iDreamPost
android-app
ios-app

భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై సుప్రీం ఏం చెప్ప‌బోతోంది..?

భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై సుప్రీం ఏం చెప్ప‌బోతోంది..?

ఇటీవ‌ల‌ పంజాబ్‌లో ప‌ర్య‌టించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఊహించ‌ని భంగ‌పాటు ఎదురైంది. భద్రతా వైఫ‌ల్యం కార‌ణంగా ఆయ‌న దాదాపు ఇర‌వై నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవ‌ర్ పై నిలిచిపోవాల్సి వ‌చ్చింది. దీనిపై విచారణకు కమిటీ ఏర్పాటైంది. ప్రధాని భద్రతలో లోపానికి సంబంధించి కేంద్రం విచారణ జరుపుతోంది. ఇందుకోసం హోం మంత్రిత్వ శాఖ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని భద్రతలో లోపాన్ని ముగ్గురు సభ్యుల కమిటీ విచారించనుంది. త్రిసభ్య కమిటికి కేబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ సుధీర్ కుమార్ సక్సేనా నేతృత్వం వహిస్తారు. ఐబి జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, ఎస్‌పిజి ఐజి ఎస్ సురేష్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా హోంశాఖకు నివేదికను సమర్పించనుంది.

ఇదిలా ఉండ‌గా.. మోడీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది. ఇటీవలి పంజాబ్‌ పర్యటన సందర్భంగా భద్రతా కారణాలతో ప్రధాని మోదీ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయని, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకుండా ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. లాయర్స్‌ వాయిస్‌ అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలుచేసింది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. గత శుక్రవారం దీన్ని విచారించిన ధర్మాసనం… కోర్టు విచారణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిటీలు జనవరి 10 వరకు ఎలాంటి దర్యాప్తును ప్రారంభించవద్దని పేర్కొంది.

Also Read : క‌రోనా క‌ల‌క‌లం.. మోడీ కీల‌క నిర్ణ‌యం..

ఛ‌న్నీ.. ప్రియాంక‌కు వివ‌ర‌ణ ఇచ్చార‌ట‌.

కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కొద్ది రోజులుగా పంజాబ్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మోడీ ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. అయితే ప్రధాని భద్రతలో ఎలాంటి లోపం లేదని.. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు. అకస్మాత్తుగా ప్రధాని షెడ్యూల్ మార్చడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇప్ప‌టికే వెల్ల‌డించారు.

ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్‌ జస్టిస్‌ మెహతాబ్‌ సింగ్‌ గిల్‌, హోం వ్యవహారాల ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనురాగ్‌ వర్మ మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక వచ్చిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చన్నీ చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ.. భద్రతా వైఫల్యం గురించి కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీకి ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ వివరణ ఇవ్వడంపై బీజేపీ మండిప‌డుతోంది.

గాంధీ కుటుంబంపై కాంగ్రెస్‌ నేతలు మరోసారి తమ భక్తిని చాటుకున్నారని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. మోడీ పర్యటనలో భద్రతా లోపంపై తాను ప్రియాంకకు అన్ని వివరాలు చెప్పానని చన్నీ స్వయంగా చెప్పారని పీయూష్‌ గుర్తు చేశారు. దీన్నిబట్టి ప్రధాని భద్రత విషయంలో ఉద్దేశపూర్వకంగానే కుట్ర పన్ని, ఆయన ప్రాణాలను ముప్పులో పెట్టారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రియాంకా గాంధీ రాజ్యాంగబద్ధ పదవిలోనూ లేరని, పార్టీ నాయకురాలికి సున్నితమైన అంశాన్ని సీఎం ఇలా ఎందుకు వివరించి చెబుతున్నారని బీజేపీ నేత సంబిత్‌ పాత్ర ప్రశ్నించారు. ఈ విషయంపై ‘గాంధీ కుటుంబం’ సమాధానం చెప్పాలని ఆయన మీడియా సమావేశంలో డిమాండ్‌ చేశారు. ప్రధాని భద్రత విషయంపై ప్రియాంకకు ఛన్నీ వివరాలు చెబుతుండడం చాలా సీరియస్‌ విషయమని బీజేపీ నేత గౌరవ్‌ భాటియా మండిపడ్డారు.

Also Read : 400 మంది పార్ల‌మెంట్ సిబ్బందికి క‌రోనా : బ‌డ్జెట్ స‌మావేశాల మాటేంటి?