iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీది ప్రత్యేకమైన చరిత్ర. రాజకీయ ప్రస్థానం ఆరంభంలోనే ఆపార్టీ కొత్త చరిత్ర సృష్టించిన ఘనత ఆపార్టీది. పార్టీ పుట్టిన తర్వాత 37 ఏళ్లలో 21 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ. అంతకుమించి పూర్తిస్థాయి యంత్రాంగంతో నిర్మాణపరంగా పటిష్టమైన పార్టీగా పేరు ఉంది. కానీ ఒకసారి పరిస్థితి మారితే బలమైన నిర్మాణంలో బలహీనతలన్నీ బయటపడతాయన్నది ఇప్పటికే రుజువయ్యింది. తెలంగాణాలో టీడీపీ పునాదులు కదిలిపోయిన తీరు దానికి కారణం. తెలంగాణా ఉద్యమం దానికితోడుగా ఓటు కి నోటు కేసు కారణంగా తెలంగాణా రాజకీయాల నుంచి టీడీపీ వైదొలగాల్సి రావడంతో శ్రేణులన్నీ చెల్లాచెదరయిపోయిన తీరు కళ్లెదురుగా ఉంది. ఒకనాటి పెట్టని కోటల్లాంటి చోట్ల చివరకు కనీసం అడ్రస్ కూడా దక్కించుకోలేక తెలుగుదేశం తల్లడిల్లిపోవాల్సి వస్తోంది.
అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం అయ్యే ప్రమాదం దాపురిస్తోంది. దాదాపుగా తెలంగాణాలో మాదిరిగా ఏపీలో కూడా పునాదులకే ముప్పు తెచ్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. దానికి ప్రధానంగా చంద్రబాబు వైఖరి కారణమని అంతా భావిస్తున్నారు. విధానపరంగా వ్యూహాత్మక వైఫల్యం టీడీపీ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారపూరితంగా వ్యవహరించి, చివరకు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పిదాలను సరిదిద్దుకోలేని స్థితికి చేరడంతో మనుగడకు ఎసరు వస్తోంది. కీలకమైన అంశాలలో జగన్ దూకుడు ముందు బాబు అనుభవం అక్కరకు వస్తున్నట్టు కనిపించడం లేదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కూడా పనికిరాకపోవడంతో టీడీపీని వీడుతున్న నేతలతో వేగంగా ఖాళీ అవుతున్నట్టు కనిపిస్తోంది. కీలకనేతలంతా గుడ్ బై చెబుతుండడంతో పార్టీ కోటలు కకావికలం అవుతున్నట్టు కనిపిస్తోంది.
స్థానిక ఎన్నికల విషయంలో టీడీపీ వ్యవహారం దానికి తార్కాణంగా చెప్పవచ్చు. ఏపీలో జెడ్పీటీసీ స్థానాలను గమనిస్తే దాదాపు పాతిక శాతం సీట్లు ఏకగ్రీవం కావడం విశేషంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని పరిస్థితికి నిదర్శనంగా ఉంది. గత సాధారణ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ లో ఏకగ్రీవాలు కాగా, ఈసారి ఏకంగా 128 మండలాల్లో ఏకగ్రీవాలు కావడం విశేషం. రాష్ట్రంలో ప్రతీ నాలుగు స్థానాల్లో ఒకటి చొప్పున ఏకగ్రీవం అయిపోవడం గమనిస్తే విపక్షం ఎంత పేలవంగా ఉందన్నది ప్రస్ఫుటం అవుతోంది. కడప , కర్నూలు జిల్లాల్లో ఏకంగా జెడ్పీ పీఠం అధికార పార్టీ ఖాతాలో పడిపోవడం చూస్తుంటే ప్రతిపక్ష పార్టీల ప్రదర్శన అర్థం అవుతోంది. కనీసం పోటీ ఇచ్చేందుకు కూడా టీడీపీ బలం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఆపార్టీకి కష్టకాలం దాపురించినట్టు అంతా భావిస్తున్నారు. భవిష్యత్ మరింత దయనీయంగా ఉంటుందనడానికి సంకేతాలుగా చెబుతున్నారు.
ఇప్పటికే టీడీపీని వీడిన నేతలు మాత్రమే కాకుండా అనేక మంది కీలక నేతలు కూడా ఈసారి పోటీ కి సిద్ధం కాకపోవడం విస్మయకరం. ఎదురొడ్డి నిలబడేందుకు కూడా టీడీపీ నేతలు సిద్ధంగా లేకపోవడంతో క్యాడర్ కూడా ఎవరి దారి వారిదే అన్నట్టుగా మారిపోతున్నారు. అనేక మంది అధికార పార్టీ చెంతకు చేరిపోతున్నారు. సామ, దాన బేధ దండోపాయాలు ప్రదర్శిస్తున్న వైఎస్సార్సీపీని నిలువరించే యత్నం కూడా టీడీపీ చేయలేకపోతోంది. చివరకు చంద్రబాబు వారసుడిగా చెప్పుకున్న నారా లోకేష్ కనీసం ప్రచారం కాదు కదా, ప్రెస్ మీట్లకు కూడా ముందుకు రావడం లేదంటే మానసికంగా టీడీపీ ఎలాంటి క్లిష్ట స్థితిలో ఉందన్నది చాటుతోంది. చంద్రబాబు పదే పదే మీడియా సమావేశాలు పెట్టడమే తప్ప, క్యాడర్ నడిపించేందుకు, వారిని సన్నద్ధం చేసేందుకు సరిపోవడం లేదన్నట్టుగా కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ గండం నుంచి గట్టెక్కడం గగనమే అన్నట్టుగా ఉంది. ఆపార్టీకి సాధారణ ఎన్నికల రూపంలో చిల్లు పడితే స్థానిక ఎన్నికల కారణంగా భారీ గండి పడుతోంది. సహజంగా జనరల్ ఎన్నికల్లో కనిపించే పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు స్థానిక సమరానికి ముందు కూడా చోటు చేసుకుంటుండడం గమనిస్తే తెలుగుదేశం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వాస్తవం తెలుస్తోంది. చంద్రబాబు నాయకత్వం మీద కూడా విశ్వాసం సన్నగిల్లుతుండడం, చినబాబు స్థాయి సరిపోదని ఇప్పటికే తేటతెల్లంకావడంతో తెలుగుదేశం తన పునాదులు కోల్పోతోంది. తెలంగాణాలో మాదిరిగా ఏపీలో కూడా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది.