Idream media
Idream media
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని ప్రకాష్‌రాజ్ ఈ కరోనా టైంలో ఏం చేస్తుంటాడు?
సీన్ నెంబర్ 1-
ప్రకాష్‌రాజ్ శుభ్రంగా రెడీ అయి బయల్దేరాడు.
జయసుధ – ఎక్కడికి?
ప్రకాష్‌రాజ్ – అలా ఊళ్లోకి వెళ్లి వస్తా. మనుషుల్ని పలకరించాలి.
జయసుధ – ఊళ్లో లాక్‌డౌన్. బయట పోలీసులున్నారు.
ప్రకాష్‌రాజ్ – వాళ్లూ మనుషులే కదా.
జయసుధ – మనుషులే…కానీ మనుషులు కనిపిస్తే తంతున్నారు.
ప్రకాష్‌రాజ్ – మనుషులంతా మంచోళ్లే.
జయసుధ -మనుషులు మంచోళ్లే…కరోనా చెడ్డది.
ప్రకాష్‌రాజ్ వినిపించుకోకుండా వెళ్లిపోయాడు.
సీన్ నెంబర్-2
రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ప్రకాష్‌రాజ్ ఆశ్చర్యంగా నడుస్తున్నాడు. SI వచ్చి ఆపాడు.
“ఎక్కడికి?” అని అడిగాడు.
“ఊరు చూడ్డానికి” చెప్పాడు ప్రకాష్‌రాజ్.
“అందరూ ఇళ్లలో టీవీ చూస్తుంటే, నువ్వు ఊరు చూడడానికి వచ్చావా?”
“టీవీలో ఏముందయ్యా, నాకు మనుషులు కనిపిస్తేనే ఆనందం”
“మాకు మనుషులు కనిపిస్తేనే కోపం. ఇంతకీ ఊళ్లో లాక్‌డౌన్ ఉందని నీకు తెలుసా తెలియదా?”
“లాక్‌డౌన్, లాకప్ ఇవన్నీ మనిషి తర్వాతే. మనిషి అనేవాడు అన్నింటికి ముందు. అసలు మనిషే లేకపోతే ఈ ప్రభుత్వాలు, పోలీసులు ఉంటారా? మీరు బంధించాల్సింది కరోనాని, మనుషుల్ని కాదు”
“మనిషిని బంధిస్తేనే కరోనాని బంధించేది”
“ఇవన్నీ కాదయ్యా మనం చేయాల్సింది. ఆ దేవున్ని అడగాలి. నువ్వు గుడిలో బందీగా ఉన్నావు కదానీ, అందర్నీ బందీలుగా ఉండమంటే ఎలాగయ్యా”
“ఇదిగో నువ్వు మూర్ఖత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నావు. గుడి మూసేసి నెల రోజులైంది. ఆ దేవుడే ముక్కుకి మాస్క్ కట్టుకుని , హారతి ఇచ్చే వాడు లేక చీకట్లో కూచున్నాడు. ఇక్కడి నుంచి వెళ్తావా లేదా?” SI హెచ్చరించాడు.
“వెళ్తా కానీ, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి” చేయి చాచాడు ప్రకాష్‌రాజ్. SI లాఠీ వదిలేసి పారిపోయాడు.
సీన్ నెంబర్ -3
ప్రకాష్‌రాజ్ హడావుడిగా “బయల్దేరండి, అవతల దేవుడి కళ్యాణానికి టైం అయింది”
మహేశ్‌తో జయసుధ- అరే చిన్నోడా నువ్వైనా చెప్పరా మనుషల పెళ్లిళ్లకే ఎవరూ వెళ్లడం లేదు. ఇక దేవుడికి పెళ్లి చేసేవాళ్లెవరు?
మహేశ్ – నేను చెబితే వినడు. ఆ పెద్దోన్ని చెప్పమను.
వెంకటేష్ – నేనెందుకు చెప్పాల్రా …అసలు ఆ రోజు పూలకుండీ ఎందుకు తన్నావో చెప్పు.
ప్రకాష్‌రాజ్ – అరే పూలకుండీ ఎవరు తన్నినా పగిలిపోతుంది. మనం ఈ జన్మకే తండ్రీకొడుకులం. వచ్చే జన్మ ఉంటుందో లేదో
మహేశ్ – ఈ జన్మనలోనైనా మనం ఉండాలంటే బయటికి వెళ్లకూడదు. కరోనా వస్తాది.
ప్రకాష్‌రాజ్ -వెళ్లకూడదంటే ఎలారా? దేవుడి పల్లకి మోయాలి, కళ్యాణం చూడాలి. మరు జన్మంటూ ఉంటే మళ్లీ ఇలాగే పుట్టించమని కోరాలి.
జయసుధ – మళ్లీ జన్మలో కూడా మీరేనా…ఇప్పటికే మీ చాదస్తంతో చస్తున్నా.
ప్రకాష్‌రాజ్ -చావుపుటకలు ఎవరు నిర్ణయిస్తారే. మనిషి మనిషి పలకరించుకోవాలి కౌగలించుకోవాలి. చేతులు కలిపి స్పర్శించుకోవాలి. శ్వాసలో శ్వాసగా ఉండాలి.
జయసుధ- పెద్దోడా , చిన్నోడా …ఈ మనిషి కరోనా తెచ్చి ఇళ్లంతా ఆస్పత్రికి పంపేలా ఉన్నాడు. ఆ తాడుతో కట్టేయండి.
కట్టేస్తూ ఉంటే ప్రకాష్‌రాజ్ నవ్వుతూ “మనుషులంతా మంచోళ్లు రా” అన్నాడు. మూతికి ప్లాస్టర్ వేశారు.