iDreamPost
android-app
ios-app

సూళ్లూరుపేట వైసీపీ కౌన్సిలర్‌ సురేష్‌ హత్య ఎలా జరిగింది..?

సూళ్లూరుపేట వైసీపీ కౌన్సిలర్‌ సురేష్‌ హత్య ఎలా జరిగింది..?

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ కౌన్సిలర్‌ ఈ రోజు సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. 16వ వార్డు కౌన్సిలర్‌ తాళ్లూరి వెంకట సురేష్‌ను దుండగులు కత్తులతో నరికి చంపారు. ఆర్థికపరమైన లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

వైశ్య సామాజికవర్గానికి చెందిన సురేష్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటారు. టర్నోవర్‌ పెద్ద మొత్తంలో ఉంటుంది. మున్సిపల్‌ ఎన్నికలకు ముందు కౌన్సిలర్‌గా పోటీ చేయాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరారు. వైశ్య సామాజికవర్గం అధికంగా ఉండే 16వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచారు. సౌమ్యుడుగా, వివాద రహితుడుగా సురేష్‌కు పేరుంది.

ఈ రోజు తన జన్మదినం కావడంతో ఉదయం కుటుంబంతో కలసి తిరుమల వెళ్లి వచ్చారు. బ్రాహ్మణలవీధిలో నివాసం ఉంటున్న సురేష్‌.. అక్కడ కార్‌ పార్కింగ్‌ అవకాశం లే కపోవంతో తన కారును రైల్వే స్టేషన్‌ రోడ్డులోని పోట్టిశ్రీరాములు వీధిలో పార్కింగ్‌ చేస్తుంటారు. రోజు మాదిరిగానే ఈ రోజు పార్కింగ్‌ చేసేందుకు వచ్చారు. తిరుపతి నుంచి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులను బ్రహ్మణవీధిలోని ఇంటి వద్ద దించి.. కార్‌ను పార్క్‌ చేసేందుకు వెళ్లారు. అక్కడ కాపు కాసి ఉన్న దుండగులు సురేష్‌ను హత్య చేశారు.

కారు సీటులో కుర్చున్నప్పుడే సురేష్‌పై కత్తులతో దాడి చేశారు. శరీరంపై 8 చోట్ల కత్తిపోట్లున్నాయి. హత్యలు చేయడంలో ఆరితేరిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని హత్య జరిగిన తీరుతో అర్థమవుతోంది. సురేష్‌ లివర్, కిడ్నీ, ఛాతీపైన పొడిచారు. రెండు చేతుల మణికట్టు వద్ద నరాలను కట్‌ చేశారు. పెరుగులాడినట్లుగా, ప్రతిఘటించినట్లుగా అక్కడ పరిణామాలు లేకపోవడంతో ఈ హత్యలో ఓ బృందం పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. పదేళ్ల కిందట ఇదే తరహాలో తడలోనూ హత్య జరిగింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఈ దిశగానూ విచారణ చేస్తున్నారు.

కోట్ల రూపాయల్లో రోజు వారీ ఫైనాన్స్‌ చేసే సురేష్‌.. తిరుపతిలో 6 కోట్ల రూపాయల విలువ చేసే ఓ స్థల వివాదంలో ఇరుక్కున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వివాదమే హత్యకు దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రత్యర్థులు కిరాయి హంతకులను పురామాయించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తిగతమైన వ్యవహారాలు హత్యకు దారితీసిఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఈ రెండు కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : రేవంత్‌ రెడ్డికి కోమటిరెడ్డి ఏం సలహా ఇచ్చారు..?