనియర్ ఆటగాడు అశ్విన్ ని టీం లో ఉంచవచ్చు. కీలక మ్యాచ్ ల కోసం అశ్విన్ కి రెస్ట్ ఇస్తే మాత్రం ఆ ముగ్గురిలో ఒకరు తుది జట్టులో ఉంటారు. హార్దిక్ పాండ్యా ఈ మధ్య కాలంలో బౌలింగ్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

  కాని దుబాయ్ లో ప్రాక్టీస్ చేస్తున్న పాండ్యా బౌలింగ్ మీద ఫోకస్ పెట్టాడనే టాక్ ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి… ధోనీ మెంటార్ గా ఉన్నాడు కాబట్టి పాండ్యా, అశ్విన్ వైపే మొగ్గు చూపించవచ్చు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ లో అశ్విన్ కి రెస్ట్ ఇచ్చింది టి20 వరల్డ్ కప్ కోసమే అయి ఉండవచ్చు. కాబట్టి తుది జట్టులో అశ్విన్ పక్కాగా చెప్పవచ్చు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే… భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ టీం కి నాయకత్వం వహించే సూచనలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత భువీ టీం లో కనపడుతున్నాడు.

కొత్త బంతి తో బాగా స్వింగ్ చేస్తాడు కాబట్టి అతన్నే తుది జట్టులో ఉంచుతారు. శమీ, బూమ్రా, స్థానాలు దాదాపుగా ఖరారు అయినట్టే. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఉంటె మాత్రం… బూమ్రా, భువీ, శమీ స్థానాలకు రొటేషన్ విధానం పాటించవచ్చు. కీలక జట్ల కోసం వీరిని వాడుకునే అవకాశం ఉండవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే టీం కూర్పు అనేది ఇప్పుడు సవాల్ గానే ఉంది అనే మాట వాస్తవం. వరుణ్ చక్రవర్తి, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్ మెగా టోర్నీలో ఆడటం ఇదే తొలిసారి కాబట్టి ఎంత వరకు ఒత్తిడి తట్టుకుంటారు అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఆల్ రౌండర్ స్థానాల విషయంలోనే తిక మక ఏర్పడింది.