Idream media
Idream media
2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తుది తీర్పుతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది.ఈ సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించింది.ట్రయల్ కోర్టు న్యాయమూర్తి విచారణ పూర్తి చేయడానికి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలను ఉపయోగించాలని న్యాయమూర్తులు ఆర్ ఎఫ్ నరిమాన్ మరియు సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం సూచించింది. ట్రయల్ జడ్జి ప్రస్తుత గడువు “ఇకపై ఉల్లంఘించబడదని” నిర్ధారించాలని సుప్రీం కోర్టు తెలిపింది.నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణ ఎదుర్కొంటున్న 32 మందిలో ప్రముఖ బిజెపి అగ్ర నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళి మనోహర్ జోషి, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి, సిట్టింగ్ ఎంపిలు బ్రిజ్ భూషణ్ సింగ్, సాక్షి మహారాజ్ ఉన్నారు. తాజాగా 1992 డిసెంబర్ 6 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై విచారణ నిర్ణీత గడువులో ముగించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో రాజకీయ వర్గాలలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత, అయోధ్యలో నమోదైన రెండు కేసులలో ఒకటి బాబ్రీ మసీదును కూల్చివేసే కుట్రకు సంబంధించినది కాగా, మరొకటి కట్టడాన్ని కూల్చివేసేందుకు జనాన్ని రెచ్చగొట్టే నందుకు.ఈ సంఘటనపై సుమారు 47 కేసులు నమోదు చేయబడినప్పటికీ తర్వాత అవి కూల్చివేత కేసులో విలీనం చేశారు.రెండు కేసులను విడివిడిగా విచారణ జరిపారు.లక్నో కోర్టులో నిర్మాణాన్ని కూల్చివేసేందుకు కుట్రపన్నారనే ఆరోపణలపై విచారణ జరపగా, రాయబరేలి కోర్టులో నిర్మాణాన్ని పడగొట్టడానికి జనాన్ని ప్రేరేపించారనే ఆరోపణలపై విచారణ చేశారు.
ఏప్రిల్ 19, 2017 న, పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను కలిపి విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ కేసు విచారణను ముగించడానికి లక్నోలో ప్రత్యేక కోర్టు (అయోధ్య ప్రకరన్) ను ఏర్పాటు చేసింది. ఇంతకుముందు హైకోర్టు కేసు నుంచి తప్పించిన 13 మంది నిందితులపై ఉన్న అభియోగాలను పునరుద్ధరించాలని ఉన్నత కోర్టు ఆదేశించింది. బిజెపి నాయకుడు, మాజీ ఎంపి బైకుంత్ లాల్ శర్మతో సహా మొత్తం 13 మంది నిందితులలో ఏడుగురు మరణించారు. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న ఆరుగురు వ్యక్తులు రామ్ విలాస్ వేదాంతి, చంపత్ రాయ్, మహంత్ నృత్య గోపాల్ దాస్, మహంత్ ధరం దాస్, సతీష్ ప్రధాన్ మరియు అప్పటి యుపి సిఎం కళ్యాణ్ సింగ్. రాయ్ బరేలిలో విచారణ ఎదుర్కొంటున్న నిందితులపై క్రిమినల్ కుట్ర ఆరోపణ (ఐపిసి సెక్షన్ 120 బి) ను కేసులో చేర్చాలని అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించింది.
2019 నవంబర్ 9న అయోధ్య వివాదంపై తుది తీర్పును వెలువరిస్తూ “1992 డిసెంబర్ 6న కరసేవకులు వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం.మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో ముస్లిం వర్గాలకు కచ్చితంగా న్యాయం జరగాల్సిందే”అని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొన్న విషయం గమనార్హం.