Idream media
Idream media
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం హక్కులపై కొనసాగుతున్న వివాదం పరిష్కారమైంది. దాదాపు 9 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యకు సుప్రిం పరిస్కారం చూపింది. ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను ట్రావెన్‌కోర్ కుటుంబానికే అప్పగిస్తూ తీర్పు చెప్పింది. ఆలయంపై రాజకుటుంబానికి ఉన్న హక్కులను సమర్థించింది. ఆలయ నిర్వహణకు తాత్కాలికంగా త్రివేండ్ర జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. శాశ్వత కమిటీ ఏర్పాటయ్యే వరకూ ఈ కమిటీ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తుందని సుప్రిం తన తీర్పులో వెల్లడించింది.
అనంత పద్మనాభ స్వామి ఆలయం నేలమాలిగల్లో ఉన్న గదుల్లో అనంతమైన నిధి ఉందని పదేళ్ల కిత్రం ప్రచారం సాగింది. ఆ నిధి వెలికితీతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై కేరళ ప్రభుత్వం నిధిని వెలికి తీయాలని భావించగా.. ట్రావెన్‌కోర్ రాజకుటుంబం వ్యతిరేకించింది. ఈ వివాదం కేరళ హైకోర్టుకు చేరింది. అయితే కేరళ హైకోర్టు 2011లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నేల మాలిగల్లో ఉన్న వస్తువులను వెలికితీసి మ్యూజియంలో పెట్టాలని తీర్పు చెప్పింది. ఆలయంపై ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి ఉన్న హక్కులను తొలగించింది. ఈ విషయంపై రాజకుటుంబం 2012లో సుప్రింను ఆశ్రయించింది. కేరళ హైకోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేసిన సుప్రిం అప్పటి నుంచి ఈ కేసును విచారిస్తోంది. తాజాగా ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.