iDreamPost
iDreamPost
స్థానిక ఎన్నికలు వాయిదా పడడమే తమ విజయం అన్నంతగా టీడీపీ శ్రేణులు కనిపిస్తున్నాయి. పలు చోట్ల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కి పాలాభిషేకాలు చేస్తున్న తీరు దానికి నిదర్శనం. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే తాము సోదిలో కనిపించకుండా పోతామేమోనని బెంగపెట్టుకున్న టీడీపీ నేతలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం పెద్ద ఉపశమనంగా మారింది. వాయిదా ఆరు వారాలే అయినప్పటికీ ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది స్పష్టత లేకపోవడంతో వారిని సంతృప్తి పరిచింది.
ఎన్నికల వాయిదా విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో సుప్రీంకోర్ట్ తీర్పు కొంచెం తీపి, కొంచెం చేదు అన్నట్టుగా మారింది. టీడీపీ నేతలకు ఈ పరిణామం మింగుడుపడే అవకాశం లేదు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేయడాన్ని సమర్థించిన సుప్రీంకోర్ట్ ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోలేం అని చెప్పింది. కానీ అంతలోనే ఎన్నికల కోడ్ తొలగించాలని ఆదేశించడమే ఇప్పుడు టీడీపీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది.
ఆరు వారాల తర్వాత అనుకున్న గడువు ప్రకారం ఎన్నికలు జరిగే నాటికి టీడీపీ తరుపున బరిలో ఉన్న ఎందరు నిలబడతారన్నది ఆపార్టీకి అంతుబట్టడం లేదు. అదే సమయంలో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే జగన్ ప్రభుత్వం బ్రహ్మాస్త్రం సంధించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉగాది నాటికి ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం అనుకున్నట్టుగా నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఏళ్ల తరబడి ఎదురుచూడడమే తప్ప ఫలితం దక్కని పేదలందరికీ ఇళ్ల సదుపాయం కల్పించేందుకు తగ్గట్టుగా పట్టాల పంపిణీ ప్రక్రియకు నాంది పలకడం ఖాయంగా ఉంది. అదే జరిగితే జగన్ ప్రభుత్వం కొత్త చరిత్రను సృష్టించడం ఖాయంగా చెప్పవచ్చు. అది విపక్షాల ఆశలపై నీళ్లు జల్లుతుందనడంలో సందేహం లేదు.
ఇటీవల ఎన్నికల సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలతో జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను రగిలించేందుకు టీడీపీ, అనుకూల మీడియా చేసిన ప్రచారం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇప్పుడు అలాంటి ప్రజా వ్యతిరేకతను కూడా చల్లార్చేలా జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ చేపడితే ఇక ప్రజల్లో జగన్ ప్రభుత్వానికి మరింత సానుకూలత ఏర్పడుతుందనే విషయంలో టీడీపీ నేతలు కూడా ఎదురుచెప్పడం లేదు. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలతో జగన్ పట్ల ప్రజల్లో మొగ్గు కొనసాగుతుండగా ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం చేపడితే ఇక సర్కారుకి మరింత ఆదరణ దక్కుతుందని అంతా అంగీకరిస్తున్నారు. దాంతో టీడీపీకి ఈ పరిణామాలు మింగుడుపడే అవకాశం లేదు. ఉగాదికి ముందే ఇదో పెద్ద చేదు వార్తగా ఆపార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.