Idream media
Idream media
ఒకప్పుడు చక్కెరకి మంచి కాలం ఉండేది. మా చిన్నప్పుడు చక్కెర దొరికేది కాదు. రేషన్ షాప్ ముందు పడిగాపులు కాస్తే ఒకట్రెండు కిలోలు దొరికేది. బియ్యం కార్డు ఉంటే చక్కెర ఇవ్వరు. పండగలకి, పబ్బాలకి బ్లాక్‌లో కొనేవాళ్లు. పల్లెల్లో బెల్లం కాఫీ తాగేవాళ్లు. చక్కెరతో తాగేవాళ్లు షావుకార్ల కింద లెక్క. రాయలసీమ కరవు పల్లెల్లో పెళ్లి జరిగితే బెల్లం పాయసంతోనే విందు. లడ్డూ వడ్డిస్తే వాళ్ల పెళ్లి గురించి ఊరంతా చెప్పుకునేవాళ్లు. దానికి కారణం చక్కెర కొరత. బెల్లం ఆరోగ్యానికి మంచిదని, చక్కెర హానికరమని ఆ రోజుల్లో తెలియదు. దొరకదు కాబట్టి దాని విలువ ఎక్కువ అనుకునేవాళ్లం. చక్కెరే కాదు వరి అన్నానికి కూడా డిమాండ్. వరి పండని ప్రాంతాల్లో ప్రతిరోజూ కొర్రన్నం , జొన్నన్నం, జొన్న రొట్టెలు, రాగి సంగటే ఆహారం. ఇప్పుడు అంతా రివర్స్. చక్కెరని చూస్తే భయం. అన్నం చూస్తే అంతకు మించి భయం.
ఆ రోజుల్లో చక్కెర కొరతకి కారణం, చెరకు సాగు తక్కువ. సీమ జిల్లాల్లో చిత్తూరులో ఎక్కువ పండించేవాళ్లు. మిగిలిన జిల్లాల్లో అతి స్వల్పం. పండించిన చెరుకుని కూడా బెల్లం చేసేవాళ్లు. దానికి కారణం చక్కెర ఫ్యాక్టరీలు ఉండేవి కావు. తర్వాత రోజుల్లో ఫ్యాక్టరీలు పెరిగాయి. రేషన్ షాపుల ముందు నిలబడే ఖర్మ పోయింది. ఎక్కడపడితే అక్కడ దొరికే కాలం వచ్చింది. పెళ్లిలో ఐదు రకాల స్వీట్స్ వడ్డించే రోజులొచ్చాయి. చక్కెర ఉత్పత్తితో పాటు సుగర్ వ్యాధి కూడా పెరిగింది.
తాజా పరిస్థితి ఏమంటే డిమాండ్‌కు మించి ఉత్పత్తి. దాంతో చెరకు రైతులు రోడ్డున పడుతున్నారు. లాభాలు లేక ఫ్యాక్టరీలు మూసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 6 ఫ్యాక్టరీలు ఆగిపోయాయి. రైతులకి బకాయిలు పేరుకుపోయాయి.
దేశం మొత్తం మీద ఇదే పరిస్థితి. చక్కెర వినియోగం ఏటా 250 లక్షల టన్నులు ఉంటే ఈ ఏడాది 268 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. దాంతో పాటు గోదాముల్లో 140 లక్షల టన్నుల స్టాక్ ఉంది. ఎగుమతులు కూడా పెద్ద ఆశాజనకంగా లేవు. చెరకు తింటేనే తీపి. పండిస్తే చేదే!