iDreamPost
iDreamPost
‘ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి’ అని వెనుకటికి ఓ సామెత. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది. మూడున్నరేళ్ల కిందట కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. కానీ దశాబ్దాలుగా పార్టీలో ఉన్న వాళ్లకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. కథ ఇక్కడితో అయిపోలేదు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడిన తర్వాతి నుంచి సీనియర్లు సైలెంట్ అయిపోయారు. పీసీసీ చీఫ్ ప్రకటనకు ముందు దాకా ఎన్నో గొంతులు వినిపించేవి. ఇప్పుడు కనిపిస్తున్నది, వినిపిస్తున్నది రేవంత్ మాత్రమే. దీంతో రేవంత్ రంగ ప్రవేశం తర్వాత సీనియర్లు తప్పుకున్నారా? లేక తప్పించారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మార్పు కనిపిస్తోంది..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఇంకా బాధ్యతలు కూడా తీసుకోకముందే పార్టీలో మార్పు కనిపిస్తోంది. సీనియర్లు, జూనియర్లను రేవంత్ రోజూ కలుస్తుండటం ఓ వైపు.. గాంధీ భవన్ వాస్తు మార్పు పనులు మరోవైపు.. ఈ నెల 7న పీసీసీ చీఫ్ గా బాధ్యతల స్వీకరణ ఏర్పాట్లు ఇంకోవైపు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో రాజకీయ సందడి కనిపిస్తోంది. అయితే రేవంత్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తూ చేస్తున్న ప్రచారంలో ఎక్కడా సీనియర్ల పేర్లు ప్రస్తావనకు రావడం లేదు. గతంలో రేవంత్ తోపాటు పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడిన లీడర్ల ఊసే లేదు. జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ తదితరుల పేర్లు కరపత్రాల్లో కనిపించడం లేదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్టర్లలోనూ, యాడ్స్ లోనూ వీళ్ల పేర్లు, ఫొటోలు పెట్టడం లేదు. కానీ వీళ్లలో చాలా మంది ఇళ్లను రేవంత్ ఇప్పటికే ఓ రౌండ్ చుట్టేశారు.
Also Read : కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ పీసీసీ కోసం 25 కోట్లు తీసుకున్నాడంట ..!
అందరూ గప్ చుప్..
రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించారని తెలిశాక.. గట్టిగా వాయిస్ వినిపించింది కోమటిరెడ్డి బ్రదర్స్. తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. కానీ తర్వాత వెంకట్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తానేం మాట్లాడబోనని చెప్పేశారు. ఈయనకు వ్యతిరేకంగా, రేవంత్ కు మద్దతుగా సీతక్క, బలరాం నాయక్ తదితర నేతలు మాట్లాడారు. మరోవైపు గతంలో రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడిన జగ్గారెడ్డి, పొడెం వీరయ్యకు.. కొత్త పీసీసీ కార్యవర్గంలో చోటుదక్కింది. దీంతో వాళ్లు సైలెంట్ అయ్యారు. వీళ్లుకాక జానారెడ్డి, షబ్బీర్ అలీ.. చాలా కాలంగా యాక్టివ్ గా లేరు. ‘సోనియా చెప్పినందుకే నాగార్జున సాగర్ లో పోటీ చేశా’నని గతంలో జానారెడ్డి ప్రకటించుకున్నారు. జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నాల తదితర నేతల వాయిస్ కూడా ఎక్కడా వినిపించడం లేదు. మొన్నటిదాకా పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. దీంతో రేవంత్ మినహా తెలంగాణ కాంగ్రెస్ మొత్తం గప్ చుప్ అయింది.
ఢిల్లీ నుంచి ఆర్డర్లు?
గతంలో రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తేనే.. రచ్చ రచ్చ జరిగింది. కొత్తగా వచ్చిన వ్యక్తికి అప్పుడే అంత పెద్ద పదవి ఎలా ఇస్తారని చాలా మంది నిలదీశారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకరిద్దరు తప్ప.. పెద్దగా గొంతెత్తిన వాళ్లు లేరు. రేవంత్ నియామకం విషయంలో వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని ఢిల్లీ నుంచి ఆర్డర్లు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మల్లు భట్టి విక్రమార్కను ఢిల్లీకి పిలిపించింది కూడా ఇందుకేనని చెబుతున్నారు. కోమటిరెడ్డి ఎపిసోడ్ లో కూడా.. హైకమాండ్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. అసంతృప్త, అసమ్మతి నేతలను హైకమాండ్ సాయంతోనే రేవంత్ దారిలోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శల విషయంలో రేవంత్ స్పందించడం లేదు. ఇంకా పీసీసీ చీఫ్ కాకముందే పార్టీ లీడర్లను సైలెంట్ చేసిన రేవంత్.. రానున్న రోజుల్లో ఏం చేస్తారో మరి!!
Also Read : తొలి పరీక్షలో నెగ్గితే రేవంత్ రెడ్డికి తిరుగులేనట్లే..!