Idream media
Idream media
లాక్ డౌన్ వేస్ట్.., దాంతో ఉపయోగం లేదు. కరోనా సోకడంతో 14 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉన్న కేసీఆర్ ఇటీవల ప్రగతి భవన్ కు వచ్చిన అనంతరం జరిపిన తొలి సమీక్షలో చెప్పిన మాట. అయితే, రాష్ట్రంలో కరోనా భయంకరంగా విస్తరిస్తోంది. పరీక్షలు తగ్గించడంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా, ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఆ లెక్కల ప్రకారం.. కరోనా ప్రభావం అధికంగా ఉందని గుర్తించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నేడు కేబినెట్ భేటీ ఉండడంతో లాక్ డౌన్ పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
దేశంలో కరోనా కోరులు చాచి.. ప్రజల ప్రాణాలను ప్రభుత్వాల పనితనాన్ని హరిస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తమ ప్రజలను కాపాడుకునేందుకు.. లాక్డౌన్ విధిస్తున్నాయి. దేశ రాజధాని డిల్లీ నుంచి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా సంపూర్ణ లేదా పాక్షిక లాక్డౌన్ విధించి.. ప్రజల ప్రాణాలు రక్షించుకునేందుకు ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం కేవలం రాత్రి కర్య్ఫూ ఒక్కటే అమల్లో ఉంది. తెలంగాణ గురించి. ఇక్కడ కేసులు పెరుగుతున్నా.. మరణాలు పెరుగుతున్నా కూడా లాక్డౌన్ విధించే ప్రసక్తి లేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. ఇటీవల కూడా ఆయన లాక్డౌన్పై స్పష్టమైన ప్రకటన చేశారు. నోలాక్డౌన్.. అని తేల్చి చెప్పారు. లాక్డౌన్ కారణంగా.. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని.. అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు.. కేసీఆర్ మరో కీలక విషయం కూడా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుంటే.. మే 15 నాటికి కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందనే అంచనా ఉందని పేర్కొన్నారు.
ఇక మరో తెలుగు రాష్ట్రం ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ పాక్షిక లాక్డౌన్ అమలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6-12 గంటల మధ్య మాత్రమే ప్రజలకు అనుమతులు ఇస్తున్నారు. మిగిలి సమయంలో అంటే.. దాదాపు 18 గంటల పాటు.. రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాట సంపూర్ణ లాక్ డౌన్ మొదలైంది. ఈ మేరకు నిన్నట్నుంచే ఏర్పాట్లలో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం, ఈరోజు పొద్దున్నుంచి సంపూర్ణ లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈరోజు నుంచి 2 వారాల పాటు తమిళనాడు అంతగా పూర్తిస్థాయిలో ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్టాలిన్ తీసుకున్న కీలక నిర్ణయం ఇది.
లాక్ డౌన్ విషయాన్ని 2 రోజుల ముందుగానే ప్రకటించడంతో ప్రజలంతా తమ ఏర్పాట్లు తాము చేసుకున్నారు. నిత్యావసరాలు, మందుల్ని ముందుగానే కొనుగోలు చేసుకున్నారు. 2 వారాలకు సరిపడ సరకుల్ని సమకూర్చుకున్నారు. మరోవైపు రోజువారీ కూలీల కోసం ప్రభుత్వం గతేడాదిలోనే ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని, ఈ ఏడాది మరోసారి అమలు చేయబోతున్నారు. ప్రభుత్వం తరఫున కొంతమందికి నిత్యావసరాలు అందించడంతో పాటు.. మరికొంతమందికి నేరుగా భోజనాన్నే సమకూర్చబోతున్నారు. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానున్న నేపథ్యంలో ఇక్కడ కూడా లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం కొనసాగుతోంది.