iDreamPost
android-app
ios-app

భక్తికి, పిచ్చికీ తేడా చెరిగిపోయి జరిగిన మారణకాండలు

భక్తికి, పిచ్చికీ తేడా చెరిగిపోయి జరిగిన మారణకాండలు

మదనపల్లెలో భక్తి పేరిట ఇద్దరు కూతుళ్లను చంపిన తల్లిదండ్రులు మూఢభక్తి పిచ్చి స్థాయికి చేరుకుంటే జరిగే అనర్ధాలను సమాజానికి చూపించారు. మూఢభక్తికీ పిచ్చికీ మధ్య ఉన్న సన్నటి సరిహద్దు చెరిగిపోయినప్పుడు ఇలాంటి అనర్దాలు జరుగుతాయి. అయితే ఇది ఇలాంటి మొదటి సంఘటన కాదు, చివరిది కూడా కాబోదు. గతంలో మనదేశంలో, ప్రపంచంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.

అల్లా కోసం కూతుర్ని బలి ఇచ్చిన తల్లి

ఈస్ట్ లండన్‌లో నివసిస్తున్న శ్యామా ఆలీకి తరచుగా దేవుడు తనతో సంభాషిస్తూ ఉంటాడని ఆమె నమ్మకం. దేవుడు ఆమెని దుష్ట శక్తులతో పోరాడమని చెప్తూ ఉంటాడు. ఆ దుష్ట శక్తులని తరిమేయడానికి, వాటిని నిర్వీర్యం చేయడానికి ఆమె పోరాటం చెస్తూ ఉంటుంది. ఆ పనిలో భాగంగా ఇంట్లోని బొమ్మల కళ్ళు పీకేయడం, డీవీడీ కవర్స్ మీద బొమ్మలకి కళ్ళు చెరిపేయడం చేస్తూ ఉంటుంది. 2011 సెప్టెంబరులో 30న భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె తన నాలుగేళ్ళ కూతురుతో ఇంట్లో ఉన్న సమయంలో దేవుడి పట్ల తన ప్రేమని నిరూపించుకోవడం కోసం తన కూతుర్ని బలి ఇవ్వమని దేవుడు ఆమెని కోరుతున్నట్లు ఆమెకి అనిపించింది.

అంతే ఆ పిల్లని బరబరా వంటింట్లోకి ఈడ్చుకెళ్ళి గొంతు పిసికి చంపేసింది. అంతటితో ఆగకుండా మ్యూజిక్ సిస్టంలో కొరాన్ ప్రవచనాలు వింటూ ఆ పిల్ల దేహాన్ని వంటింట్లోని ఒక కత్తితో ముక్కలుగా కోసి, కాలేయాన్ని బయటకి తీసి తన దైవ భక్తికి నిదర్శనంగా దేవుడికి అర్పించింది. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన భర్త ఆ దృశ్యాన్ని చూసి పోలీసులకి ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చి ఆమెని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వాళ్ళు ఆమెని మానసిక రోగుల ఆసుపత్రికి పంపి చికిత్స మొదలు పెట్టారు.

తనతో పాటు ఇద్దరు పిల్లల్ని అగ్నితో శుద్ధి చేసిన తల్లి

జహంగీర్ పురి, డిల్లీ లో ఉంటున్న 35 సంవత్సరాల రొమిల్లాకి తానొక దేవతనని గట్టి నమ్మకం. ఆమె తరచుగా శక్తి పూజలు చెస్తూ ఉండేది. ఈ విషయంలొ ఆమెకి ఒక మంత్రగాడు పరిచయమై ఆమెతో పూజలు చేయిస్తుండేవాడు. ఒక సారి ఆ మంత్రగాడు ఆమెతో ఆమె కుటుంబం మీద ఒక దుష్ట శక్తి కన్నేసిందని, దానిని తరమడానికి కొన్ని ప్రత్యేక పుజలు చేయాలని నమ్మ బలికాడు. అయితే తాను దేవతనై ఉండి పూజలు చేయడమేమిటని ఆమె భావించింది. తనని, తన పిల్లల్ని అగ్నితో శుద్ధి చేస్తానని, తమని నిప్పు ఏమీ చేయలేదని ఇంట్లో వాళ్ళతో చెప్పేది. అయితే వాళ్ళు ఆ మాటల్ని అంతగా పట్టించుకోలేదు.

