Idream media
Idream media
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదంపై సుప్రిం కోర్టులో విచారణ జరిగింది. ఇరు వైపుల వాదనలను విన్న ధర్మాసనం ఏపీ పంచాయతీ ఎన్నికలపై జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘానికి అనుమతిస్తూ ఏపీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రిం కోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేష్‌రాయ్ ధర్మాసనం ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు రెండూ ఒకే సారి నిర్వహించాలని హైకోర్టు చెప్పడం సరికాదన్నారు. దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి మొదటి డోసు పూర్తవుతుందని, నెల రోజుల విరామం తర్వాత తుది డోసు ఇస్తారని పేర్కొన్నారు. గోవాలో కూడా వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా వేశారని తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం ఎన్నికలపై జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.