iDreamPost
android-app
ios-app

బెంగాల్-రివర్స్ వలసలు

బెంగాల్-రివర్స్ వలసలు

బెంగాల్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. అధికార తృణమూల్, బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బెంగాల్ కోటలో పాగా పాతేందుకు సర్వశక్తులొడ్డుతున్న బీజేపీ దీదీని ఒంటరి చేయాలని కంకణం కట్టుకుంది. ఆపరేషన్ ఆకర్ష్ తో తృణమూల్ కోట గండికొట్టడం మొదలుపెట్టింది. టీఎంసీ తిరుగుబాటు నేత సువేందు అధికారి సహా పదిమంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాషాయ తీర్థం పుచ్చుకోవడంతో దీదీకి గట్టిదెబ్బే తగిలింది. కానీ బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది మమతా బెనర్జీ. టీఎంసీని ఖాళీచేయాలనుకుంటున్న బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది.

బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు రివర్స్ మైగ్రేషన్ స్ట్రాటజీని ప్లే చేస్తోంది మమతా బెనర్జీ. ఓవైపు తృణమూల్ నేతలు బీజేపీ బాట పడుతుంటే, బీజేపీ నేతల్ని తృణమూల్ గూటికి చేర్చుకుంటోంది దీదీ. బెంగాల్ లో తృణమూల్ శకం ముగిసినట్లే అని బీజేపీ అగ్రనేతలు ఓ వైపు ప్రచారం చేస్తుంటే, ఆ పార్టీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్ బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటన ముగిసిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం టీఎంసీ నేతలు సువేందు అధికారి, తాప‌సి మొండ‌ల్‌, అశోక్ దిండా, సుదీప్ ముఖ‌ర్జి, సైక‌త్ పంజా, షిభ‌ద్ర ద‌త్త‌, దీపాలి బిశ్వాస్‌, సుక్రా ముండా, శ్యామ‌ప్ద ముఖ‌ర్జి, విశ్వజిత్ కుందు, బ‌న‌శ్రీ మైతీతో పాటు ప‌ర్బ బుర్ద్వాన్ ఎంపీ సునీల్ మొండ‌ల్‌, మాజీ ఎంపీ ద‌శ‌ర‌థ్ టిర్కీ అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అవుతుందని, చివరకు మమతా బెనర్జీ ఒక్కరే ఆ పార్టీలో మిగులుతారంటూ అమిత్ షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అమిత్ షా పర్యటన ముగిసీ ముగియక ముందే బీజేపీకి చేదు అనుభవాన్ని రుచిచూపించింది దీదీ. ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్ బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. బీజేపీలో మహిళగా తనకు సరైన గౌరవం దక్కలేదని, అందుకే ఆ పార్టీని వీడినట్లు ఆమె ప్రకటించారు. బెంగాల్ లో అసలు బీజేపీకి సీఎం అభ్యర్థే లేడని వ్యాఖ్యానించారు. సుజాతా మొండల్ ఖాన్ చేరికతో ఆమె భర్త కూడా తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం మొదలైంది. అదే జరిగితే… బీజేపీ గట్టి దెబ్బ తగినట్లే. తృణమూల్ కాంగ్రెస్ ఈ స్ట్రాటజీ వెనక ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ పరాజయం తప్పదని, రెండంకెల సీట్లను సొంతం చేసుకోవడం కష్టమే అంటూ ప్రశాంత్ కిశోర్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తిరేకెత్తిస్తోంది. డబుల్ డిజిట్ కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలిస్తే తాను ట్విట్టర్ ను వదిలేస్తానంటూ సవాల్ విసిరారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా సీట్లు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్న బీజేపీకి ఇప్పుడు గుబులు మొదలైంది. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు కొట్టి పారేసినా… దీదీ స్ట్రాటజీతో సొంత పార్టీ నుంచి వలసలు పెరుగుతాయా అనే సందేహం మొదలైంది. ఒక ప్రాంతీయ పార్టీ బీజేపీతో ఢీ అంటే ఢీ తలపడడం సాధారణ విషయం కాదు. ఈ విషయంలో మమతా బెనర్జీ మొదటి నుంచీ బీజేపీకి గట్టి ఫైట్ ఇస్తోంది. ఇప్పుడు కూడా అంతే. బీజేపీ దూకుడు ముందు ఎక్కడా తగ్గేది లేదనట్లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. మొత్తానికి పోటా పోటీగా మొదలైన ఇటు నుంచి అటూ, అటు నుంచీ ఇటు వలసలను ప్రోత్సహిస్తూ రెండు పార్టీలూ ఎన్నికల వాతావరణాన్ని రక్తికట్టిస్తున్నాయి. కప్పల తక్కెడను తలపిస్తున్నాయి.