2011 అక్టోబర్ 4న భర్త ఇంట్లో లేని సమయంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి అగ్ని స్నానం చేయాలని నిశ్చయించుకొంది. తన కూతుళ్ళు, ఎనిమిదేళ్ల గీత, అయిదేళ్ళ జయల పైన, తన పైన కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించింది. ఇరుగు పొరుగు అది చూసి మంటలు ఆర్పి వారిని హాస్పిటల్‌కి తీసుకు పోయినా అప్పటికే 95% కాలిన గాయాలతో ముగ్గురూ చనిపోయారు.

ఒకే కుటుంబంలో పదకొండు మంది ఆత్మహత్య

ఉత్తర ఢిల్లీ, బురారి ప్రాంతానికి చెందిన భాటియా కుటుంబంలో పెద్దవాడు లలిత్ భాటియా. ఒక కిరాణా దుకాణం, పైపులు అమ్మే దుకాణం నడుపుకుంటున్న ఆ కుటుంబ పెద్ద, లలిత్ భాటియా తండ్రి భోపాల్ సింగ్ 2007లో మరణించిన తర్వాత కొద్ది రోజులకే లలిత్ భాటియా తన తండ్రి ఆత్మ తనతో మాట్లాడడం మొదలు పెట్టిందని, ఆ ఆత్మ తనతో ఏం చెప్పిందో ఒక పుస్తకంలో రాస్తూ వచ్చాడు. కుటుంబమంతా కలిసి తరచూ పూజలు, పునస్కారాలు నిర్వహిస్తూ ఇరుగుపొరుగుతో కలవడం తగ్గించారు. అందరూ కలిసి నా దగ్గరకు వచ్చేయండి, తర్వాత అందరం కలిసి మళ్ళీ పుడదాం అని తండ్రి ఆత్మ చెప్పిన విషయం నోటు పుస్తకంలో రాసి, 2018 జూన్ 30 తేదీన కుటుంబంలోని పదకొండు మంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

909 మంది అనుచరుల చావుకు కారణమైన జిమ్ జోన్స్

అమెరికాకు చెందిన జిమ్ జోన్స్ బోధనల పట్ల ఆకర్షితులై ఎంతోమంది అతని అనుచరులుగా మారారు. ఇండియానా రాష్ట్రంలో పీపుల్స్ టెంపుల్ పేరిట అతను ఏర్పాటు చేసిన చర్చ్ ఆవరణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు తలెత్తడంతో తన అనుచరులతో కలిసి దక్షిణ అమెరికాలో ఉన్న గయానాకు మకాం మార్చాడు జోన్స్. అయితే ఇక్కడ కూడా అక్రమాలు జరుగుతున్నాయని వార్తలు రావడంతో అమెరికా కాంగ్రెస్ సభ్యులు నలుగురు నిజనిర్ధారణ కోసం వస్తే జోన్స్ సెక్యూరిటీ సిబ్బంది వారిని కాల్చి చంపారు. దాంతో అతని ఆవరణ మీద అమెరికా కమాండోలు దాడి చేసినప్పుడు తనతో కలిసి పరలోకానికి ప్రయాణం కమ్మని ఆదేశాలు ఇచ్చి అనుచరులందరితో సైనైడ్ కలిపిన తీర్థం తాగించి, తనూ తాగాడు. వీరిలో రెండు వందల మంది చిన్న పిల్లలు.

గ్రహాంతరవాసులతో కలిసి ప్రయాణించాలని ఆత్మహత్యలు

1990 దశకంలో అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ డియాగోలో హెవెన్స్ గేట్ అని ఒక ముఠా తయారయింది. మార్షల్ ఆపిల్ వైట్, బోనీ నెటిల్స్ అన్న ఇద్దరు మొదలుపెట్టిన ఈ గ్రూపు సభ్యులు త్వరలో కనిపించబోతున్న హాలెబాప్ తోకచుక్క వెనకాలే ఒక ఫ్లైయింగ్ సాసర్ లో గ్రహాంతర వాసులు వస్తారని నమ్మారు. వారితో కలిసి రోదసిలో సుదూర తీరంలో ఉన్న గ్రహానికి వెళ్ళాలన్నది ఈ సంఘసభ్యుల లక్ష్యం. అందులో భాగంగా 1997 మార్చి నెలలో శాన్ డియాగో లోని తమ స్థావరంలో వ్యవస్థపకులతో సహా 39 మంది సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.

