iDreamPost
android-app
ios-app

లౌక్యం సినిమాలో నటించాను కానీ నాకు లౌక్యం తెలీదు – పృథ్విరాజ్

లౌక్యం సినిమాలో నటించాను కానీ నాకు లౌక్యం తెలీదు – పృథ్విరాజ్

తన చుట్టుపక్కల ఉంటూనే తనకు వెన్నుపోటు పొడిచారని, ఐదు నెలల పదవీ కాలంలోనే తనకి 50 ఏళ్ల జీవితం చూపించారని SVBC మాజీ చైర్మన్ సినీనటుడు పృథ్విరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు..

సోమవారంనాడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన పృథ్విరాజ్ పై వ్యాఖ్యలు చేసారు.. పార్టీలో 11 ఏళ్ళు కష్టపడి పనిచేసినందునే తనకు SVBC చైర్మన్ పదవి వచ్చిందని కానీ ఆరోజే పదవి వద్దని ఉంటే ఇప్పుడున్న పరిస్థితి వచ్చేది కాదని పృథ్విరాజ్ వాపోయారు. ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకునైనా ఉద్యోగాలు పర్మినెంట్ చేయిస్తానని ఉద్యోగులకు చెప్పడం వల్లనే తన ఐదు నెలల పదవీకాలంలో 50 ఏళ్ల జీవితం చూపించారని తెలిపారు.

ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారని విన్నాం కానీ అదేవిధంగా నా పక్కనే ఉండి నన్ను కూడా వెన్నుపోటు పొడిచారని, నేను చనిపోయినా కూడా రాని పబ్లిసిటీని నాకు మీడియాలో వచ్చేలా చేసారని పేర్కొన్నారు. తాను చనిపోయినా కూడా తనపై వైసీపీ జెండానే ఉంటుందని పృథ్విరాజ్ స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా మద్యం, మాంసం ముట్టలేదని దానికి సంబంధించిన రక్త నమూనాలు నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తానని తెలిపారు. తనపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తానని పృథ్విరాజ్ వ్యాఖ్యానించారు.

అమరావతి రైతుల విషయంలో నా వ్యాఖ్యలు వక్రీకరించారని,లౌక్యం సినిమాలో నటించిన నేను లౌక్యం లేని వ్యక్తినని ఒకవేళ లౌక్యం ఉంటే SVBC చైర్మన్ గా కొనసాగేవాడినని పేర్కొన్నారు. ఎవరి ఒత్తిడి లేకుండానే పదవికి రాజీనామా చేసానని,స్వామి వారి ఆశీస్సులు ఉంటే తిరిగి SVBC చైర్మన్ పదవి వస్తుందని పృథ్విరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.