iDreamPost
iDreamPost
నిన్న నారప్ప ఓటిటి ప్రకటన అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. దీని గురించి ముందు నుంచే లీకులు ఇస్తూ వచ్చినప్పటికీ నిర్మాత సురేష్ బాబు నిర్ణయం మారకపోదా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అయితే ఇది చాలా రోజుల క్రితమే చేసుకున్న డీల్ కావడంతో ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా రద్దు చేసుకునే అవకాశాలు తక్కువ. అందులోనూ అలా చేస్తే భారీగా సొమ్ము నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే 23వ తేదీ సినిమా హాళ్లు తెరుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా ప్లాన్డ్ గా మూడు రోజుల ముందే నారప్పని ప్రీమియర్ వేసి విమర్శలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒకరకంగా తెలివైన ఎత్తుగడే.
నారప్ప, దృశ్యం 2 రెండు కలిపి ప్రైమ్, హాట్ స్టార్లతో సురేష్ బాబు సుమారు 80 కోట్ల దాకా డీల్ చేసుకున్నట్టుగా వచ్చిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇంత మొత్తం థియేటర్లలో షేర్ రూపంలో వసూలు అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఏపిలో సగం సీట్లతో సెకండ్ షో లేకుండా, తెలంగాణలో కోవిడ్ భయాలతో అంత సులభంగా కలెక్షన్లు ఆశించలేం. ఇవన్నీ విశ్లేషించే సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకుని తమ్ముణ్ణి ఒప్పించినట్టు వినికిడి. వ్యాపారం చేసేటప్పుడు పెట్టుబడి లాభాలు సూత్రం తప్ప ఇంకేదీ పట్టించుకోనప్పుడు ఇలాంటి డెసిషన్లు తీసుకోవడం తప్పేమీ కాదు.
ఇప్పుడు వెంకటేష్ లాంటి మూడు దశాబ్దాల అనుభవం ఉన్న పెద్ద హీరోనే ఓటిటి బాట పట్టినప్పుడు మిగిలినవాళ్లు ఇకపై అనుసరించినా ఆశ్చర్యం లేదు. నిజానికి ఓ పదిహేను దాకా మీడియం బడ్జెట్ సినిమాలు ఓటిటి కోసం గట్టిగానే ప్రయత్నించాయి. అయితే వీక్ కంటెంట్ వల్ల సదరు సంస్థలు గీచి గీచి బేరాలు ఆడటంతో ఆ నిర్మాతలకు హాళ్ల కోసం వేచి చూడటం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ప్రీ రిలీజ్ కు ముందు పాజిటివ్ బజ్ ఉన్నవాటికి మాత్రమే థియేట్రికల్ బిజినెస్ బాగుంది. ఇంకొక్క పదిరోజులు ఆగితే కానీ థియేటర్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చేలా లేదు. అప్పటిదాకా ఈ పరిణామాలకు మనం వీక్షకులమే