అనేక దేశాల్లో ఒకేసారి ఆత్మహత్యలు

1984లో స్విట్జర్లాండులో ఆర్డర్ ఆఫ్ ది సోలార్ టెంపుల్ అని ఒక రహస్య సంఘాన్ని జోసెఫ్ డి మాంబ్రో, లూక్ జౌరెట్ అని ఇద్దరు ప్రారంభించారు. కెనడా, ఫ్రాన్స్ దేశాల్లో కూడా ఈ సంఘానికి శాఖలు ఏర్పడ్డాయి. 1994 లో 74 మంది ఒకసారి, వ్యవస్థపకులతో సహా 53 మంది మరోసారి ఈ సంఘానికి చెందిన శాఖల్లో తుపాకీతో తలమీద కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1995 లో ఈ సంఘానికి చెందిన 16 శవాలను సగం కాలి ఉండగా ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాల్లో కనుగొన్నారు.

ఉగాండా మారణహోమంలో 900 మంది

ఉగాండాలో రోమన్ కాథలిక్ చర్చినుంచి విడిపోయి జోసెఫ్ క్వివెటెరె నాయకత్వంలో ఒక ముఠా ఏర్పాటయింది. బైబిల్ లో చెప్పిన టెన్ కమాండ్ మెంట్స్ అందరూ పాటించేలా చేయడం తమ లక్ష్యమని ప్రకటించింది ఈ సంస్థ. 1999 డిసెంబర్ 31న ప్రపంచం అంతమవబోతోందని ప్రకటించి తన సభ్యులందరూ అందుకు సన్నద్ధం కావాలని ప్రకటించాడు అధ్యక్షుడు క్వివెటెరె. అయితే ఆ తేదీన ప్రపంచం అంతం కాకపోవడంతో సభ్యులు కొంతమంది అతని సామర్థ్యం మీద సందేహాలు లేవనెత్తారు. దేవుడు ప్రపంచాన్ని అంతం చేసే తేదీ మార్పు చేశాడు. మార్చి 17 న ప్రపంచం అంతం కావడం ఖాయమని ప్రకటించాడు జోసెఫ్ క్వివెటెరె. ఆ రోజున సంస్థ సభ్యులు 900 మంది మరణించి ఉండగా పోలీసులు కనుగొన్నారు. కొందరు విషం సేవించి, మరికొందరు తుపాకీతో కాల్చుకొని మరణించారు. వారిలో సంస్థ అధ్యక్షుడు లేడు. అతని కోసం పోలీసులు ఎంత గాలించినా అతని ఆచూకీ దొరకలేదు.

వాకో ముట్టడి

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని వాకో నగరం వెలుపల డేవిడ్ కొరేష్ అనే మత బోధకుడు సెవెన్త్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్నాడు. యేసు క్రీస్తు టెక్సాస్ రాష్ట్రంలోని ఒక కొండ మీద అవతరించబోతున్నాడు, తన చర్చిలో ఉండబోతున్నాడని ప్రచారం చేసి చాలా మంది అనుయాయులను కూడగట్టాడు. ఈ లోపల ఆ చర్చి ఆవరణలో డ్రగ్స్, అక్రమ ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేయడానికి వచ్చినప్పుడు వారికి బుల్లెట్లతో స్వాగతం పలికారు కొరేష్ అనుచరులు. దాంతో అదనపు బలగాలను రప్పించి ఆవరణను ముట్టడించారు పోలీసులు. లొంగిపొమ్మని మైకులో పోలీసులు ఇచ్చిన ఆఙలను అమలు చేస్తానంటూనే సంప్రదింపుల పేరిట 51 రోజులు సాగదీశాడు కొరేష్. చర్చలలో పురోగతి లేకపోవడంతో చర్చిలోకి సాయుధ బలగాలు బలవంతంగా ప్రవేశించే ప్రయత్నం చేస్తుండగా చర్చి లోపల ఉవ్వెత్తున మంటలు రేగాయి. కొరేష్ సహా 79 మంది అందులో మరణించారు. ఇది ప్రమాదమా లేక ఆత్మాహుతి చేసుకున్నారా అన్నది పోలీసులు తేల్చలేకపోయారు.

మూఢభక్తితో ఇలాంటి పిచ్చి పనులు చేసేవారు అందుకు కొంతకాలం ముందు నుంచి అందుకు సంబంధించిన లక్షణాలు చూపిస్తుంటారు అని మానసిక వైద్య నిపుణులు చెప్తారు. ఈ దశలో బంధువులో, మిత్రులో ఆ లక్షణాలు గుర్తించగలిగితే విలువైన ప్రాణాలు కాపాడగలుగుతారు.