iDreamPost
iDreamPost
ఇప్పుడంటే సూపర్ స్టార్ గా ప్రిన్స్ గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు కానీ మహేష్ బాబుకు ఇదంతా ఒక్క రోజులోనో లేదా సినిమాతోనో వచ్చింది కాదు. దీని వెనుక చాలా కష్టం, కసి తపన ఉన్నాయి. కృష్ణ గారి వారసుడిగా రాజకుమారుడుతో పరిచయమైనా తాను నిలదొక్కుకోవాలంటే అదొక్కటే సరిపోదని గుర్తించి దానికి తగ్గట్టే తనను తాను మలుచుకున్న తీరు నిజంగా ప్రశంసనీయం. వరస ఆఫర్లతో నిర్మాతలు క్యూ కట్టినా రెండో సినిమాకే రిస్క్ చేయబోయిన జ్ఞాపకాన్ని ఓ సారి రీకాల్ చేసుకోవడం ఎంతైనా అవసరం.
2000 సంవత్సరంలో వైవి ఎస్ చౌదరి దర్శకత్వంలో మహేష్ యువరాజు చేశాడు. సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లు కాగా పవన్ మూవీస్ తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సంగీత దర్శకుడు రమణ గోగుల ఏకంగా 11 ట్రాక్స్ దీనికోసం కంపోజ్ చేశారు. కుచ్ కుచ్ హోతా హై ఛాయల్లో డిఫరెంట్ ట్రీట్మెంట్ తో ఎంటర్ టైనింగ్ లవ్ స్టొరీగా చౌదరి దీన్ని తీర్చిద్దిద్దారు. ఇక్కడ రిస్క్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే రెండో సినిమాకే లేలేత పాల బుగ్గలతో యాపిల్ పండులా ఉన్న మహేష్ ని ఓ బాబుకి తండ్రిగా చూపించడం అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అందుకే చక్కని పాటలు, నీట్ గా సాగే స్క్రీన్ ప్లే బలంగా ఉన్నా ఇలాంటి కొన్ని బలహీనతల వల్ల యువరాజు భారీ విజయాన్ని నమోదు చేసుకోలేకపోయినా 19 కేంద్రాల్లో 100 రోజులు ఆడి హిట్ అనిపించుకుంది.
అదే సమయంలో దీనికి ముందు వెనుకా చాలా తక్కువ గ్యాప్ తో పవన్ కళ్యాణ్ బద్రి, నాగార్జున నువ్వు వస్తావని, మణిరత్నం సఖి పోటీ పడుతూ మ్యుజికల్ లవ్ బ్లాక్ బస్టర్స్ కావడంతో వాటి ప్రభావం యువరాజు మీద తీవ్రంగా పడింది. అయినప్పటికీ ఈ మూవీని ఫ్యాన్స్ ఇప్పటికీ స్పెషల్ గానే భావిస్తారు. ఇక్కడ పిక్ దాని ఓపెనింగ్ రోజుది. అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, రాఘవేంద్ర రావు, రామానాయుడు తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్ గా జరిగింది. నిన్నటితో యువరాజు 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా దర్శకుడు వైవిఎస్ చౌదరితో పాటు ఫ్యాన్స్ సైతం యువరాజు జ్ఞాపకాలను అలా తట్టి లేపారు