iDreamPost
android-app
ios-app

సుజనా బ్యాంకు ఎగవేతలు – పార్టీ మారినా విచారణ ఆగునా..?

సుజనా బ్యాంకు ఎగవేతలు – పార్టీ మారినా విచారణ ఆగునా..?

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఎగవేత వ్యవహారంలో సుజనా చౌదరి పార్టీ మారినా తిప్పలు తప్పేట్టు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బీజేపీలోకి ఫిరాయించారు. సుజనాపై బీజేపీలో చేరకముందే బ్యాంకు ఎగవేతల ఆరోపణలున్నాయి.

బీజేపీలో చేరడంతో ఇక ప్రశాంతంగా ఉండోచ్చనుకున్న సుజనాకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.
రాజ్యసభ సభ్యుడు సుజానా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని విజయసాయి రెడ్డి తాజాగా రాష్ట్ర పతికి ఫిర్యాదు చేశారు. సుజనా చౌదరి అక్రమాలపై సమగ్ర వివరాలతో ఏడు పేజీల లేఖను రాష్ట్రపతికి విజయసాయి రెడ్డి అందించారు. ఆ లేఖపై స్పందించిన రాష్ట్రపతి దానిని సంబంధిత శాఖలకు పంపారు. దీంతో సుజనా అక్రమ వ్యవహారాలపై విచారణ అంశం ఆయా శాఖల పరిధిలోకి వచ్చాయి.

బ్యాంకు మోసాల వ్యవహారంలో సుజనా చౌదరిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈడీ సుజనా ఆస్తులను జప్తు కూడా చేసింది. అయితే ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు సుజనా చౌదరి టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించారని అప్పట్లో విమర్శలొచ్చాయి. టీడీపీలో చంద్రబాబుకు కుడిచేయి. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అన్ని ఆర్థికపరమైన అంశాలను చక్కబెట్టే సుజనా అంత సులువుగా పార్టీ మారరనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయినా పార్టీ మారారంటే అది ఈడీ కేసుల వల్లనేనన్నది విశ్లేషకుల అభిప్రాయం.

వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న చందంగా ప్రస్తుతం సుజనా చౌదరి వ్యవహారం ఉంది. పార్టీ మారినా అక్రమాలపై విచారణ మాత్రం తప్పేటట్లుగా లేదు. చట్టం ముందు అందరూ సమానులే అని సుజనా చౌదరిపై విచారణ జరుగుతుందా..? లేక తమ పార్టీ రాజ్యసభ సభ్యుడికి బీజేపీ మినహాయింపు ఇస్తుందా..? వేచి చూడాలి.