iDreamPost
android-app
ios-app

మధ్యప్రదేశ్ రాజకీయం.. సుప్రీంలో కమల్నాథ్ కు చుక్కెదురు…

మధ్యప్రదేశ్ రాజకీయం.. సుప్రీంలో కమల్నాథ్ కు చుక్కెదురు…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక మార్గం మూసుకుపోయింది. తన ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని గవర్నర్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ముఖ్య మంత్రి కమల్నాథ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ మేరకు పలుమార్లు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈరోజు సోమవారం 68 పేజీల సుదీర్ఘ తీర్పును వెల్లడించింది.

మధ్యప్రదేశ్ లో 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరిగి 15 నెలలకే కమలనాథ్ సర్కార్ కుప్పకూలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత చీలికలు చివరికి ఆ పార్టీ ప్రభుత్వం కూలిపోయేందుకు దారితీశాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గత ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన జ్యోతిరాదిత్య సింధియాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. ముఖ్యమంత్రి అవుతారని భావించిన జ్యోతిరాదిత్య సింధియా స్థానంలో సీనియర్ నేత కమల్నాథ్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా జ్యోతిరాదిత్య సింధియాకు సరైన ప్రాధాన్యత కల్పించలేదు. ఈ నేపథ్యంలో తన వర్గానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారందరితో కలిసి బిజెపిలో చేరారు. 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది.

ఈ నేపథ్యంలో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. బలం కూడగట్టుకునేందుకు కమల్నాథ్ విఫలయత్నం చేశారు. సరైన బలం లేకపోవడంతో అసెంబ్లీలో బలపరీక్ష కు ముందే రాజీనామా చేశారు. అనంతరం బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి సీఎం పీఠం అధిష్ఠించారు.

ఈ నేపథ్యంలో కమల్ నాథ్.. గవర్నర్ తనను బలం నిరూపించుకోవాలని ఆదేశాలు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరైన కారణం ఉంటే గవర్నర్ బలం నిరూపించుకోవాలని ఆదేశాలు జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యాంగంలో గవర్నర్ కు ఉన్న అధికారాలను వెల్లడిస్తూ 68 పేజీల సుదీర్ఘ తీర్పును ఈరోజు సోమవారం వెల్లడించింది.